Tuesday, January 21, 2025

హైదరాబాద్‌లో మహిళా లోకో పైలట్ మిస్సింగ్.. 50రోజులు గడిచిన దొరకని ఆచూకీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సనత్ నగర్‌లో యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. గత ఏడాది నవంబర్ 30న అదృశ్యమైన వాసవీప్రభ అనే యువతి అచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాసవీప్రభ కొన్నాళ్లుగా రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు చెన్నైకు చెందిన సాయి సంచిత్‌తో నిశ్చితార్ధం జరిగింది. డిసెంబర్ 11న వారి పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి షాపింగ్ పనులు కూడా పూర్తయ్యా.యి. ఆమె ఇష్ట ప్రకారమే తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పెళ్ళి మరో పది రోజుల్లో ఉందనగా యువతి అదృశ్యం కావడం తల్లిదండ్రుల్ని తీవ్ర క్షోభకు గురి చేసింది. దాదాపు 50రోజులుగా అచూకీ దొరక్క పోవడంతో ఏమి జరిగిందో తెలీక తల్లడిల్లుతున్నారు. సనత్ నగర్‌లో అదృశ్యమైన లోకో పైలట్ వాసవి జాడ లభించక పోవడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. కేసు దర్యాప్తు కొద్దిగా కూడా ముందుకు సాగకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

ఐడీ కార్డు, మొబైల్ ఫోన్, డెబిట్ కార్డు, హ్యాండ్ పర్సు ఇంట్లోనే వదిలి వెళ్లడంతో ఏమి జరిగిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎలాంటి ఆధారం లభించక పోవడంతో ఆమె ఆచూకీ కనుగొనడం పోలీసులకు సవాలుగా మారింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో లోకో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్న వాసవీ ప్రభ చివరి సారి డిసెంబర్ 29న తల్లిదండ్రులతో మాట్లాడింది. ఆ తర్వాత అదృశ్యమైంది. రైల్వే లోకో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్న వాసవి సనత్‌నగర్‌లో అద్దె గదిలో ఉంటుంది. నవంబర్ 30వ తేదీ సాయంత్రం షాపింగ్ వెళ్తున్ననని ఓనర్‌కు చెప్పి బయటకు వెళ్లిన ఆమె అదృశ్యమైంది. రోజు మాదిరిగానే తండ్రి భాస్కర్ రావు ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానించి వచ్చి ఇంటి యజమాని సాయంతో రాత్రి 12 గంటల సమయంలో ఇల్లు తెరిచి చూశారు. ఆమె ఫోన్ రూమ్‌లోనే ఉందని గుర్తించారు. దీంతో స్వగ్రామం నుంచి హైదరాబాద్ చేరుకున్న తండ్రి భాస్కర్ రావు, కుమార్తె అదృశ్యంపై సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తప్పిపోయిన మహిళ ఎత్తు 5.5 అడుగులు ఉంటుందని, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడ గలదని చెబుతున్నారు. పెళ్లి విషయంలో కాబోయే భర్తతో వాగ్వాదాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు కాబోయే భర్త పెళ్లి తర్వాత ఉద్యోగం చేయడానికి విముఖత చూపడం, తన తల్లిదండ్రులకు దూరం కావాల్సి వస్తుందని అతనితో వాదులాడినట్లు గుర్తించారు. కాబోయే భర్త పెట్టిన కండిషన్ల గురించి తమకేమి తెలియదని ఆమె తండ్రి చెబుతున్నారు. మరోవైపు వాసవీ ప్రభను వేధించలేదని ఆమెకు కాబోయే భర్త సాయిసంచిత్ స్పష్టం చేశాడు. ప్ళ్ళైన తర్వాత నైట్ డ్యూటీలు చేయడం తనకు ఇష్టం లేదని మాత్రమే చెప్పానంటున్నాడు. వాసవీ ప్రభ అచూకీ తెలిసిన వారు సనత్ నగర్ పోలీసులకు సమాచారం అందించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముత్తు యాదవ్ విజ్ఞప్తి చేశారు. వాసవీ గురించి సమాచారం తెలిసిన వారు సనత్‌నగర్ ఎస్‌హెచ్‌వో 9490617132, ఎస్‌ఐ 8919558998 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
తల్లిదండ్రుల విన్నపం…
తమ కుమార్తె, కాబోయే అల్లుడి మధ్య గొడవ జరిగి ఉండవచ్చని వాసవి తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెను తిరిగి రావాలని కోరారు. పెళ్లికి ఇష్టపడకపోతే పెళ్లిని రద్దు చేసుకుంటామని చెప్పారు. వాసవి తండ్రి భాస్కరరావు మాట్లాడుతూ ‘దాదాపు 50 రోజులు గడిచిపోయింది. ఆచూకీపై తమకు ఎటువంటి క్లూ లభించలేదు. దంపతుల మధ్య గొడవ జరిగిందని తాము అనుమానిస్తున్నాము. ఆమె అదృశ్యమయ్యే ముందు మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తితో వాట్సాప్ కాల్ చేసింది. ఆమె ఎక్కడ ఉందో, ఎంత సురక్షితంగా ఉందో తెలియదు. ఆమె తన సమస్యలను తమతో ఎప్పుడూ పంచుకోలేదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News