న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సాకేత్ కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఒక వ్యక్తి కాల్పులు జరపగా ఒక మహిళ గాయపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తన న్యాయవాదితో కలసి ఆమె ఉండగా ఒక వ్యక్తి ఆమెపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆమెపై కాల్పులు జరిపిన వ్యక్తిని షిస్టరీషీటర్‌గా పోలీసులు గుర్తించారు. ఉదయం 10.30 గంటలకు సాకేత్ కోర్టులో ఎం రాధ అనే వ్యక్తిపై కాల్పులు జరిగినట్లు డిసిపి సౌత్ తెలిపారు. కడుపులో బుల్లెట్ గాయాలు తగలడంతో ఆమెను వెంటనే మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తి న్యాయవాది రాజేంద్ర షాగా గుర్తించినట్లు డిసిపి తెలిపారు.
Also Read: కోట్ల సంఖ్యలో పెరుగుతున్న టైప్ 2 డయాబెటిస్ కేసులు
అతడిని బార్ కౌన్సిల్ గతంలోనే బహిష్కరించిందని ఆయన చెప్పారు. అతడిపై బాధితురాలు ఐపిసి 420 సెక్షన్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. రంజీ సింగ్ దలాల్ అనే ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం రాధపై 4 నుంచి 5 రౌండ్ల కాల్పులు జరిగాయి. క్యాంటీన్ వెనుక గేటు నుంచి షూటర్ తప్పించుకుని పారిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు డిసిపి తెలిపారు. కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. ఇతరుల పనికి అడ్డుతగులుతూ నీచ రాజకీయాలు చేయడం మాని ఎవరి పని వారు చేసేందుకు సహకరించాలని ఆయన పరోక్షంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలను భగవంతుడి చేతిలో పెట్టడం తగదని ఆయన అన్నారు.