Wednesday, January 22, 2025

ఐదు లక్షలు పోసి కష్టాలు కొనుకున్నట్లైంది..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎయిరిండియా విమాన ప్రయాణం ప్రయాణికురాలు శ్రేయతి గార్గ్‌కు చుక్కలు చూపించింది. ఢిల్లీ నుంచి కెనడాలోని టొరంటోకు ఇటీవల గార్గ్ తన భర్త, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి వెళ్లింది.ఈ దశలో తాము పలు సమస్యలు ఎదుర్కొన్నామని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. తన కుటుంబానికి ఈ ప్రయాణం చేదు అనుభవాలను మిగిల్చిందని ఆమె వాపోయింది. టికెట్లన్నింటికీ కలిపి నాలుగున్నర లక్షల రూపాయలు చెల్లించామని , అయితే తాము నలుగురం విరిగిన సీట్లలో వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ప్రయాణం తమకు బోలెడు తలనొప్పి , వెన్నునొప్పులు మిగిల్చిందని నిరసన వ్యక్తం చేశారు. విమానంలో తన ప్రయాణ పదనిసల గురించి తెలిపే ఫోటోల వీడియోను ఈ యువతి సోషల్ మీడియాలో పొందుపర్చారు. ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది వరకూ నెటిజన్లు దీనిని చూశారు.

అమ్మో ఎయిరిండియా అనుకుంటున్నారు. విమానంలో పనిచేయని ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థలు కూడా ఉండటంతో తాము ప్రయాణం అంతా బాధలు భరిస్తూ గడపాల్సి వచ్చిందని గార్గ్ తెలిపారు. లోపల లైట్లు కూడా సరిగ్గా లేవని, దీనితో తాను సెల్‌ఫోన్ టార్చ్ వాడుకోవల్సి వచ్చిందని , పిల్లల బాగోగులు చూసుకోవల్సి వచ్చిందని పేర్కొన్నారు. సెఫ్టీ పరికరాలు, విరిగిన కుర్చీలు, హ్యాండిల్స్ మేకులతో పిల్లలకు ఇబ్బంది కల్గిందని వివరించారు. ఎయిరిండియా టికెటు ధరలు ఇప్పటికే విపరీత స్థాయికి చేరాయి. పోనీ ప్రయాణం సౌకర్యవంతం అవుతుందనుకుంటే , అదీ లేదని తెలిపారు. పిల్లలతో కలిసి వెళ్లే తల్లిదండ్రుల పరిస్థితి దయనీయం అవుతుందని స్పందించారు. మొత్తం మీద దాదాపు రూ 5 లక్షలు ఖర్చు పెట్టి తాను ఈ కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అయిందని గార్గ్ పేర్కొన్నారు. పలువురు నెటిజన్లు ఆమె పట్ల సంఘీభావం వ్యక్తం చేశారు. అయితే ఎయిరిండియా దీనిపై ఎటువంటి జవాబుకు దిగలేదు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News