Saturday, November 23, 2024

స్త్రీల ఆధునికతకు తొలి ఆనవాళ్లు

- Advertisement -
- Advertisement -

తమ వలసాధిపత్య ప్రభుత్వం నడిచేందుకు అవసరమైన ఉద్యోగులను ప్రధానంగా గుమాస్తాలను తయారు చేసుకునేందుకు బ్రిటిష్ పాలకులు 1835లో మెకాలే ‘ఇంగ్లీష్ విద్యా చట్టం’ని అమల్లోకి తెచ్చారు. ఈ మెకాలే (18001859) విద్యా విధానంతో అప్పటికే సంప్రదాయ చదువుల్లో ముందున్న బ్రాహ్మణ సామాజిక వర్గం వారు ఎక్కువ లబ్ధి పొందారు. ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వీళ్లలో ఉపాధ్యాయులు, జడ్జిలుగా నియమితులైన వాళ్లు సామాజిక సంస్కరణ పట్ల మిగతావారికన్నా ఎక్కువ మక్కువ చూపించారు. వీరి చొరవతో బెంగాల్, బొంబాయి, మద్రాసు ప్రావిన్స్‌లలో సంస్కరణోద్యమాలు ప్రారంభమయ్యాయి.

తెలుగు ప్రాంతాల్లో కూడా ఈ ఉద్యమ ప్రభావం ఉండింది. నిజానికి తెలుగునాట ఆధునిక విద్య 1805లో విశాఖపట్టణంలో యురేషియన్లకు చదువు చెప్పేందుకు ఏర్పాటైన పాఠశాలతో ప్రారంభమైందని చెప్పవచ్చు. బెంగాల్‌లో 1810 నాటికే బాలికల మిషనరీ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 1822లో బ్రిటిష్ అధికారి థామస్ మన్రో (17611827) చేపట్టిన ఒక సర్వేలో దేవదాసీలకు అయ్యవార్లు చదువు చెప్పేవారు అని పేర్కొన్నాడు. ఈ దేవదాసీ బాలికలు, బాలురతో పాటు తరగతి గదిలో కూర్చునేవారు. ఇవి తొలి వెలుగులు. వీటికి కొనసాగింపుగా బెంగాల్‌లో ప్రబలంగా ఉన్న ‘సతి’ దురాచారాన్ని 1829లో నిషేధించారు. ఆధునిక మహిళా చరిత్రలో ఇది తొలి ముందడుగు. సనాతన భావాలపై వేటు. మూఢాచారాలపై సామాజిక చైతన్యం సాధించిన విజయం.

మనుస్మ ృతిపై మహిళలు, ప్రగతిశీలురు, ప్రభుత్వం సాధించిన గెలుపు. ఇందుకు రాజ రామ్మోహన్ రాయ్ (17721833) 1828లో ఏర్పాటు చేసిన బ్రహ్మసమాజ్ కార్యకలాపాలు కూడా తోడ్పడ్డాయి. ఈయన అంతకు ముందు 1815లో స్థాపించిన ‘ఆత్మీయ సభ’ స్త్రీల విద్యావశ్యకత గురించి, సతి నిషేధం గురించి బహిరంగంగా మాట్లాడిన మొదటి సంస్థ. ఈయన ఇండియాలోనే ఇంగ్లండ్‌లో సైతం ఉద్యమాలు నడిపారు. అయితే కలకత్తాలోని సంప్రదాయవాదులు ‘సతి’ నిషేధానికి వ్యతిరేకంగా ‘ధర్మసభ’ని ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద వత్తిడి తీసుకొచ్చిండ్రు. దాని వల్ల చట్టంలో పదేండ్ల తర్వాత కొన్ని మార్పులు తెచ్చిండ్రు. ఇదంతా ఒక వైపు కొనసాగుతుండగానే బాల్య వివాహాలకు, బహు భార్యత్వానికి, ‘సతి’ మౌఢ్యానికి వ్యతిరేకంగా దేవేంద్రనాథ్ ఠాగూర్ (18171905) తదితర సంస్కర్తలు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.
ఈ దశలోనే అందుబాటులోకి వచ్చిన అచ్చు యంత్రాలు ఇంగ్లీష్ విద్యా చట్టం కారణంగా విసృ్తతంగా ప్రచారంలోకి వచ్చాయి. తద్వారా పుస్తకాలు, పత్రికలు ప్రధానంగా ఇంగ్లీషు భాషలో విరివిగా ప్రచురితమయ్యాయి.

