Friday, November 22, 2024

పోలీసు ముసుగులో బోండాలు వసూల్.. మహిళ అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తాను పోలీసు అధికారినంటూ చిరు వ్యాపారుల నుంచి డబ్బులు, బోండాలు, బజ్జీలు మామూళ్ల రూపంలో వసూలు చేస్తున్న ఒక 50 ఏళ్ల మహిళను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సంపన్న కుటుంబానికి చెందిన ఈ మహిళ భర్త ఇంజనీర్.. పెద్ద కుమార్తె డాక్టర్.. కుమారుడు ఇంజీనిరంగ్ విద్యార్థి. అయినప్పటికీ తానో పోలీసు అధికారినంటూ సివిల్ డ్రెస్‌లో చిరు వ్యాపారులే కాక కిరాణా షాపు నుంచి కూడా సరుకులు వసూలు చేసిన లీలావతి అనే ఈ గృహిణిని పోలీసులు అరెస్టు చేశారు. బండి మీద బజ్జీలు, బోండాలు అమ్ముకుంటూ పొట్టపోషించుకుంటున్న షేక్ సలామ్(26) ఇచ్చిన ఫిర్యాదు మేరకు మామూళ్ల పేరుతో బజ్జీలు, బోండాలు వసూలు చేస్తున్న లీలావతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలరోజులుగా తన బండి వద్దకు వచ్చి ఈ మహిళ తాను పోలీసునని, మమూళ్లు ఇవ్వకపోతే బండిని అక్కడ నుంచి తొలగిస్తానంటూ బెదిరిస్తోందని షేక్ సలామ్ తెలిపాడు.

ఆదివారం కూడా అలాగే తన బండి వద్దకు వచ్చి ఎగ్ బోండాలు తినిందని, అక్కడితో ఆగకుండా వంద రూపాయలకు బోండాలు పార్సిల్ కట్టమని అడిగిందని అతను చెప్పాడు. వొళ్లు మండి తాను డబ్బులు అడిగానని, దీంతో ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె తన బండిని అక్కడ నుంచి లేపేస్తానంటూ మండిపడిందని అతను తెలిపాడు. వెంటనే తాను 112కి డయల్ చేసి తనను వేధిస్తున్న ఆ మహిళ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశానని అతను తెలిపాడు. ఈలోగా ఆ మహిళ తన టూవీలర్‌పై అక్కడ నుంచి జారుకుందని, తాను ఆమె వాహనం నంబర్‌ను నోట్ చేసి తన వద్దకు వచ్చిన పోలీసులకు అందచేశానని సలామ్ చెప్పాడు.

వాహనం నంబర్ ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టి ఆమె ఇంటికి వెళ్లగా ఆమె కుటుంబం గురించి తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమె చేసిన పనికి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె కూరగాయల షాపుల్లో, బేకరీలో, కిరాణా షాపుల్లో కూడా మమూళ్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. కొన్ని చోట్ల చిన్నపాటి మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. తాను చేసిన పనికి లీలావతి పోలీసులకు క్షమాపణ చెప్పినప్పటికీ పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెను బెయిల్‌పై విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News