మరో మాట్రిమోనియల్ మోసం వెలుగుచూసింది. పెళ్లి పేరుతో ఓ వైద్యురాలిని నమ్మించి, ఆనక బ్లాక్ మెయిల్ చేసి రూ.11 లక్షలు కాజేసిన ఉదంతం జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే జూబ్లీహిల్స్ రోడ్ నెం. 78లో నివాసం ఉంటున్న యువతి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఇటీవల పెళ్లి సంబంధాల కోసం షాదీ డాట్ కామ్‌లో ప్రకటననిచ్చింది. నిర్వాహకులు హర్ష చెరుకూరి అనే యువకుడికి చెందిన వివరాలను అందజేశారు. అలాగే సదరు యువతి నెంబర్‌ను హర్షకు ఇచ్చారు. దీంతో గత నెల 30 నుంచి వారిద్దరూ వాట్సాప్ చాటింగ్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. తన తల్లి డా.లక్ష్మీహరిత చికాగోలోని నార్త్ వెస్టర్న్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తుంటుందని హర్ష నమ్మించాడు. అంతేకాదు, తమకు పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయని, అయితే, ఇటీవల ఐటిశాఖ దాడులతో బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయ్యాయని చెప్పుకొచ్చాడు.
త్వరలోనే తల్లి ఇండియాకు వచ్చి పెళ్లి గురించి ఫైనల్ చేస్తుందని హర్ష తెలిపాడు. హర్ష మాటలు పూర్తిగా విశ్వసించిన సదరు యువతి అతడితో మరింత సన్నిహితంగా మాట్లాడుతూ, అదే క్రమంలో తనకు చెందిన కొన్ని ఫోటోలు అతడికి పంపించింది. కాగా ఇటీవల యువతికి ఫోన్ చేసిన హర్ష తనకు అర్జెంట్‌గా కొంత డబ్బు కావాలని, తమ అకౌంట్స్ సీజ్ కావడంతో పాటు పాన్ కార్డును ఐటి అధికారులు తీసుకువెళ్లారని నమ్మబలికాడు. దీంతో అతడు సూచించిన నెంబర్లకు పలు దఫాలుగా దాదాపు రూ.11 లక్షలను బాధిత యువతి పంపించింది. తదనంతరం హర్ష ముఖం చాటేయడంతో అనుమానం వచ్చిన యువతి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో తీవ్ర పదజాలంతో దూషించిన హర్ష అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగడమే కాకుండా, తన వద్దనున్న యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్న వీడియోలు, ఫోటోలు తయారు చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయి స్తానంటూ బ్లాక్ మెయిల్‌కు దిగాడు.
దీంతో ఆందోళనకు గురయిన బాధిత యువతి జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. కుటుంబ సభ్యులు వెనువెంటనే షాదీ డాట్ కామ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేసి వాకబు చేశారు. అక్కడ కూడా హర్ష తప్పుడు వివరాలు ఇచ్చినట్లు వెల్లడైంది. దీంతో ఈ మేరకు బాధితురాలు బుధవారం జూబ్లీహిల్స్ పో లీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు హర్ష చెరుకూరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.