Sunday, November 17, 2024

పాట్నాలో గంటసేపు తల్లడిల్లిన తల్లి..

- Advertisement -
- Advertisement -

పాట్నా : పెద్దోళ్ల హడావిడి కాన్వాయ్‌ల ముందు పేదోళ్ల పిల్లల ప్రాణాలు దిగదుడుపేనా? బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కారు , వెంబడి ఉండే కార్లు సాగిపోయ్యే వరకూ పాట్నా సమీపంలోని ఫతూహా వద్ద ఓ గంట పాటు అంబులెన్స్ కదలకుండా పడిగాపులు పడింది. శనివారం ఈ ఘటన జరిగింది. అంబులెన్స్‌లో ఓ తల్లి ప్రాణాపాయంలో ఉన్న తన బిడ్డతో ఉంది. పాట్నాలోని ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డను తీసుకువెళ్లేందుకు బయలుదేరింది. అయితే ఈ దారిలోనే సిఎం కాన్వాయ్ వెళ్లుతున్నందున వాహనాలన్నింటిని నిలిపివేశారు. బిడ్డ ప్రాణాలు పొయ్యేలా ఉన్నాయని, తాము వెళ్లేందుకు వీలు కల్పించాలని ఒడిలో బిడ్డతో తల్లి అక్కడి పోలీసులను వేడుకుంది. అంబులెన్స్ అయినా, మరోటి అయినా ఈ దారిలో వదిలేదిలేదని, సిఎం కాన్వాయ్ ముందుగా వెళ్లాల్సిందేనని పోలీసులు తేల్చిచెప్పారు.

అంబులెన్స్‌లోని ఈ చిన్నారి పరిస్థితి, తల్లి బాధ గమనించినా వీరు కరుణించలేదు. నలందాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రారంభించి సిఎం తిరిగి ఈ రూట్లోనే పాట్నాలో వెళ్లడం అంబులెన్స్‌కు బ్రేక్ పడేసింది. బిడ్డ ఉక్కిరిబిక్కిరి అయి దాదాపుగా సొమ్మసిల్లి పోతూ ఉండటం , అంబులెన్స్ ఎంతకూ కదలకపోవడంతో తల్లి గుండె పగిలినట్లు అయింది. ఓ గంట పాటు ఈ తల్లి బిడ్డ కోసం నరకం చూడాల్సి వచ్చింది. ఇటువంటి ఘటనే పాట్నాలో గత నెలలో జరిగింది. సిఎం కాన్వాయ్ ఆగేవరకూ అంబులెన్స్ ఆగిపోవల్సి వచ్చింది. ఈ విషయం తరువాత వెలుగులోకి వచ్చిన తరువాత అధికారులు రంగంలోకి దిగారు. అంబులెన్స్‌ను ఆపేసిన పోలీసును గుర్తించారు. అయితే సదరు వ్యక్తిపై ఎటువంటి చర్యా తీసుకోలేదు. ఈ అనుభవం తరువాత ఇప్పుడు తిరిగి ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News