హైదరాబాద్ : భర్త వద్దాన్నా వినకుండా ఓ యాప్‌లో లక్షలు పెట్టుబడిగా పెట్టి చివరకు మోసపోయాని తెలియడంతో బాధితురాలు అడ్రస్ లేకుండా పోయింది. వాషింగ్టన్ ఫిల్మ్ స్కేర్ అనే నకిలీ యాప్ మాయలో పడిన విజయవాడ నగరం సీతారామపురంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హిమబిందు విడుతల వారీగా రూ. 7 లక్షల వరకు పెట్టుబడి పెట్టింది. సదరు సంస్థ నుంచి ఒక్కసారిగా రియాక్షన్ ఆగిపోవడంతో మోసపోయినట్లు నిర్ధారించుకున్న హిమబిందు తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు తెలిస్తోంది. గత నెల 31న హిమబిందు అదృశ్యమైంది.
దాదాపు పది రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించలేదు. హిమబిందు ఎక్కడైనా ప్రాణాలతోనే ఉందా? లేక బలవన్మరణానికి పాల్పడిందా అనేది మిస్టరీగా మారింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తునారు. అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలించి హిమబిందు కదలికల్ని ట్రేసౌట్ చేశారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ప్రత్యేక బృందాలు హిమబిందు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.