మహిళా ఎస్‌ఐపై హోంగార్డ్ అత్యాచారం
పండ్ల రసంలో మత్తు కలిపి ఘాతుకం
వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
రూ.50లక్షలిస్తే వీడియోలు డిలీట్ చేస్తానని డిమాండ్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ (సిటీబ్యూరో): నగరంలోని ఆర్‌టిఎ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఎస్‌ఐపై హోంగార్డ్ అత్యాచారం చేసిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం….హైదరాబాద్‌లో ఆర్‌టిఎలో పనిచేస్తున్న మహిళా ఎస్‌ఐ భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. ఈక్రమంలో హైదరాబాద్ ఆర్‌టిఎలో పనిచేస్తుండగా 2018లో ఖమ్మం జిల్లాకు బదిలీ కావడంతో ఇద్దరు పిల్లలు, తల్లితో కలిసి అక్కడికి వెళ్లింది. అయితే ఖమ్మంలో సదరు ఎస్‌ఐకి ఎవరూ పరిచయం లేకపోవడంతో తన వద్ద పనిచేసే హోంగార్డు స్వామిని సాయం కోరింది. దీంతో హోంగార్డు స్వామి మహిళా ఎస్‌ఐకి అద్దెకు ఓ ఇంటిని చూడడమే కాకుండా పిల్లలను స్థానికంగా ఉన్న పాఠశాలలో చేర్పించాడు. ఈ క్రమంలోనే బాధితురాలి కుటుంబంతో హోంగార్డుకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ పరిచయంలో మహిళా ఎస్‌ఐ భర్తతో విడాకుల విషయం, కుటుంబంలోని సమస్యల గురించి తెలుసుకున్నాడు. మహిళా ఎస్‌ఐ ఇంటిలో ఒంటరిగా ఉన్న విషయం తెలుకున్న హోంగార్డు స్వామి పండ్ల రసం తీసుకుని వెళ్లాడు. అప్పటికే అందులో మత్తు మందు కలపడంతో తాగిన వెంటనే ఎస్‌ఐ స్పృహకోల్పోయింది. వెంటనే హోంగార్డు ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా తాను ఎస్‌ఐని అత్యాచారం చేసే సమయంలో వీడియోలు తీశాడు. అప్పటి నుంచి బాధితురాలికి వీడియో చూపిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించడం ప్రారంభించాడు.
ఈ క్రమంలోనే బాధితురాలికి జనవరి, 2022లో హైదరాబాద్‌కు తిరిగి బదిలీ అయింది. దీంతో హోంగార్డు ఫోన్లు చేసి తనతో వీడియో కాల్స్ మాట్లాడాలని, పోర్న్ వీడియోలు చూడాలని వేధించడం ప్రారంభించాడు. తనతో మాట్లాడకుంటే వీడియోలు ఆమె పిల్లలకు, బంధువులు, స్నేహితులకు తన వద్ద ఉన్న అశ్లీల వీడియోలు పంపిస్తానని వేధించాడు. ఇటీవల కాలంలో బాధితురాలు పనిచేస్తున్న హైదరాబాద్‌లోని ఆర్‌టిఎ ఆఫీస్‌కు వచ్చి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వీడియోలు చూపిస్తానని బెదిరించాడు. తన వద్ద ఉన్న వీడియోలు మొత్తం డిలిట్ చేయడంతో పాటు మరోసారి ఫోన్ చేయకుండా ఉండాలంటే, రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. హోంగార్డు వేధింపులు తట్టుకోలేక బాధితురాలు ఈనెల 22వ తేదీన కోర్టులో ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై 376, 354డి, 506, 509ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ రాజశేఖరరెడ్డి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని పోలీసులు వివరిస్తున్నారు.
Woman SI Raped by Home Guard