Monday, April 7, 2025

అప్పుగా తీసుకున్న రూ.6 వేలు ఇవ్వనందుకు మహిళ హత్య

- Advertisement -
- Advertisement -

ప్పుగా తీసుకున్న రూ.6 వేలు తిరిగి ఇవ్వడం లేదని ఓ మహిళను తన ప్రియుడుతో కలిసి హత్యకు పథకం వేసింది మరో మహిళ. ఎలాగైనా ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారం, వెండి సొత్తును సొంతం చేసుకుంటే ఇచ్చిన అప్పుకు బదులుగా అధికంగా డబ్బులు వస్తాయని ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. చివరకు ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండల కేంద్ర శివారులో మహిళ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. శనివారం తాండూరు డిఎస్‌పి కార్యాలయంలో జిల్లా ఎస్‌పి నారాయణ రెడ్డి, డిఎస్‌పి బాలకృష్ణారెడ్డి, రూరల్ సిఐ నగేష్, ఎస్‌ఐలు శ్రీధర్ రెడ్డి, గిరితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. బొంరాస్‌పేట్ మండలం, చౌదర్ పల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి యశోద (38) పరిగి పట్టణంలో కూలీ పనులు చేస్తుండేది. ఆమెకు పరిగి మండలం, రాంరెడ్డిపల్లికి చెందిన పల్యా అనితతో పరిచయం ఉంది.

అనితకు దోమ మండలం, బోలా గోపాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అనిత వద్ద యశోద కొంతకాలం క్రితం రూ.6 వేలు అప్పుగా తీసుకుంది. ఎప్పుడు అడిగినా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని అనిత కక్ష పెంచుకుంది. యశోదను హత్య చేసేందుకు ప్రియుడు గోపాల్ సాయం కోరింది. ఇందుకు అనిత తనతో ఉంటేనే హత్యకు సాయం చేస్తానని తెలిపాడు. ఈ క్రమంలో ఈనెల 1వ తేదీన గోపాల్ యశోదకు ఫోన్ చేసి అనితకు ఇవ్వాల్సిన డబ్బులు విషయం గురించి మాట్లాడదామని పరిగి బస్టాండ్ వద్దకు రప్పించాడు. అక్కడి నుంచి గోపాల్, అనిత, యశోదలు బైకుపై వికారాబాద్ వైపు వచ్చారు. మార్గమధ్యలో మద్యం సేవించారు. యశోదకు మత్తు ఎక్కిన తరువాత అదే బైకుపై పెద్దేముల్ మండలం, వైపు వచ్చారు. మార్గమధ్యంలో ధారూర్ వద్ద పెట్రోల్ బంకులో ఓ బాటిళ్లో పెట్రోల్ వెంట తీసుకువచ్చారు. కోట్‌పల్లి మార్గంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసువచ్చి యశోదను ఆమె చీరతోనే గొంతు నులిమి హత్య చేశారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించారు.

అంతకుముందు యశోద మెడలో బంగారు నల్లపూసలు, బంగారు ముక్కు పుడకలు, వెండి కాళ్ల కడియాలు, సెల్‌ఫోన్ తీసుకున్నారు. అనంతరం ఆక్కడి నుంచి బైకుపై వారిద్దరూ పరారయ్యారు. మరుసటి రోజు యశోద మృతదేహాన్ని పోలీసులు సామాజిక మాధ్యమాలలో వైరల్ చేయగా మృతురాలి కుమారుడు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. అనుమానం ఉన్న నిందితులపై నిఘా ఉంచారు. నిందితులు గోపాల్, అనిత మృతురాలి నుంచి తీసుకున్న బంగారు ఆభరణాలను హైదరాబాద్‌లో విక్రయించేందుకు వెళుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు వారి నుంచి ఆయా వస్తువులతోపాటు బైకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు వివరించారు. ఈ కేసులో ఛేదనలో ప్రతిభ కనబరిచిన రూరల్ సిఐ నగేష్, పెద్దేముల్ ఎస్‌ఐఐ శ్రీధర్ రెడ్డి, యాలాల ఎస్‌ఐ గిరి, ఏఎస్‌ఐ బక్కన్న, హెడ్‌కానిస్టేబుల్ రమేష్, క్రైం వింగ్ స్టాఫ్ దస్తప్ప, ప్రతాప్ సింగ్, నర్సింహ, మున్నయ్య, జయంత్, మాసయ్య, రఫీక్, అశోక్‌లను ఎస్‌పి అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News