ఈ పత్రికలే వివక్ష, అసమానతలను ప్రశ్నించాయి. కొత్తగా ప్రశ్నించే గొంతుకలకు ఊతమిచ్చాయి. ప్రభుత్వపరమైన ఆంక్షలను ఎదుర్కొంటూ కూడా ఈ పత్రికలు ప్రజలను చైతన్య పరిచాయి. తెలుగు భాషలో నడిచిన పత్రికలు సైతం ఇంగ్లీషులో శీర్షికలు ఇచ్చేవారు. అంటే పత్రికా సంపాదకులకు దేశీయ భాషలతో పాటు ఇంగ్లీషు విద్య ఉండడం ఒక ఆనవాయితీగా ఉండేది. ఆ ఇంగ్లీషు విద్య స్ఫూర్తితో వీళ్ళు స్త్రీలకు విద్య నేర్పించడం, సంస్కరణలపై దృష్టిని కేంద్రీకరించారు. స్త్రీలు అంటే వీళ్ళ దృష్టిలో ఆధిపత్య కులం వారే. అందుకే దేవదాసీ స్త్రీలు/బాలికలు పాఠశాలలో బాలురతో పాటు సమానంగా కూర్చొని చదువుకోవడాన్ని ఈ సంపాదకులు వ్యతిరేకించారు.

ప్రధానంగా వివేకవర్ధని (1875), లోకరంజని (1875), యధావాసిని (1878), నేటివ్ న్యూస్ (1875) పత్రికలు ఈ నిర్ణయాన్ని తూర్పారా పట్టాయని ‘దేవదాసీ వ్యవస్థ’ పుస్తకంలో రచయిత్రులు వకుళాభరణం లలిత, మల్కాపల్లి ప్రమీలారెడ్డిలు రికార్డు చేశారు. ఇందులో ‘వివేకవర్ధని’ పత్రికను కందుకూరి వీరేశలింగం, లోకరంజని పత్రికను మద్రాసు నుంచి కాకర్ల సుబ్బయ్య నడిపించారు. ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మహిళలు వాటిని సమర్ధవంతంగా అధిగమించి చదువుకున్నారు. ఇంట్లోని నాలుగు గోడల మధ్య చదువు గాకుండా, ఆడామగ కలిసి చదువుకునే పాఠశాలలకు వెళ్ళారు. మిషనరీ విద్యా సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు ఈ ఉద్యమానికి అండగా నిలిచాయి.

తొలిదశలో అన్యాయాలను, వివక్షను ప్రశ్నించిన దాదాపు అందరూ ఆంగ్ల విద్యనభ్యసించినవారే కావడం విశేషం. అందుకే ఇండియాలో ఆధునికతకు మూలం ఆంగ్ల విద్య. నిజానికి బ్రిటిష్, ఫ్రెంచ్ వలసదారుల దగ్గర మొదట దుబాసీలుగా పనిచేసిన వారు శూద్రులు. ఆనందరంగ పిళ్ళై ఇందుకు ఉదాహరణ. ఈ దుబాసీలు ఫ్రెంచ్, ఇంగ్లీష్ వారికి స్థానిక సంప్రదాయాలు, ఆచారాలు అర్థమయ్యేలా చెప్పేవారు. డాక్యుమెంట్లను తర్జుమా చేసేవారు. ఆ తర్వాత ఆచార వ్యవహారాలపై సాధికారిత గలవారము అనే పేరిట ఈ శూద్రుల స్థానాన్ని ఇంగ్లీషు నేర్చుకున్న బ్రాహ్మణులు భర్తీ చేశారు. ఇట్లా తొలిదశలో మెకంజీ ఆశ్రిత పండితులు కావలి బొర్రయ్య సోదరులు, మదరాసు కోర్టు ఉద్యోగులు ఏనుగుల వీరస్వామయ్య (17601836), వెన్నెలకంటి సుబ్బారావు (17841839) లాంటి తెలుగు వారు ఇంగ్లీషులో రచనలు చేసిండ్రు. కొంత స్త్రీ విద్య పట్ల సానుకూలంగా ఉన్నారు.

