మొబైల్‌షాప్ యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చిట్‌ఫండ్ ఏజెంట్ భార్య
ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య రాజు. అతడి మంటలుఆర్పడానికి యత్నించిన పాన్‌షాపు
యజమాని రంగయ్యకు కూడా గాయాలు, ఆసుపత్రి పాలు :
హన్మకొండలో దారుణం. చిరువ్యాపారులు, చిన్న ఉద్యోగుల నుంచి రూ.లక్షలకొద్దీ
డబ్బు కట్టించుకొని ఏజెంట్లతో దాడి చేయిస్తున్నారని ప్రైవేట్
చిట్‌ఫండ్‌ల యాజమాన్యాలపై విమర్శ
మన తెలంగాణ/హన్మకొండటౌన్: హన్మకొండ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు శుక్రవారం మొబైల్‌షాపుపైన, అందులోని రాజు అనే యువకుడిపైనా అచల అనే ఒక ప్రైవేట్ చిట్‌ఫండ్ ఏజెంట్ భార్య పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. హన్మకొండలోని అచలా చిట్‌ఫండ్ కంపెనీలో డబ్బులు కట్టిన రాజు తన చిట్టీ ఎత్తుకున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో అచలా కంపెనీ వద్ద గురువారం నాడు ఆందోళనకు దిగాడు. అది మనసులో పెట్టుకున్న ఆ చిట్‌ఫండ్ ఏజెంట్ భార్య అతని షాపుపైనా అతనిపైనా పెట్రోల్ పోసి సజీవ దహనానికి యత్నించారు. రాజు సెల్‌ఫోన్ షాపు దగ్ధమైంది. రాజు కూడా మంటల్లో కాలిపోయాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ యత్నంలో ఎదురుగా ఉన్న పాన్‌షాపు యజమాని రంగయ్య గాయాలపాలయ్యాడు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలా ఎంతోమంది చిరు వ్యాపారులు, చిన్న ఉద్యోగస్తులు రూ.లక్షల కొద్ది వేయించుకొని ప్రైవేటు చిట్‌ఫండ్‌లు చిట్టీలు కట్టించుకొని చిట్టీలు కట్టిన వారిపై ఏజెంట్లతో దాడి చేయిస్తున్నారని ఇలాంటి వారు చాలామంది ఉన్నారని బాధితులు అంటున్నారు. ఈప్రైవేటు చిట్‌ఫండ్‌ల యాజమాన్యంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.