మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. పాతబస్తీ ఛత్రినాక పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌కు రెండు రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో సురేఖ అనే యువతి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె తన సోదరితో కలిసి ఆలియాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూసే పనిలో పడ్డారు.
ఈ క్రమంలోనే ఒక సంబంధం కుదరగా, రెండు రోజుల క్రితం ఇరు కుటుంబసభ్యుల నడుమ ఘనంగా నిశ్చితార్థం జరిపించారు. అయితే సురేఖకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలుస్తోంది. అందువల్లనే బలవన్మరణానికి పాల్పడిందని సమాచారం. నిశ్చితార్థం నాటి నుంచి అదోలా ఉన్నట్లు కుటుంబసభ్యులు చెప్తున్నారు. అలా అయితే పెళ్లి ఇష్టం లేదనే విషయాన్ని తమతో చెప్పలేదని అంటున్నారు. వయసుకొచ్చిన కుమార్తె బలవన్మరణానికి పాల్పడటంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న శాలిబండ పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.