హైదరాబాద్: మహిళలు క్యాన్సర్ బారినపడకుండా ఉండాలంటే ఎప్పటికప్పడు ముందు జాగ్రత్తగా పరీక్ష చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, వివిధ శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కింగ్ కోఠి ఆసుపత్రి నిర్వహించారు. ఎంజే క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్ష శిభిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్షం వహిస్తారని ముఖ్యంగా ప్రాణాంతకమైన కేన్సర్ వంటి జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మార్గమన్నారు. ఇంట్లో మహిళ అందరి ఆరోగ్య బాధ్యతలను తీసుకుంటుందని, కానీ తాను మాత్రం తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదన్నారు.
దేశంలో చాలామంది క్యాన్సర్‌తో చనిపోయిన వారిని పరిశీలిస్తే ఆలస్యంగా జబ్బును గుర్తించిన కారణంగానే వారు చనిపోవడం జరుగుతున్నదని,అలా కాకుండా ముందే వ్యాధిని గుర్తించినట్లయితే క్యాన్సర్ బారిన పడి మరణించికుండా కాపాడుకోవచ్చన్నారు. మహిళలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఒకవేళ ఏదైనా అనుమానం వస్తే తక్షణమే సరైన వైద్యులను సంప్రదించడం కూడా చాలా ముఖ్యమన్నారు. మహిళలో తరుచూ వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్‌లను గుర్తించి తగు చికిత్స అందించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.దేశంలో 30శాతం మంది మహళలు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు.