ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలంలో చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం.. ఇంట్లో గొడవ పడి తన భర్త ఎక్కడికో వెళ్లిపోయాడని భార్య జమున పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను విచారించగా పథకం ప్రకారమే మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ ను భార్య జమునతో కలిసి తన వ్యవసాయ క్షేత్రంలో హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండా అక్కడే పూడ్చిపెట్టినట్లు నిందుతులు హత్య నేరాన్ని ఒప్పుకున్నట్లు ఆర్మూర్ ఎసిబి ప్రభాకర్ రావు వెల్లడించారు.
వేల్పూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసిపి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ నిత్యం తాగుడికి బానిసగా మారి పిల్లలను కొడుతూ హింసించడంతో భార్య జమున అక్రమ సంబంధం పెట్టుకున్న నాగేష్, ఆమె తండ్రి గంగారం.. అలాగే పెద్ద కొడుకుతో కలిసి పథకం ప్రకారం రంజిత్ ను ఎలాగైనా హత్య చేయాలని ఉద్దేశంతో వ్యవసాయ క్షేత్రంలో అక్టోబర్ 20న రంజిత్ కుమార్ కు అతిగా మద్యం త్రాగించి తలపై కర్రలతో దాడి చేసి చంపారు.
ఎవరికీ అనుమానం రాకుండా అక్కడే ఉన్న మామిడి చెట్ల పొదలలో గోతిని తవ్వి పూడ్చిపెట్టి వివరించారు. హత్య చేసిన తర్వాత అక్టోబర్ 24వ తేదీన నిందితురాలైన మృతుని భార్య జమున వేల్పూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి.. తన భర్త రంజిత్ కుమార్ కనబడడం లేదని, చిన్న గొడవ పెట్టుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయాడని ఫిర్యాదు చేసిందని అన్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని విచారణ చేపట్టామని.. మృతుని సెల్ఫోన్ డేటా ఆధారంగా ముగ్గురిని అనుమానితులుగా అరెస్టు చేసి విచారించగా అత్యానేరాన్ని ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుండి ఒక బైక్ మూడు సెల్ ఫోన్లు హత్యకు ఉపయోగించిన వస్తువులు పారా గడ్డపారను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.