జిల్లాలోని మనంతవడి గ్రామంలో ఉన్న ప్రియదర్శిని ఎస్టేట్‌లో ఓ 47 ఏళ్ల మహిళను శుక్రవారం ఉదయం పులి చంపేసింది. దాంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శించారు. మృతురాలు రాధ ఎస్సీ కులానికి చెందింది. ఎస్టేట్‌లో కాఫీ గింజలు కోస్తుండగా పులి దాడిచేసి ఆమెను చంపేసింది. అసెంబ్లీలో కేరళ అటవీశాఖ మంత్రి ఏకె. శశిధరన్ మనుషులపై క్రూర జంతువుల దాడులు తగ్గాయని చెప్పిన మరునాడే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం శోచనీయం. ఎస్సీ, ఎస్టీ, బ్యాక్‌వర్డ్ కులాల మంత్రి ఓ.ఆర్. కేలు ఎదుట స్థానికులు ఈ విషయమై నిరసన ప్రదర్శన చేపట్టారు.
ప్రజల కోరిక మేరకు పులిని పట్టుకోవడం లేక చంపేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామని ఆయన తర్వాత విలేకరులకు తెలిపారు. ఇదిలావుండగా ప్రజల భద్రత కోసం ఆ ప్రాంతంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్(ఆర్‌ఆర్‌టిస్)ను మోహరించారు. కంచె ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇచ్చామని కేలు తెలిపారు. పులి దాడిలో మహిళ మరణంపై వాయ్‌నాడ్ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంతాపం ప్రకటించారు.