వాటిని తమ రచనల్లో ప్రతిఫలింపజేశారు. లంగరు పాపయ్య లాంటి దుబాసీలు ఈ కోవలోని వారే. అయితే ఈ ఆంగ్ల విద్యనభ్యసించిన ఆధునికులు అందరూ ఒకేతీరుగా లేరు. ఈ సామాజిక వర్గంలోని చాలా మంది తమ ఇండ్లల్లో స్త్రీల విద్యపై ఉన్న నిషేధాన్ని ఎదిరించలేక పోయారు. సుప్రసిద్ధ సంస్కర్త, జడ్జిగా పనిచేసిన ఎం.జి.రనడే (18421901) ఇంట్లోనే స్త్రీలకు చదువు నిషేధం. అట్లాగే మరాఠి తొలితరం రచయిత్రి కాశీబాయి కనిట్కర్ (18611948) చాటుమాటుగా చదువుకొని ‘రంగారావు’ లాంటి నవలలు రాసింది. భండారు అచ్చమాంబ (18741905) కూడా తమ్ముడి చదువును చూసి భర్త చాటున విద్యను నేర్చుకున్నది. మహిళలే కాదు సనాతన సంప్రదాయం కారణంగా శూద్రులు సైతం విద్యకు వంచితులయ్యారు.

జోతిబా (18271890) సావిత్రిబాయి ఫూలే (18311897) దంపతులు, పరవస్తు చిన్నయసూరి (18091861), సామ్యూల్ వేదనాయగం సత్యనాథన్ (18261889), నరహరి గోపాల కృష్ణమ ెట్టి, సామినీన ముద్దు నరసింహ నాయుడు (17921856), గాజుల లక్ష్మీనరసుశెట్టి (18061868), లాంటి కొద్దిమంది 1857కు ముందే ఈ అడ్డంకిని అధిగమించగలిగారు. ఆ తర్వాతి తరంలో జియ్యరు సూరి (18501939), జి.వేదాంత చారి (1870 ప్రాంతం), రఘుపతి వెంకటరత్నం నాయుడు తదితరులున్నారు. ఇందులో బెంగళూరుకు చెందిన జియ్యరు సూరి ‘స్త్రీ కళా కల్లోలిని’, ‘స్త్రీ విద్యామణి’, ‘స్త్రీ సమాజము’ అనే రచనలు చేసిండు. అట్లాగే జి.వేదాంత చారి వివాహ సంస్కరణలు, కన్యాశుల్కంపై 1870లో రచనలు చేసిండు. 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాసు యూనివర్సిటీలు స్థాపితం కావడంతో ఉన్నత విద్య దేశీయులకు ప్రధానంగా పురుషులకు సైతం అందుబాటులోకి వచ్చింది.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం (1857) తర్వాత వలస పాలన ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి చేతుల్లోకి మారింది. కొంతైనా బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడింది. విద్యారంగంలో చేపట్టాల్సిన సంస్కరణలు సూచించేందుకు ఏర్పాటు చేసిన చార్లెస్ వుడ్స్ 1854లో సమర్పించిన తన నివేదికలో బాలికల విద్యకు ప్రోత్సాహం ఇవ్వాలని, ఇంగ్లీష్‌తో పాటు దేశీయ భాషాలకూ ప్రోత్సాహమివ్వాలని సూచించాడు. ఈ సూచన మేరకు 1860 నాటికి రాజమండ్రి, నెల్లూరు, వైజాగ్, కడప, బళ్ళారి తదితర ప్రదేశాల్లో బాలికలకు సైతం చదువు చెప్పేందుకు పాఠశాలలను ఏర్పాటు చేశారు. అందుకే కందుకూరి వీరేశలింగం ‘వివేక వర్ధని’ పత్రికలో ఇంగ్లీషు విద్య గురించి ఇట్లా రాసిండు.

