భార్యపై అనుమానం పెంచుకుని ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…రంగారెడ్డిజిల్లా, తెలుకపల్లి మండలం, గౌరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పిట్టల ముత్యాలు, సునీతను 16 ఏళ్ల క్రితం సునీతతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు చైతన్య(15), గౌతం(11), హర్ష(9) ఉన్నారు. బతుకుదెరువు కోసం కుటుంబంతోపాటు వచ్చి కోకపేటలో ఉంటూ హోటల్ నడిపిస్తున్నారు. మద్యానికి బానిసగా మారిన ముత్యాలు, తరచూ భార్యను వేధించేవాడు. గతంలో మొదటి భార్యను ఇలాగే దాడి చేయడం, మానసికంగా హింసించడం వల్ల ముత్యాలుకు విడాకులు ఇచ్చింది. తర్వాత సునీతను రెండో వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నప్పటి నుంచి సునీత ప్రవర్తనను అనుమానించడం, కొట్టడం చేస్తున్నాడు.
రోజు రోజుకు ముత్యాలు వేధింపులు ఎక్కువ కావడంతో సునీత భరించలేక ఇంటి నుంచి పిల్లలతో వెళ్లి శాంపేటలో ఆరు నెలలు ఉంది. ఈ క్రమంలోనే పెద్దలు పంచాయితీ చేయడంతో సునీతను వేధించనని ముత్యాలు హామీ ఇవ్వడంతో ఈ నెల 17వతేదీన తిరిగి ఇంటికి వచ్చింది. ఇలా వచ్చినప్పటి నుంచి మళ్లీ వేధించడం ప్రారంభించాడు. 19వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు సునీతపై దాడి చేసి జనవరి 1వ తేదీలోపు చంపివేస్తానని ముత్యాలు హెచ్చరించడంతో వెంటనే తన బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. తర్వాత కొద్ది సేపటికే నిందితుడు సునీతను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. వెంటనే అక్కడికి వచ్చిన సునీత బంధువులు ఆమె అపస్మారకస్థితిలో పడిఉండడంతో వెంటనే కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.