వీడియో చిత్రీకరించి బాధితురాలికి బెదిరింపు
నీముచ్ (ఎంపి ) : మధ్య ప్రదేశ్‌లో ముప్ఫయ్యేళ్ల మహిళా కానిస్టేబుల్‌పై ముగ్గురు సామూహికంగా అత్యాచారానికి పాల్పడడమే కాకుండా అదంతా వీడియో చిత్రీకరించి బెదిరించిన సంఘటన బయటపడింది. ఈనెల మొదట్లో జరిగిన ఈ సంఘటనపై ఈనెల 13 న ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగం లోకి దిగి విచారణ ప్రారంభించారు. ప్రధాన నిందితుడి తల్లితో సహా మొత్తం ఐదుగురి నిందితులపై కేసు దాఖలు చేశారు. ప్రధాన నిందితుడిని, అతని తల్లిని అరెస్టు చేశామని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అనూరాధ గిర్వాల్ చెప్పారు. నిందితుడు ఫేస్బుక్ ద్వారా బాధితురాలికి పరిచయమయ్యాడు. ఏప్రిల్ నుంచి వాట్సాప్ ద్వారా సన్నిహితంగా ఉన్నాడు. తన సోదరుని పుట్టిన రోజు వేడుక ఉందని బాధితురాలిని నమ్మించి రమ్మని పిలిచాడు. అక్కడ ముగ్గురితో కలసి ఆమెపై అత్యాచారం జరిపినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసిందని అనూరాధ చెప్పారు. ప్రధాన నిందితునితోపాటు అతని సోదరుడు, మరో వ్యక్తి కలసి ఈ అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా వీడియో చిత్రీకరణ చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితుని తల్లి, వారి బంధువు కూడా తనను చంపుతామని బెదిరించారని, డబ్బులు తన నుంచి వసూలు చేయాలని చూశారని బాధితురాలు ఆరోపించారు. ఇదివరకు నీముచ్‌లో పనిచేసే ఈ మహిళా కానిస్టేబుల్ ప్రస్తుతం ఇండోర్ జిల్లాలో పనిచేస్తున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు.