Tuesday, January 21, 2025

కొడుకు చేసిన పనికి తల్లిపై దారుణం

- Advertisement -
- Advertisement -

తమ అమ్మాయి వేరే కులం యువకునితో పరారీ అయిందన్న కోపంతో యువకుని తల్లిని అమ్మాయి కుటుంబ సభ్యులు విద్యుత్ స్తంభానికి కట్టివేసి కొట్టిన సంఘటన హవేరీ జిల్లాలో జరిగింది. ఈ సంఘటన వివరాలు శనివారం పోలీస్‌లు తెలియజేశారు. హవేరీ జిల్లా అరె మల్లాపూర్ గ్రామానికి చెందిన హనుమవ్వ మెడ్లేరి కుమారుడు మంజునాథ్ కురుబా కులానికి చెందిన వాడు. మరాఠా వర్గానికి చెందిన అమ్మాయితోప్రేమలో పడ్డాడు. వీరిద్దరిదీ అదే గ్రామం. గత రెండేళ్లుగా సాగుతున్న ఈ ప్రేమవ్యవహారం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి రెండు కుటుంబాల మధ్య గొడవలకు కొట్లాటలకు దారి తీసింది. దాంతో మంజునాథ్ గ్రామం విడిచి ఏడాది అయింది. తన సోదరి ఇంటివద్ద ఉంటున్నాడు. ఈలోగా అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి వేరేవారితోపెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సంగతి తెలిసి మంజునాథ్ తన గ్రామానికి వారం రోజుల క్రితం వచ్చాడు. అమ్మాయితో పరారయ్యాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు మంజునాథ్ తల్లిని ఇంటి నుంచి బయటకు లాగి విద్యుత్ స్తంభానికి కట్టి కొట్టారు. కొంతమంది మహిళలు , మరో ముగ్గురు పురుషులతో కలిసి మంజునాథ్ తల్లిపై దౌర్జన్యం చేశారు. కొంతమంది గ్రామస్థులు అడ్డుకుని మంజునాథ్ తల్లిని విడిపించారు. ఈ సంఘటన తెలిసిన తరువాత పోలీస్‌లు అక్కడకు చేరుకుని గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమె చేతులకు స్వల్ప గాయాలు కాగా చికిత్స చేసి పంపించేశారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News