Monday, December 23, 2024

మీ దృష్టిలో స్త్రీలు కేవలం గర్భసంచీలేనా?

- Advertisement -
- Advertisement -

కాలం చెక్కిలి పై ఘనీభవించిన ఒంటరి కన్నీటి చుక్క తాజమహల్ అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అద్భుతమైన కట్టడం, ప్రేమ మందిరంగా ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్ గురించి. 19 సంవత్సరాల వివాహ బంధంలో, 14 మంది సంతానాన్ని కన్నది షాజహాన్ భార్య ముంతాజ్ మహల్. వారిలో 8 మంది మగ పిల్లలు. ఆరుగురు ఆడపిల్లలు. ఇందులో ఏడుగురు పిల్లలు పసికందులుగానే మరణించారు. 36 గంటలపాటు పురిటినొప్పులతో అల్లాడి, 14 వ బిడ్డ గౌహర్ బేగంకి జన్మనిస్తూ, అధిక రక్తస్రావంతో ముంతాజ్ మహల్ 1631వ సంవత్సరంలో మరణించింది. ఆ కాసిన్నేళ్ళ సంసార జీవితంలోనే మహారాణి, గర్భాన 14 మంది సంతానాన్ని పుట్టించిన షాజహాన్ మహారాజు, చివరికి భార్య జ్ఞాపకంగా ఆ మహా కట్టడపు శాశ్వత సమాధిని ఆమె కోసం నిర్మించాడు. తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల గురించి మనం ఎంతో కొంత మాట్లాడుకుంటూనే వున్నా, అతి చిన్న వయసులోనే అంత హింసను అనుభవించి, అన్నేసి గర్భాలను మోసి, రక్తస్తావంతో ముంతాజ్ మహల్ ఎందుకు మరణించాల్సి వచ్చింది అన్న సంగతి లోకానికి ఎన్నడూ పట్టలేదు.

స్త్రీలు కేవలం సంతానాన్ని ఉత్పత్తి చేసే గర్భాలు మాత్రమేనా, వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళ శరీరం వాళ్ళది కాదా, తమ శరీరం పైన, తమ పునరుత్పత్తి శక్తి పైన వాళ్లకు హక్కు లేదా? ఒకవేళ, మేమిక పునరుత్పత్తి చేయమని స్త్రీలు తిరగబడితే మానవజాతి ఏమవుతుంది వంటి ప్రశ్నలు ఆనాటి నుండి, ఇప్పటివరకు కూడా ఈ సమాజానికి, పురుషులకు, మన పవిత్ర కుటుంబాలకు పట్టలేదు. నిజంగానే ఎవరికీ అసలు పట్టలేదు. కాబట్టే, మొన్నటికి మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అక్టోబర్ 20వ తేదీన ‘పార్లమెంటు స్థానాలు మనకు తగ్గిపోతున్న తరుణంలో 16 మంది పిల్లల్ని ఆడవాళ్లు ఎందుకు కనకూడదు’ అని అన్నాడు. అంటే, ఆయన మాట ప్రకారం ముంతాజ్ మహల్ కంటే మరో ఇద్దరిని ఎక్కువ మంది పిల్లలని ఈ ‘ఆధునిక మహిళలు’ కనాలన్న మాట.

అలా ముంతాజ్ మహల్లా బిడ్డల్ని కంటూ, కంటూ మరణించే ఆడవాళ్ళ కోసం తమిళనాడులో ఎన్ని తాజ్‌మహల్‌లు ఆయన సిద్ధం చేస్తున్నాడో ఏమో మనకు తెలియదు. కానీ, మహిళలకు ఇలాంటి పిలుపులు ఇస్తున్న ఆయనకు మాత్రం ఇద్దరు పిల్లలే ఉన్నారు. ఇక అక్టోబర్ 19 వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, తక్కువ మంది పిల్లలున్న వారిని స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులను చేసేలా ఒక చట్టాన్ని తీసుకు వస్తామని అన్నాడు. నిజానికి ఇలాంటి మాటలను చంద్రబాబు నాయుడు 2014 నాటి నుంచే మాట్లాడుతున్నాడు. అంతేకాదు, మీ ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే, ప్రభుత్వం మీకు ఎక్కువ సాయం చేస్తుంది అని కూడా ఆయన ప్రకటించాడు. చంద్రబాబు నాయుడుకి కూడా ఏకైక కుమారుడు లోకేష్ మాత్రమే ఉన్నాడు. ప్రకృతి ఇలాంటి పనిని స్త్రీలకు ఇచ్చింది కానీ, పురుషులకే గర్భాలు వచ్చే స్థితి వుంటే ఇలాంటి వాచాలతను రాజకీయ నాయకులు ప్రదర్శించే వారా అని మహిళలకు అనిపించడంలో తప్పేం లేదు.

