న్యూస్ డెస్క్: మొహానికి త్రివర్ణ పతాకాన్ని పెయింట్ చేసుకున్నందుకు అమృత్‌సర్‌లోని స్వర్ణాలయంలోకి ప్రవేశించకుండా తనను అడ్డుకున్నారని ఒక మహిళ చేసిన ఆరోపణ తీవ్ర సంచలనం సృష్టించింది. అట్టారీ-వాఘా ఉమ్మడి చెక్ పోస్టు వద్ద ప్రతి రోజు సాయంత్రం జరిగే వీటింగ్ ది రిట్రీట్‌ను సందర్శించే భారతీయులు తమ మొహంపై త్రివర్ణ పతాకాన్ని పెయింట్ చేసుకోవడం సర్వసాధారణం.
స్వర్ణాలయాన్ని ఖలిస్తానీలు చేజిక్కించుకున్నారా అన్న శీర్షికతో ఒక 40 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. మొహానికి త్రివర్ణ పతాకాన్ని పెయింట్ వేసుకున్న ఒక మహిళ స్వర్ణాలయంలోకి ప్రవేశించకుండా తనను అడ్డుకున్న సేవాదార్‌తో వాగ్వాదం పెట్టుకోవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఆమె మరో వ్యక్తికి ఈ విషయం గురించి ఫిర్యాదు చేయగా ఈ మహిళను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ సేవాదార్‌ను ఆ వ్యక్తి ప్రశ్నించడం చూడవచ్చు. ఆమె తన మొహంపై త్రివర్ణ పతాకాన్ని టాటూ వేసుకోవడం పట్ల సేవాదార్ అభ్యంతరం తెలియచేయగా అప్పుడు ఆ వ్యక్తి ఇది భారతదేశం కాదా అని ప్రశ్నించారు. ఇది పంజాబ్ అంటూ సేవాదార్ జవాబివ్వడం వీడియోలో చూడవచ్చు. దీంతో ఆ మహిళ తన వాదన కొనసాగిస్తూ స్వర్ణాలయం భారత్‌లో లేదన్నట్లు ఆ సేవాదార్ మాట్లాడడం బక్వాస్(చెత్త) అంటూ మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ(ఎస్‌జిపిసి) స్పందించింది.
అయితే.. అలా త్రివర్ణ పతాకాన్ని తన మొహంపై పెయింట్ చేసుకుని వచ్చిన ఒక మహిళ పట్ల స్వర్ణాలయం సిబ్బంది దురుసుగా ప్రవర్తించినందుకు శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ(ఎస్‌జిపిసి) క్షమాపణ చెప్పింది. ఈ అంశానికి రాజకీయ రంగు పులమడం పట్ల ఎస్‌జిపిసి ప్రధాన కార్యదర్శి గురుశరణ్ సింగ్ గ్రేవాల్ అభ్యంతరం తెలిపారు. సందర్శకుల పట్ల తమ ఉద్యోగులు ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే తాము అందుకు క్షమాపణ చెబుతామని ఆయన తెలిపారు. మహిళ పట్ల ఒక ఉద్యోగి ప్రవర్తించిన తీరుపై దర్యాప్తునకు ఆదేశించామని, ఆ ఉద్యోగిని అక్కడి నుంచి మార్చామని ఆయన లెలిపారు. ఒక ఉద్యోగి దురుసు ప్రవర్తనను దేశభక్తి అంశంగా మార్చడం, మొత్తం సిక్కు మతాన్నే అప్రతిష్ట పాల్జేయడం తగదని ఆయన అన్నారు.
సిక్కు మత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో చాలా జరుగుతున్నాయని, దీని వెనుక లోతైన కుట్రలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతి మతానికి సొంత సిద్ధాంతాలు, నియమనిబంధనలు ఉంటాయని, వాటిని పాటించాల్సిన ధర్మం ఉంటుందని ఆయన వివరించారు.
Khalistanis taking over Golden Temple!
Woman denied entry to Golden Temple because she had a India 🇮🇳 flag painted on her face! The man who denied her entry into Golden Temple said this is Punjab, not India 😡 @AmitShah pic.twitter.com/bnzUzEqLvM
— JIX5A (@JIX5A) April 17, 2023