Monday, December 23, 2024

బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళల అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఆరు నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు, వారికి సహకరించిన మరో వ్యక్తిని మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. డిసిపి స్నేహమెహ్రా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంఘారెడ్డి, పటాన్‌చెరువుకు చెందిన నస్రీన్ బేగం, నూర్జాహాన్ బేగం, మహ్మద్ ఆదిల్ కలిసి నేరాలు చేస్తున్నారు. ప్రధాన నిందితురాలు నస్రీన్ బేగం మిగతా ఇద్దరిని పిల్లలను కిడ్నాప్ చేయాలని, తాను షెల్టర్ ఇస్తానని చెప్పింది. ఈ క్రమంలోనే భార్య, భర్త నూర్జాహాన్, ఆదిల్ ఈ నెల 9వ తేదీన ఎపిలోని నెల్లూరు జిల్లాలోని బారాసాహెబ్ దర్గాను సందర్శించారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు బస్సులో వస్తుండగా నెల్లూరుకు చెందిన హబీబ్ ఉన్సీసా పరిచయం అయింది. ఆమెకు హైదరాబాద్‌లో నర్సు ఉద్యోగం ఇప్పిస్తామని ఇద్దరు చెప్పారు.

వీరి మాటలు నమ్మిన బాధితురాలిని హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఎంజిబిఎస్ వద్ద ఉన్న సులబ్ కాంప్లెక్స్ వద్ద ఫ్రెష్‌అప్ కామ్మని లోపలికి పంపించి, ఆమె ఆరు నెలల కుమారుడిని పట్టుకున్నారు. బాధితురాలు లోపలికి వెళ్లి వచ్చే సరికి భార్యభర్త తన కుమారుడిని తీసుకుని పారిపోయారు. వెంటనే బాధితురాలు మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేసిన టీములు బాలుడిని పట్టుకుని సురక్షితంగా తల్లివద్దకు చేర్చారు. ఎస్సై అరుణోదయ్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News