మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి: కూతురికి రెండో పెళ్లి చేసేందుకు అడ్డుగా ఉన్నాడని ఏడాదిన్నర వయస్సున్న మనువడిని అమ్మమ్మ చెరువులోకి విసిరిన అమానవీయ ఘటన సంగారెడ్డి పట్టణం రాజంపేటలో చోటుచేసుకుంది. డిఎస్‌పి బాలాజీ చెప్పిన వివరాల ప్రకారం.. రాజంపేటకు చెందిన సుజాత అనే మహిళ భర్త రెండేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటికే వీరికి యశ్వంత్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా, సుజాత కొంతకాలం నుంచి బద్రీగూడెంకు చెందిన జనార్దన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. సుజాతను వివాహం చేసుకోవాలంటే యశ్వంత్ ఉండరాదని జనార్దన్ తేల్చి చెప్పాడు.
దీంతో సుజాత తల్లి నాగమణి తన కూతురు వివాహానికి చిన్నారి యశ్వంత్ అడ్డొ స్తున్నాడని భావించింది. గుట్టుచప్పుడు కాకుండా బాలుడిని ఇంటి నుంచి తీసుకెళ్లి కుంట చెరువులో విసిరేసి, ఏమీ తెలియనట్లు ఇంటికొచ్చింది. కుమారుడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని సుజాత తల్లితో పాటు పట్టణ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పట్టణ సిఐ రమేష్ ఆధ్వర్యంలో సాంకేతిక సహకారంతో, తమదైన శైలిలో విచారణ జరపగా అమ్మమ్మే బాలుడిని చెరువులో విసిరేసినట్లు తేలింది. బాలుడి తల్లి సుజాతతో పాటు, అమ్మమ్మ కూడా తమకేమీ తెలియదని బుకాయించారని డిఎస్‌పి తెలిపారు. బాలుడిని చంపిన 12 గంటల్లోగానే కేసును చేధించిన పట్టణ సిఐ రమేష్ తోపాటు వారి సిబ్బందిని జిల్లా ఎస్‌పి, డిఎస్‌పి అభినందించారు.
Woman killed her grandson for daughter 2nd marriage