ఇప్పుడు ఈ అధిక సంతానపు ఆలోచన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకు ఎందుకు కలిగింది? ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతికపరమైన అనేక అంశాల్లో అనేక తేడాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలు ఆరోగ్యం, విద్య, ఆర్థిక వనరులు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ఇటువంటి అంశాలలో ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో గత అనేక ఏళ్లుగా అనుసరించినటువంటి పాలసీలు కూడా ఈ ముందడుగుకి ఒక కారణం. కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణాది రాష్ట్రాలు రకరకాల పనుల రూపంలో చెల్లించే రెవెన్యూ ఒక్క మహారాష్ట్ర మినహా, ఇతర ఉత్తరాది రాష్ట్రాల కన్నా ఎక్కువగానే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం తక్కువ చెల్లించిన రాష్ట్రాలకు ఎక్కువ శాతం నిధులు కేటాయిస్తూ ఉన్నది, ఎక్కువ రెవెన్యూ చెల్లిస్తున్న తమకు తక్కువ నిధులను ఇస్తున్నది అనేది దక్షిణాది రాష్ట్రాల ప్రధాన ఆరోపణ.

పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ 2020 -21 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులకు కేంద్రం నుండి 15% కంటే తక్కువే నిధులు వస్తుండగా, కాగా ఉత్తరప్రదేశ్‌కు 15%, బీహార్‌కు 30% నిధులు వస్తూ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల్లో ఇలా వివక్ష చూపడం, కొరత విధించడమే వల్ల, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక పథకాలు నిధుల కొరత వల్ల మూలపడుతున్నాయి. ఇప్పటికే అమలు చేస్తున్న అనేక పథకాలను రద్దు చేయడమో లేదా కుదించడమో చేయాల్సి వస్తున్నది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ వివక్షకి వ్యతిరేకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, నియోజకవర్గాల పునర్విభజన గురించి మాట్లాడుతుంది.

ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన లోక్‌సభలో సీట్లను పునర్విభజన చేయాలన్న ఆలోచన కేంద్రానికి ఉంది. తాను అధికారంలో లేని ఈ రాష్ట్రాలపై నియంత్రణకు ఇది దానికి ఒక సాధనం కూడా కావచ్చు. ఈ డీలిమిటేషన్‌ను కనుక ప్రభుత్వం చేపడితే, ఉత్తరాది కన్నా తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. 2026 నాటికి జనాభా శాతం ఇప్పటికన్నా మరింత తగ్గుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 20కి, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 15 కు, తమిళనాడులో 39 సీట్లు 30కి, కేరళలో 28 సీట్లు 26కి, కర్ణాటకలో 20 సీట్లు14కు తగ్గే అవకాశం ఉందని ఒక అంచనా.

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ను గనుక చేస్తే, చట్టసభలలో శాశ్వతంగా ఉత్తరాది రాష్ట్రాలకి మెజారిటీ దక్కుతుంది. కాబట్టి వాటికీ అనుకూలమైన పాలసీలను, చట్టాలను మెజారిటీ పేరుతో చేసుకోవడం సులువు అవుతుంది. స్టాలిన్, చంద్రబాబు ఉద్దేశాలు వేరైనా, వారిలానే అనేక సందర్భాలలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకులు కూడా భారతీయ సంస్కృతిని, నాగరికతను కాపాడటం కోసం, హిందూ సమాజ హితం కోసం, పెరిగిపోతున్న ముస్లిం జనాభాను అడ్డుకునేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని హిందూ స్త్రీలకు పిలుపును ఇచ్చారు. ప్రపంచంలోనే నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాంను ప్రారంభించిన మొట్టమొదటి దేశం భారతదేశం. 1952లో కేవలం కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడంగా ప్రారంభ మైన ఈ ప్రోగ్రాంలో కొన్నేళ్ళ తరువాత, పునరుత్పత్తి ఆరోగ్యం, ప్రసూతి మరణాలను, శిశు మరణాలను తగ్గించడం వంటి అంశాలను కూడా చేర్చారు.

మేమిద్దరం- మాకిద్దరు, చిన్న కుటుంబం- చింతలులేని కుటుంబం వంటి నినాదాలు ఎక్కడ చూసినా మారుమోగేవి. ఇద్దరు పిల్లలే అని ప్రభుత్వం నిర్ణయం చేశాక, పురుషాధిపత్యం వుండే మన సమాజాలలో జరిగిన పర్యవసానం ఏమంటే, గర్భస్థ శిశువు ఆడపిల్ల అయితే చంపేయడమే. యునిసెఫ్ ఇటీవలి నివేదిక ప్రకారం, భారత దేశంలో వున్న లింగ వివక్ష ఫలితంగా 50,00,000 మంది బాలికలు, స్త్రీలు భారత జనాభా నుండి అదృశ్యం అవుతున్నారు. మన దేశంలో ప్రతీ రోజూ చట్టవిరుద్ధంగా 2,000 ఆడ శిశు గర్భస్రావాలు జరుగుతున్నట్లు ఒక అంచనా. అంతేకాదు, అత్యధిక ప్రసూతి మరణాలు జరిగిన దేశాల్లో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 2,87,000 ప్రసూతి మరణాలు నమోదు అవ్వగా, అందులో 24 వేల మరణాలు భారత దేశంలో జరిగాయి.

