పదిరోజుల్లో కూతురు పెళ్లి. శుభలేఖలు వచ్చేశాయి. బంధువులకు పంచడమే తరువాయి.. ఈ తరుణంలో అత్త కాబోయే అల్లుడితో వెళ్లిపోయింది. పోతూ పోతూ, కూతురి పెళ్లికోసం దాచిన మూడున్నర లక్షల రూపాయల నగదు, ఐదులక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలనూ మూట కట్టుకుని పోయిందట ఆ మహాతల్లి. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లోని మద్రక్ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈ ఘటన జరిగింది.తన తల్లి అనిత, తన కాబోయే భర్తతో చేసిన నిర్వాకాన్ని చెప్పి ఆ వధువు శివానీ కన్నీరు పెట్టుకుంది. ఏప్రిల్ 16న రాహుల్ తో తన పెళ్లి కావల్సి ఉందని, కానీ మొన్న ఆదివారం నాడు తన తల్లి రాహుల్ తో లేచిపోయిందని శివాని తెలిపింది. తన తల్లి రాహుల్ తో మూడు, నాలుగు నెలలుగా గంటల కొద్దీ ఫోన్ లో మాట్లాడేదని, ఇలా జరుగుతుందని అనుకోలేదని,
ఇంట్లో 10 రూపాయలు కూడా లేకుండా నగదు,నగలు మొత్తం అనిత ఊడ్చుకు పోయిందని ఆ అమ్మాయి చెప్పింది.ఆమె తండ్రి జితేంద్ర కుమార్ బెంగళూరులో దుకాణం నడుపుతాడు. తన భార్య, కాబోయే అల్లుడితో కలిసి వెళ్లిపోయిందని తెలిసిన తర్వాత, పోలీసులకు తన భార్య కన్పించడం లేదని ఫిర్యాదు చేశాడు.వాళ్లు ఎలా పోయినా, అమ్మాయి పెళ్లికి కోసం దాచిన నగలు, నగదు ను పోలీసులు రికవరీ చేస్తే చాలు అంటున్నాడు జితేంద్ర కుమార్. తన భార్య కాబోయే అల్లుడితో ఫోన్ లో గంటలకొద్దీ మాట్లాడుతోందని తెలిసినా, కొన్ని రోజుల్లో కూతురు పెళ్లి ఉండడంతో ఆమెను ఏమీ అనలేదని చెప్పుకొచ్చాడు ఆయన. అనితకు, రాహుల్ కూ ఫోన్ చేసినా వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.