Wednesday, November 13, 2024

పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ కమిషనరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ముఖ్యఅతిథిగా హైదరాబాద్ సిపి శ్రీనివాస రెడ్డి

హైదరాబాద్: ప్రతి రంగంలో పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసిసిసి బిల్డింగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని, మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలు మెరుగ్గా రాణిస్తున్నారని అన్నారు. మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉంటుందని, వారు కోరుకుంటే ఏదైనా సాధించగలరని తెలిపినారు.

మహిళా అధికారులందరూ ధైర్యంగా పనిచేయాలని, మహిళలు పలు రంగాలలో సాధిస్తున్న విజయాలు రానున్న భావి తరాలకు మార్గదర్శకంగా నిలువాలని తెలిపారు. మహిళా అధికారులందరూ తమ వృత్తిపరమైన బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలని సూచించారు. ఉద్యోగరీత్యా ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందచేశారు మహిళా అధికారులందరూ పోలీసు శాఖలో భాగమై సమాజానికి చేస్తున్న కృషిని కొనియాడారు, మహిళా దినోత్సవ సందర్బంగా మహిళా ఉద్యోగులందరికి శుభాకాంక్షలు తెలిపారు.

జాయింట్ పోలీస్ కమిషనర్ జె.పరిమళా హానా నుతన్ మాట్లాడుతూ ప్రతి మహిళలో లీడర్ షిప్ క్వాలిటీ ఉంటుందని, అందరు విలువలతో దృడ సంకల్పంతో పనిచేయాలి అని కోరారు. ఒక మంచి పని చేస్తున్నప్పుడు , మనము ఒంటరిగా ఆయినాసరే మనలో భయమనేదే ఉండకూడదు ముందుకు సాగుతూ వెళ్లాలి అని అన్నారు. కార్యక్రమానికి విక్రమ్ సింగ్ మాన్ , జె.పరిమళా హానా నుతన్, డిసిపిలు డి.కవిత, రశ్మి పెరుమాల్, సిఎడిఓ సుధారాణి, ఉర్మిళ జెఎఓ, వెంకటరత్న,జ్యోతి, మినిస్టీరియల్ సిబ్బంది, మహిళా పోలీసులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News