Wednesday, January 22, 2025

పెళ్లి పేరుతోమహిళా ఐఎఎఫ్ అధికారికి రూ. 23 లక్షల టోకరా

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: లండన్‌కు చెందిన ప్రాపర్టీ డీలర్‌నని చెప్పుకున్న ఒక వ్యక్తి పెళ్లి పేరుతో భారతీయ వైమానిక దళం(ఐఎఎఫ్)లో పనిచేసే ఒక మహిళా అధికారిని బురిడీ కొట్టించి రూ. 23.5 లక్షలు స్వాహా చేశాడు. లక్నో కంటోన్మెంట్‌లోని ఎఎఫ్‌ఎంసిలో పనిచేసే ఆ మహిళా అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.

పెళ్లి సంబంధం కోసం ఆ మహిళ ఒక మ్యాట్రిమోనియల్ సైట్‌లో వెదకగా లండన్‌లో స్థిరపడిన భారతీయుడినని చెప్పుకున్న డాక్టర్ అమిత్ యాదవ్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. వివాహ మయైన తర్వాత తాను ఇండియాలో స్థిరపడతానని వాగ్దానం చేసిన యాదవ్ ఇండియాలో తాను ఒక స్థలం కొంటున్నానని చెప్పి ఆమెను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి రూ. 23.5 లక్షలు తన బ్యాంకు ఖాతాలో వేయించుకున్నాడు.

ఇండియాలో స్థలం కొంటున్నానని చెప్పడంతో తామిద్దరం మాట్లాడుకోవడం ప్రారంభించామని, డబ్బులు తన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అతను తనను బెదిరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. అతని ఖాతాలో రూ. 23.5 లక్షలు పడిన వెంటనే తనతో మాట్లాడటం ఆపేశాడని ఆమె తెలిపారు. అనుమానం వచ్చి తాను వెంటనే అధికారులతో మాట్లాడి అతని బ్యాంకు ఖాతాను స్తంభింపచేశానని ఆమె తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే అతను బ్యాంకు ఖాతాను పునరుద్ధరిస్తే మీ డబ్బును వెంటనే ట్రాన్స్‌ఫర్ చేస్తానని తనను వేడుకున్నాడని, తాను అందుకు అంగీకరించగా బ్యాంకులోని డబ్బును విత్‌డ్రా చేసుకున్న అతను బ్యాంకు కాతాను మూసేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాను డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చిన యాదవ్ తనను కలుసుకోవడానికి ఇష్టపడలేదని, అతని ఫోన్ నంబర్ యాక్టివ్‌లో ఉన్నప్పటికీ తన కాల్స్‌కు స్పందించలేదని ఆమె తెలిపారు. అతను పాల్పడిన ఆర్థిక నేరం గురించి లక్నోలోని సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు. మహిళా ఐఎఎఫ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టామని కంటోన్మెంట్ ఎసిపి అభినవ్ తెలిపారు. ఆమె బదిలీ చేసిన డబ్బును స్తంభింపచేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News