జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. “పక్కా వ్యూహం ప్రకారమే కశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆర్మీ యూనిఫామ్‌లో వచ్చిన ఏడుగురు ఉగ్రవాదులు.. బైసరన్‌లో టూరిస్టులను టార్గెట్ చేశారు. ట్రెక్కింగ్ టూర్‌కు వచ్చిన టూరిస్టులను చుట్టుముట్టి వారి ఐడీ కార్డులు చెక్ చేశారు. పేరు, మతం అడిగి తన భర్తపై కాల్పులు జరిపారు” అని ఓ బాధితురాలు తెలిపింది.
కాగా, ఉగ్రవాదులు కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో 10మంది పర్యాటకులు గాయపడ్డారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టి.. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉగ్రవాదుల కోసం ఘటన జరిగి ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.జమ్ముకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధాని మోడీ ఖండించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారు. ఘటనాస్థలానికి వెళ్లి.. తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు మోడీ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రదాడిపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. పర్యటకులపై దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని ఎక్స్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.