Monday, December 23, 2024

ఇది పూజారి దృశ్యం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గుడికి వచ్చే భక్తురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి ఆమెను హత్య చేసిన సంఘటన శంషాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సరూర్‌నగర్, వెంకటేశ్వర కాలనీకి చెందిన వెంకటసాయికృష్ణ(36) తహసిల్దార్ కార్యాలయానికి సమీపంలోని గుడిలో పెద్ద పూజారిగా పనిచేస్తున్నాడు. సాయికృష్ణకు వివాహం కావడంతో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్నైకి చెందిన అప్పర(30) సీరియల్స్‌లో నటించాలని కుటుంబం తోపాటు 2022లో హైదరాబాద్‌కు వచ్చి సరూర్‌నగర్‌లో ఉంటున్నారు. అక్కడ ఉంటూనే సీరియల్స్‌లో ట్రై చేస్తుండేది. గుడిపక్కనే ఉన్న ఇంటిలో అప్సర కుటుంబం ఉండడంతో తరచూ గుడికి వెళ్లేది.

అక్కడే సాయికృష్ణ పూజారిగా పని చేస్తుండడం, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్సర గర్భం దాల్చడంతో సాయికృష్ణ అబార్షన్ చేయించాడు. మార్చి నుంచి తనను వివాహం చేసుకోవాలని అప్సర, సాయికృష్ణపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అయితే అప్పటికే సాయికృష్ణకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉండడంతో దానికి నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరు కలిసి తరచూ కారులో శంషాబాద్‌లో ఉన్న గోశాలకు వెళ్లేవారు. ఈ క్రమంలోనే ఈ నెల3వ తేదీన గోషాలకు వెళ్లేందుకు కారులో అప్సర, సాయికృష్ణ బయలు దేరారు. అప్పటి నుంచి అప్సర కన్పించకుండా పోయింది. విలేకరుల సమావేశంలో ఇన్స్‌స్పెక్టర్లు శ్రీనివాస్, మహేష్ పాల్గొన్నారు.

పక్కా ప్లాన్ వేసిన పూజారి…
ఎలాగైనా అప్సర అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసిన సాయికృష్ణ హత్య చేయాలని నిర్ణయానికి వచ్చాడు. అప్సర తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తేవడం, రెండు సార్లు గర్భం దాల్చడంతో తన వల్ల ఆమెకు గర్భం రాలేదని అనుమానించేవాడు, వేరే వారితో కూడా అప్సర సన్నిహితంగా మెలగడంతో వారి వల్ల ఆమెకు గర్భం వచ్చినట్లు అనుమానించాడు. దీంతో అప్సరను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. దానిలో భాగంగా అప్సరను తీసుకుని శంషాబాద్‌కు బయలుదేరాడు. ఇద్దరు కలిసి ఫోర్ట్ కారులో శంషాబాద్ రాళ్లగూడ వైపు వెళ్లారు, అక్కడ భోజనం చేశారు. తర్వాత కారులోకి వచ్చిన అప్సర ఫ్రంట్ సీట్‌లో రిలాక్స్ మోడ్‌లో పడుకుంది.

హత్య చేయాలని ముందుగానే ప్లాన్ వేసుకున్న సాయికృష్ణ కారులో అప్పటికే కారు కవర్, బెల్లకొట్టే రాయిని పెట్టాడు. కారు కవర్‌ను అప్సర మెడకు చుట్టి హత్య చేసేందుకు యత్నించడంతో ప్రతిఘటించింది, దీంతో కారులో ఉన్న బెల్లం కొట్టే రాయితో పది సార్లు తలపై కొట్టడంతో కారులోను మృతిచెందింది. వెంటనే అప్సర మృతదేహాన్ని కారు కవరులో చుట్టి డిక్కీలో వేసి సరూర్‌నగర్ ఇంటికి తీసుకుని వచ్చాడు. అక్కడే ఉపయోగంలో లేని మ్యాన్‌హోల్‌లో అప్సర మృతదేహాన్ని పూడ్చి పెట్టి,అందులో దొడ్డు ఉప్పు పోశాడు తర్వాత మట్టితో నింపి పైన సిమెంట్‌తో మూసివేశాడు.

అమాయకుడి వలే పోలీసులకు ఫిర్యాదు…
అప్సరను హత్య చేసిన సాయికృష్ణ తనకు ఏమి తెలియదనట్లుగా ఈ నెల 5వ తేదీన ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్‌లో తన అక్క కూతురు కనిపించకుండా పోయిందని, అప్సర తల్లితో కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా సాయికృష్ణ ప్రవర్తనపై అనుమానం రావడంతో టెక్నికల్ అంశాలపై దృష్టిపెట్టడంతో పట్టుబడ్డాడు. సిసిటివి ఫుటేజ్, సాయికృష్ణ మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అప్సరను ఈ నెల 3వ తేదీన సుల్తాన్‌పూర్ వద్దకు తీసుకుని వచ్చి చంపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.

మా అబ్బాయి అలా చేసి ఉండకూడదుః సాయి కృష్ణ తండ్రి
తన కుమారుడు చాలా డిసిప్లిన్‌గా ఉంటాడని, అప్సరతో సాయి కృష్ణ వివాహేతర సంబంధం గురించి తనకు తెలియదని సాయి కృష్ణ తండ్రి అన్నారు. అప్సర గుడికి వస్తూ ఉండేదని, వివాహేతర సంబంధం ఉంటేనే ఆమెను బయటికి తీసుకువెళ్లాలా…? అన్నారు. అసలు ఏం జరిగిందో ఏంటో సాయి కృష్ణే చెప్పాలని.. తనకేమి తెలియదని ఆయన అన్నారు. తన కుమారుడుతో అప్సర చనువుగా ఉండేదని సాయి కృష్ణ తండ్రి తెలిపారు. అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండమని తన కొడుక్కి చెప్పానన్నారు. అప్సర విషయంలో మా అబ్బాయి ముందుగానే మాకు చెప్పి ఉంటే పెద్దలతో పంచాయితీ పెట్టేవాళ్ళమని.. లేదా పోలీస్ స్టేషన్లో ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించే వాళ్ళమని అన్నారు. తన కుమారుడు తప్పు చేస్తే చట్ట ప్రకారం ఏ చర్యలు అయిన తీసుకోవచ్చనని సాయి కృష్ణ తండ్రి అన్నారు.

నా కూతురిని హత్య చేసిన నిందితుడిని ఉరి తీయాలిః అప్సర తల్లి
సాయికృష్ణ ఇంత ఘోరానికి ఒడిగాడతాడని తాము అనుకోలేదని, తన కూతురుని ప్లాన్‌తోనే హత్య చేశాడని అప్సర తల్లి అన్నారు. తన కూతురు రోజూ గుడికి వెళ్లేదని.. అక్కడే సాయికృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడిందన్నారు. సాయికృష్ణ కూడా తరచూ తమ ఇంటికి వచ్చేవాడని, కూరగాయలు తెచ్చి ఇచ్చేవాడని తెలిపారు. తనను అత్తయ్య అని పిలిచేవాడని, తన భర్త కాశీలో ఉంటారని తెలిపారు. కోయంబత్తూరుకు వెళ్తున్నాని ఎయిర్‌పోర్టుకు బయలు దేరిందని, సాయికృష్ణ ఎయిర్ పోర్టులో దింపుతాడని చెప్పిందని తెలిపారు.గతంలో అప్సర సినిమాల్లో నటించిందని, సాయికుంటుంబంతో తమకు బంధుత్వం లేదని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News