“పాశ్చాత్య విజ్ఞానం భారతీయుల మీద అద్భుతంగా పనిచేసింది. ఇంగ్లీషు విద్య మన వాళ్ళ ప్రవర్తనను మరింత నాగరికం చేసింది. చాలా మందిలో కాకపోయినా కొందరిలోనైనా మూఢ విశ్వాసాలను తొలగించింది. ఈ విద్య సక్రమంగా బోధించినప్పుడల్లా వాళ్ల నైతిక స్థాయిని పెంచింది” అన్నాడు. ఈ పరిణామాల పర్యవసానంగా దేశీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుకున్న విద్యావంతులు బ్రిటిష్ పాలనలో జడ్జిలుగా, టీచర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులయ్యారు. ఇట్లా కొంత స్థిరమైన జీవనం ఉన్నవారు, ఆర్థికంగా బలంగా ఉన్న మేధావులు, ఉదారవాద జమిందారులు ప్రజాభ్యున్నతి కోసం పాటుపడ్డారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా, స్త్రీల హక్కుల కోసం కొట్లాడిండ్రు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా, రజస్వాలనంతర వివాహాలకు, వితంతు వివాహాలకు అనుకూలంగా పోరాటాలు చేసిండ్రు. శిరోముండనాన్ని నిరసించారు. భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇదే కాలంలో క్రిస్టియన్ మిషనరీలు వైద్యం, విద్యను సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి అందుబాటులోకి తెచ్చేందుకు కొంత ప్రయత్నం చేశారు. అంతేగాదు కొత్తగా క్రైస్తవాన్ని స్వీకరించిన ‘సవర్ణులు’ సైతం తమ సామాజిక వర్గాల చైతన్యం కోసం కృషి చేసిండ్రు. ఇట్లా తొలిదశలో పోరాటం చేసిన వారిలో బెంగాల్‌లో ఇంగ్లీష్ విద్యనేర్చుకున్న రాజరామ్మోహన్ రాయ్ మొదటి వరుసలో ఉంటాడు.

ఆ తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ (18201891) కేశవ చంద్రసేన్ (18381884), స్వర్ణకుమారి (18561932), తొలి మరాఠీ మహిళా నవలాకారిణి సాలుబాయి తాంబ్వేకర్ (‘చంద్రప్రభ’ నవల ప్రచురణ 1873), రవీంద్రనాథ్ ఠాగూర్ (18611941), మహరాష్ర్టలో జ్యోతిబా ఫూలె, సావిత్రిబాయి ఫూలె, ఎం.జి.రనడె, గోపాల్ హరి దేశ్‌ముఖ్ (18231892), ఆత్మారాం పాండురంగ్ (18231898), ఆయన సోదరులు, పండిత రమాబాయి (18581922), దొండొ కేశవ కార్వె (18581962), బి.ఎం.మలబారి (18531912), జి.కె.గోఖలె (18661915), ఆర్.జి.భండార్కర్ (18371925), రుఖయా సఖావత్ హుసేన్ (18801932), తారాబాయి షిండే (18501910), రమాబాయి రనడె (18621924), మద్రాస్ ప్రావిన్స్‌లో గాజుల లక్ష్మీనరసు ెట్టి, టి.కె.మాధవన్ (18851930), ఎ. మాధవయ్య (18721925), సుబ్రమణ్యభారతి (18821921), రఘుపతి వెంకటరత్నం నాయుడు (18621939), కందుకూరి వీరేశలింగం (18481919) 1900లకు ముందే స్త్రీ విద్య, వింతంతు పునర్వివాహం, రజస్వాలనంతర వివాహం తదితర అంశాలపై ఉద్యమాలు చేసిండ్రు. రచనలు చేసిండ్రు.

