కోర్టులో తనకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో సోమవారం ఓ మహిళ డిజిల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మంతన్‌గౌరెల్లి అనుబంధ గ్రామం కేస్లీ తండాకు చెందిన జర్కుల చంద్రియ కు 30 సంవత్సరాల క్రితం కమలాభాయితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి జీవనం సాఫీగానే కొనసాగుతున్న తరుణంలో గత కొన్నాళ్ళుగా ఆస్త్తి గొడవలు జరుగుతున్నాయి. అంతలోనే నగరంలో ఉపాధి చేసుకుంటూ ఇంటికి వచ్చి పోతుండేవాడు చంద్రియ. కొన్నాళ్ళ క్రితం అతనికి పద్మ అనే మహిళతో పరిచయం ఏర్పడి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండవ వివాహం చేసుకున్నాడు. దీంతో మొదటి భార్యకు, చంద్రియకు మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మొదటి భార్య కుమార్తెకు పెళ్ళి చేశారు.
కానీ రెండవ కూతురు పెండ్లీడుకు రాగానే చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో మొదటి భార్య 1.30 గుంటల భూమిలో వాటా కావాలని కోర్టులో భర్తపై కేసు వేసింది. అంతకు ముందే రెండవ భార్య పద్మతో కలిసి 0.20 గుంటల భూమిని అమ్మేశాడు. మరో ఎకరా భూమిని కూడా అమ్మేందుకు చంద్రియ ప్లాన్ చేస్తున్నాడు. కోర్టులో కేసు ఉండగా భూమిని ఎలా అమ్ముకుంటారని తెలిసి న్యాయవాది కేసు నిర్వీర్యం చేస్తున్నారని మొదటి భార్య వాపోయింది. న్యాయం చేయాలని లాయర్లను బతిమాలింది. అయినా ఫలితం లేదని భావించి సోమవారం కోర్టు ముందు డిజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పోలీసులు ఆమె నుంచి డీజిల్ బాటిల్‌ను లాగేసుకొని నివారించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించి ఆమెకు కౌన్సెలింగ్ యిచ్చి మరొకసారి కోర్టుకు తీసుకువచ్చారు. న్యాయం స్థానంలోనే చట్టపరంగా కొట్లాడాలని ఆమెకు సూచించారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని సిఐ జగదీష్ తెలిపారు.