Sunday, December 22, 2024

బస్సుపై బీర్ బాటిల్‌తో దాడి

- Advertisement -
- Advertisement -

విద్యానగర్ సిగ్నల్ వద్ద బస్సుపై బీర్ బాటిల్‌తో దాడికి పాల్పడిన మహిళపై చట్టప్రకారం చర్య తీసుకుంటామని ఆర్‌టిసి ఎండి సజ్జనార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్‌స వేదికగా వెల్లడించారు. దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన 107 వి/ఎల్ రూట్ నంబర్ గల ఆర్‌టిసి బస్సు గురువారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి ఎల్‌బి నగర్ వైపునకు వెళుతుండగా విద్యానగర్ బస్టాఫ్ తర్వాత సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ వద్ద బస్సు తిరుగుతున్నప్పుడు ఒక మహిళా బీర్ బాటిల్‌తో బస్సుపై దాడి చేసిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో బస్సు వెనకభాగంలో ఉన్న అద్ధం పూర్తిగా ధ్వంసమైందని, ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపారని ఆయన తెలిపారు. విధులు నిర్వహిస్తోన్న మహిళా కండక్టర్ కిందకు దిగి ఆమెను పట్టుకున్నారని, బస్సుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించగా ఆ మహిళ ఒక్కసారిగా తన సంచిలో ఉన్న పామును తీసి కండక్టర్‌పై విసిరేసిందని తెలిపారు.

కండక్టర్ తన చేతులను అడ్డుగా పెట్టడంతో పాము కింద పడిందని, ఈ ఘటనపై హైదరాబాద్ కమిషనరేట్ నల్లకుంట పిఎస్‌లో ఆర్‌టిసి అధికారులు ఫిర్యాదు చేశారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఎంది తెలిపారు. విద్యానగర్ బస్టాప్‌లో బస్సు ఆపకపోవడం వల్లే దాడి చేశారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని, విద్యానగర్ సిగ్నల్ ఫ్రీలెప్ట్ వద్ద ఆర్‌టిసి బస్టాప్ లేదని ఆయన తెలిపారు. ఫ్రీ లెప్ట్‌కు ముందు, తర్వాత రెండు బస్టాప్‌లున్నాయన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న బస్సులపై దాడులు చేయడం, నిబద్దత, అకింతభావంతో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందిని కొందరు ఇలా భయభ్రాంతులకు గురిచేయడం దురదృష్టకరమని ఆయనన్నారు. ఈ తరహా ఘటనలను ఆర్‌టిసి యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని, పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సజ్జనార్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News