పత్రికలు నడిపించిండ్రు. ఇదే సమయంలో సయ్యద్ హుసేన్ బిల్‌గ్రామి (18441926) లాంటి వారు దేశంలోనే మొదటిసారిగా ముస్లిం బాలికల కోసం హైదరాబాద్‌లో విద్యాలయాన్ని స్థాపించారు. దానికి ప్రిన్సిపాల్‌గా ఇంగ్లండ్‌లో చదువుకున్న అన్నపూర్ణ (18581891) లాంటి ఉన్నత విద్యావంతురాలిని, సంస్కర్తను నియమించారు. అట్లాగే సాలార్‌జంగ్ (18291883), అఘోరనాథ్ చటోపాధ్యాయ, రామచంద్ర పిళ్ళై(1902), సోమసుందరం మొదలియార్‌లు బాలికలు సైతం విద్యాభ్యాసం చేసేందుకు వెసులుబాటు, ఏర్పాట్లు కల్పించారు. సంస్థానాల్లో జరిగిన సంస్కరణోద్యమాల్లో బరోడా, తిరువనంతపురం, మైసూరు తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉండింది.

విద్యావంతుల పోరాటాలు, విజ్ఞాపనల మూలంగా బ్రిటిష్ ప్రభుత్వం 1856లో ‘వితంతు పునర్వివాహ’ చట్టాన్ని, ‘వివాహ సమ్మతి వయస్సు’ చట్టాన్ని 1861లో తీసుకొచ్చారు. 1869లో విడాకుల చట్టం, భ్రూణ హత్య నిరోధక చట్టం 1870, పెండ్లయిన స్త్రీల ఆస్తి హక్కు చట్టం 1872 అమల్లోకి రావడంతో స్త్రీలకు న్యాయపరంగా పెద్ద అండ దొరికినట్లయింది. అయితే మొదట పదేండ్లున్న వివాహ సమ్మతి వయస్సును 12 యేండ్లకు పెంచడంతో 1890లో సంప్రదాయవాదులు, ప్రగతిశీలుర మధ్యన పెద్ద పోరాటమే జరిగింది. ఇదంతా పీష్వాల కాలం (1818) వరకూ (కేరళలో ఆ తర్వాత కూడా) అమలులో ఉన్న మనుస్మ ృతికి వ్యతిరేకంగా విద్యావంతులు, సామాజిక సంస్కర్తలు చేసిన పోరాటం. ఈ ఉద్యమాలు ఇండియాలో ఆధునికతకు దారులు వేశాయి. ప్రశ్నించే తత్వాన్ని నేర్పాయి.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం దేశీయుల్లో స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపింది. విద్య ద్వారా అందిన చైతన్యం హక్కుల కోసం నినదించేలా చేశాయి. విద్యావంతులు, సాహితీవేత్తలు సామాజిక సంస్కరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలో కేశవరావు కొరాట్కర్ లాంటి వారి మూలంగా ఆర్యసమాజ్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అట్లాగే బ్రహ్మసమాజ్, దివ్యజ్ఞాన సమాజం, మిషనరీ కార్యకలాపాలు తెలుగు పట్టణాలకు సైతం విస్తరించాయి. ఇంగ్లీష్ విద్యాభ్యాసం మూలంగా సమాజంలోని ఆధిపత్యకులాలకు చెందిన పురుషులు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదించారు. సాధారణంగా వీరి పోస్టింగ్ సొంత ఊర్లో గాకుండా దూర ప్రాంతాల్లో ఉండేవి. ఇట్లా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిన భర్తల వెంట భార్యలు కూడా ఆ యా ప్రదేశాలకు వలస వెళ్ళారు. బయటి ప్రపంచాన్ని కొత్తగా దర్శించిన ఈ స్త్రీలే తొలిదశలో సాహిత్య, సామాజిక, కళా రంగాల్లో రాణించారు. సాహిత్యాన్ని వాహికగా చేసుకొని పత్రికా మాధ్యమం ద్వారా స్త్రీల అభ్యున్నతికి పాదులు వేశారు. దీనికి మిషనరీలు, పాఠశాలలు, ఉపాధ్యాయినులు, మహిళా సంఘాలు, గ్రంథాలయోద్యమం, సభలు, సమావేశాలు వెసులుబాటు కల్పించాయి.

