రాజంపేట: డ్వాక్రా గ్రూపులో రుణం ఇవ్వలేదని గడ్డి మందుతాగి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మహిళ జిల్లా ఆస్పత్రిలోని ఐసియులో చికిత్స పొందుతోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… కొండాపూర్ గ్రామానికి చెందిన కీసరి వెంకవ్వ ఓ డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉంది. 2016లో తన పెద్ద కూతురు రేణుక తల్లి కోసం గ్రామ సంఘం ద్వారా 25 వేలు, స్త్రీనిధి ద్వారా 15 వేలు అప్పు తీసుకుంది.
అయితే అప్పు ఇటీవలే చెల్లించింది. చివరగా మిగిలిన 10 వేల రూపాయలు గ్రామస్తుల వద్ద అప్పు చేసి చెల్లించింది. సంఘానికి మళ్ళీ రుణం రాగానే తీసుకొని పదివేలు కట్టవచ్చని భావించింది. అయితే సంఘ సభ్యులు ఇటీవల బ్యాంకు నుంచి 3 లక్షలు తీసుకొని వెంకవ్వకు ఇవ్వకుండా మిగతా సభ్యులు తీసుకున్నారు. ఇదేంటని అడిగితే నీకు ఇవ్వము అని చెప్పారు. దాంతో పదివేలు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి తిరుగుతుండడంతో మనస్తాపానికి గురైన ఆమె గడ్డి మంది తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గతంలో డబ్బులు చెల్లించకపోతే ఇంటికి వచ్చి తాళం వేశారని బాధితురాలి కూతురు రేణుక తెలిపింది. కరోనా వల్ల పనులు లేక అప్పులు చెల్లించడం ఆలస్యం అయినందుకు ప్రస్తుతం రుణం ఇవ్వలేదని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
సభ్యుల తీర్మానం ప్రకారమే రుణం అందజేశాం: ఎపిఎం సాయిలు
సంఘ సభ్యుల తీర్మానం ప్రకారమే మల్లిక సంఘానికి మూడు లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. గ్రామానికి చెందినటువంటి మహిళా సంఘ సభ్యురాలు వెంకమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసింది. రుణం సంఘానికి మాత్రమే సంబంధం వ్యక్తిగత విషయాలు తమకు సంబంధం లేదు. సంఘాల్లో ఉన్నటువంటి మహిళలను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఎపిఎం సాయిలు తెలిపారు.