Thursday, November 21, 2024

కోబ్రా విభాగంలో తొలి మహిళా కమాండోల చేరిక

- Advertisement -
- Advertisement -

Women contingent inducted into CRPF's CoBRA commando unit

 

నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో విధి నిర్వహణ

గుర్గావ్: అడవులలో యుద్ధం చేయడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన కోబ్రా కమాండో విభాగంలో మొట్టమొదటిసారి 34 మంది సిఆర్‌పిఎఫ్ మహిళా సిబ్బందికి స్థానం దక్కింది. వీరిని త్వరలో దేశంలోని నక్సల్ నిరోధక ఆపరేషన్లలో ప్రవేశపెడతారు. అడవులలో మేథోపరంగా యుద్ధ కార్యకలాపాలు సాగించడానికి 2009లో సిఆర్‌పిఎఫ్ పరిధిలో కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్(కోబ్రా)ను నెలకొల్పారు. ఇప్పటివరకు ఈ విభాగంలో పురుషులు మాత్రమే పనిచేస్తున్నారు. శారీరకంగా, మానసికంగాదృఢంగా ఉండే కోబ్రా బృందాలలో అత్యధికం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలలో పనిచేస్తున్నాయి. కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో పనిచేస్తున్నాయి.

కోబ్రా విభాగంలో మహిళా కమాండోల చేరిక సందర్భంగా శనివారం ఇక్కడి కదర్‌పూర్ గ్రామంలో ని ఫారెస్ట్ క్యాంప్‌లో ఒక కార్యక్రమం జరిగింది. కొత్తగా చేరిన మహిళా కమాండోలు నిర్వహించిన పోరాట ప్రదర్శనను సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎపి మహేశ్వరి వీక్షించారు. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఆరు మహిళా బెటాలియన్ల నుంచి ఈ మహిళా కమాండోలను కోబ్రాకు ఎంపిక చేసినట్లు సిఆర్‌పిఎఫ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మూడు నెలల పాటు ఈ మహిళా కమాండోలకు శిక్షణ ఉంటుందని, అనంతరం వీరిని నక్సల్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, దంతెవాడ, బీజాపూర్ తదితర జిల్లాలలో కోబ్రా విభాగాలలో నియమిస్తామని ప్రతినిధి చెప్పారు.

ఈ సందర్భంగా సిఆర్‌పిఎఫ్ డిజి మహేశ్వరి మాట్లాడుతూ కొత్త యుద్ధరీతి ప్రత్యక్ష యుద్ధంగా కాక పరోక్ష పోరాటంగా, సైబర్ కేంద్రంగా, అడవుల నుంచి జనావాస ప్రాంతాలకు మారిపోయిందని అన్నారు. ఐఎస్‌ఐఎఎస్(నిషిద్ధ అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ)కు భౌతికంగా సరిహద్దులను దాటాల్సిన అవసరం లేదని, ఒక బెంగళూరు టెకీని మానసికంగా లోబరుచుకుంటే చాలునని(కుట్రలు రూపొందించడానికి) ఆయన అన్నారు. ప్రతి పౌరుడు ఒక సైనికుడని, అలాగే ప్రతి సైనికుడు ఒక పౌరుడని ఆయన ఈ సందర్భంగా ఉద్బోధించారు. స్లీపర్ సెల్స్ తదితర తీవ్రవాద శక్తుల కార్యకలాపాలను అరికట్టడంలో మహిళా కమాండోలు కీలక పాత్ర పోషించగలరని ఆయన అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News