కుటుంబ నియంత్రణా మాత్రలు, పరికరాలు, నియంత్రణా ఆపరేషన్లు అన్నింటికీ స్త్రీల శరీరాలే వైద్య శాస్త్రానికి, పాలసీలను అమలు పరిచే ప్రభుత్వాలకు ప్రయోగశాలలుగా అయ్యాయి. సామాజిక, సాంస్కృతిక, రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలు విశ్వాసాలు, వైఖరులు ఇవన్నీ కూడా కుటుంబ నియంత్రణతో సహా అనేక పాలసీలను రూపొందించడంలో ప్రభావం చూపుతాయి. కుటుంబ వ్యవస్థలో సాంప్రదాయకంగా స్త్రీలు నిర్వర్తించాల్సిన పని, వారి స్థానం, ఇది కూడా స్త్రీత్వపు, మాతృత్వపు ఉన్నత స్థితి ఏమిటో ఎలా ఉండాలో నిర్వచిస్తాయి. తమ పునరుత్పత్తికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం స్త్రీలకు ఉంటుందా, ఉండదా అనే దాని పైన ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద చర్చనే జరిగింది. ఇంకా జరుగుతూ వుంది. ఆ దేహం స్త్రీలది, ఆ గర్భం స్త్రీలదే కానీ, దానిపైన హక్కు పురుషుడు, ప్రభుత్వం చెలాయించినప్పుడు స్త్రీలకి తమ శరీరలపైనే కాదు, తాము పుట్టించిన సంతానంపై కూడా హక్కు లేకపోవడమే కాక పునరుత్పత్తి, మాతృత్వం అనే వాటిల్లో వారు సంపూర్ణంగా పరాయీకరణకి గురవుతారు.

స్త్రీలకి ఆర్థిక స్వాతంత్య్రం కలగడం వల్ల మాత్రమే కాకుండా, తమ లైంగిక, పునరుత్పత్తి ఛాయిసెస్‌ను కూడా తమ ఇష్ట ప్రకారం నిర్ణయించుకోగలిగినప్పుడు మాత్రమే వారికి పూర్తిగా స్వాతంత్య్రం దొరుకుతుందని మహిళల హక్కుల కోసం పోరాడే వారి దృక్పథం చెప్తుంది. స్త్రీల దేహంపైన పురుషుడి, ప్రభుత్వం హక్కు, కంట్రోల్ పోవాలని కూడా వాళ్ళు అంటారు. మరి ప్రభుత్వం చేయాల్సిన పనేమిటి? బాల్యవివాహాలు, ప్రసూతి మరణాలు, చిన్నపిల్లల శిశుమరణాలు, అనారోగ్యకర పరిస్థితుల మధ్య స్త్రీలకు జరుగుతున్న గర్భస్రావాలు ఇవన్నీ లేకుండా చేయాలి. స్త్రీల పునరుత్పత్తి స్వేచ్ఛను గుర్తించటం, సరైన సమయంలో సక్రమంగా వారి కోసం పునరుత్పత్తి ఆరోగ్య సేవలను అందించడం, కుటుంబ నియంత్రణ, పిల్లల పెంపకం వంటివి పూర్తిగా స్త్రీల పైనే మోపకపోవడం, అన్నవి తప్పనిసరిగా పబ్లిక్ పాలసీలో భాగం కావాలి.

దేశ ఆర్థికాభివృద్ధికి, ఉత్పత్తి పెరుగుదలకు, చట్టసభలలో సీట్ల కేటాయింపులకు స్త్రీల పునరుత్పత్తికీ మధ్య సంబంధం ఉందని మాట్లాడే రాజకీయ నాయకులకి, పై పనులు వేటినీ చేయకుండా, స్త్రీలను కేవలం గర్భసంచీలుగానే పరిగణిస్తూ ఎక్కువ మంది పిల్లలను కనండని మహిళలకు పిలుపునిచ్చే కనీస నైతిక అర్హత లేదు గాక లేదు. దక్షణాది రాష్టాల నాయకులు నిజానికి, నిధులు, చట్టసభలలో సీట్ల కేటాయింపులలో జనాభాను ప్రాతిపదికగా తీసుకోరాదని, అదే చేస్తే, రాష్ట్రాల మధ్య అసమానతలు శాశ్వతంగా నిలిచిపోతాయని భావిస్తే అన్నింటా దామాషా పద్దతిన పాతినిధ్యం (proportional representation) వుండాలనే డిమాండును చేయాలి. అది వదిలిపెట్టి నాయకులు స్త్రీలపై పడటం అంటే మూర్ఖత్వమే కాక, పురుషాహంకారం కూడా.

బహుముఖం

విమల

(రచయిత్రి సామాజిక కార్యకర్త)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News