నేర చరిత్ర ఉన్న ఒక వ్యక్తి పుణె నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే స్వార్‌గేట్ బస్ స్టాండ్‌లో నిలిచి ఉన్న ఒక ఆర్‌టిసి బస్సు లోపల 26 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం పలు బృందాలు గాలిస్తున్నాయని వారు తెలిపారు. మంగళవారం ఉదయం జరిగిన ఆ సంఘటన ప్రతిపక్ష నాయకుల నుంచి తీవ్ర విమర్శలకు దారి తీసింది. పుణె ప్రాంతంలో పెరుగుతున్న నేరాలను అరికట్టడంలో విఫలం అవుతున్నందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధీనంలోని హోమ్ శాఖను వారు నిందించారు. అనుమానితుడు దత్తాత్రేయ రామ్‌దాస్ గడె (36)పై చోరీ, గొలుసు లాక్కోవడం వంటి కేసులు ఉన్నాయని స్వార్‌గేట్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలియజేశారు. స్వార్‌గేట్ మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్‌ఆర్‌టిసి)కి చెందిన అతిపెద్ద బస్ జంక్షన్లలో ఒకటి. ఆ మహిళ కథనం ప్రకారం, ఆమె మంగళవారం తెల్లవారు జామున సుమారు 5.45 గంటలకు ఒక ప్లాట్‌ఫామ్ వద్ద సతారా జిల్లాలో ఫల్టన్‌కు వెళ్లేందుకు బస్సు కోసం నిరీక్షిస్తుండగా, ఒక వ్యక్తి అమె వద్దకు వచ్చి సంభాషణలోకి దింపి ‘దీదీ’గా సంబోధించి సతారాకు వెళ్లే బస్సు మరొక ప్లాట్‌ఫామ్ వద్దకు వచ్చిందని చెప్పాడు.
అతను అప్పుడు ఆమెను ఆ సువిశాల బస్ స్టేషన్ ఆవరణలో వేరే చోట ఆగి ఉన్న ఖాళీ ‘శివ్ షాహి’ ఎసి బస్సు వద్దకు తీసుకువెళ్లాడు. బస్సు లోపల లైట్లు వెలిగి లేనందున ఆమె మొదట బస్సు ఎక్కేందుకు వెనుకాడింది. కానీ, అదే సరైన బస్సు అని ఆమెకు నచ్చజెప్పాడు. ఆమె బస్సు ఎక్కి, టార్చి సహాయంతో తన సీటు కోసం చూడవచ్చు అని అతను ఆమెతో చెప్పాడు. ఆ తరువాత అతను తన వెంట బస్సులోకి వెళ్లి, తనపై అత్యాచారం చేసి పారిపోయాడని ఆమె పోలీసులతో చెప్పింది. పోలీసులు సిసిటివి ఫుటేజ్ నుంచి నిందితుడు గడెను గుర్తించినట్లు, అతని ఆచూకీ తీయడానికి పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలియజేశారు. ఆ మహిళ నిందితునితో కలసి బస్సు వైపు వెళ్లడం సిసిటివి ఫుటేజ్‌లో కనిపించిందని పోలీస్ డిప్యూటీ కమిషనర్ (డిసిపి) స్మర్తనా పాటిల్ ఆ తరువాత విలేకరులతో చెప్పారు. ఆ సంఘటన జరిగినప్పుడు బస్ స్టేషన్ ఆవరణలో అనేక మంది, పలు బస్సులు ఉన్నట్లు ఆమె తెలిపారు.
ఆ మహిల సంఘటన జరిగిన వెంటనే పోలీసులను ఆశ్రయించలేదని, కానీ ఫల్టన్‌కు వెళ్లేందుకు ఒక బస్సు ఎక్కి దారి మధ్యలో ఫోన్‌లో తన స్నేహితురాలికి ఆ సంఘటనను వివరించిందని డిసిపి తెలిపారు. స్నేహితురాలి సలహాపూ ఆమె నగర పరిధిలోనే బస్సు దిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిందని పాటిల్ చెప్పారు. మహిళ పరిస్థితి స్థిరంగా ఉందని, ఆమె పోలీసులకు స్పష్టమైన సమాచారం ఇచ్చిందని డిసిపి తెలిపారు. భారతీయ న్యాయ సంహిత కింద అత్యాచారం కేసు నమోదు చేసినట్లు డిసిపి తెలియజేశారు. ఎన్‌సిపి (ఎస్‌పి) నాయకురాలు, బారామతి ఎంపి సుప్రియా సూలె. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ తాజా ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.