ఉద్యమ రూపునిచ్చాయి. బెంగాల్‌లో తోరుదత్ (18771956), మహరాష్ర్టలో సావిత్రిబాయి ఫూలె, తారాబాయి షిండె, పండిత రమాబాయి, కాశీబాయి కనిట్కర్, మదరాసు రాష్ర్టంలో కృపాబాయి సత్యనాథన్ (18621892), కమలాబాయి సత్యనాథన్ (18791950), హైదరాబాద్ రాజ్యంలో సరోజిని నాయుడు (18791949), తాయెబ బేగవ్‌ు (18731922), ముత్తులక్ష్మీ రెడ్డి (18861968) తదితరుల రచన, ఆచరణ ఇందుకు కొన్ని ఉదాహరణలు. ఈ విషయాలన్నీ కొంచెం అర్థమయితేగానీ ఇప్పుడు మనం చదువుకుంటున్న 28 మంది రచయిత్రులను వారి రచనలను, కార్యకలాపాలను సమగ్రంగా అంచనా వేయడానికి కుదరదు. వారి సాహసం, త్యాగం, కృషి, ప్రేమ, చైతన్యం అర్థం కాదు. ఈ విషయాలు అవగతమైతేగానీ మన రచయిత్రులు చరిత్రలో ఎక్కడ నిలబడతారు అనేది నిర్ధారించడానికి వీలవుతుంది. వారి త్యాగం, సాహసం, సాహిత్యం అన్నింటిని సమగ్రంగా అంచనా వేయడానికి, విశ్లేషించుకోవడానికి, వివరించడానికి దోహదపడుతాయి. ఇప్పుడీ పుస్తకంలో పేర్కొన్న దాదాపు అందరు మహిళలు పుట్టినూర్లో/ప్రదేశంలో గాకుండా వలస వెళ్ళిన ప్రదేశంలో రాణించారు. సాహితీ సృజన చేశారు. ఈ సాహితీమణులు పుట్టినూరు నుంచి మెట్టినింటికి అక్కడి నుంచి భర్తతో పాటు బదిలీ ప్రదేశానికి వెళ్ళిండ్రు. వివిధ ప్రదేశాల్లోని వ్యక్తులతో పరిచయాలు వాళ్ళని వాళ్లు మరింతగా సానబెట్టుకోవడానికి తోడ్పడ్డాయి. వివిధ ప్రదేశాల్లోని పరిస్థితులను పోల్చి చూసుకొని లోపాలు సవరించుకోవడానికి కూడా ఈ వలసలు వీలు కల్పించాయి. పురుషుల కన్నా వీరికే ఎక్కువగా టోపోగ్రఫీ తెలుసంటే అతిశయోక్తి కాదు.

నిజానికి వలసలు వ్యక్తును చైతన్యవంతం చేస్తాయి. బంధువులు తమ కార్యకలాపాలకు అడ్డుకల్పిస్తారనే భయం ఉండదు. ఎందుకంటే సొంత ఊర్లో అయితే ఏ పని చేయాలన్నా బంధువులకు తెలిస్తే ‘కట్టుబాట్ల’ పేర అభ్యంతర పెడతారు అనే శంక ఉంటుంది. ఆ శంకను ఈ మహిళలు అధిగమించి సాహితీ సృజన చేశారు. ఇందుకు సరైన ఉదాహరణ ఇప్పుడు అమెరికా వెళ్ళిన తెలుగు మహిళల జీవన విధానం, స్వేచ్ఛా, స్వాతంత్య్రం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళూ వలస వెళ్ళిన వాళ్ళే. 1874 నుంచి 1903 మధ్య కాలంలో సాహితీ సృజన చేసిన తెలుగు మహిళలను ఒక కాల క్రమంలో ఇందులో ఆచార్య కాత్యాయని విద్మహే గారు రికార్డు చేశారు.

నాలుగు దశాబ్దాల పరిశోధన, అధ్యాపన, అధ్యయనం, అనుభవం ఇందులో ప్రతిఫలిస్తున్నది. 30/29 ఏండ్ల కాలంలో తెలుగు రచయిత్రులు/కవయిత్రులు చేసిన సాహితీ సృజన, అందుకు పత్రికలు, సంస్థలు, ఉద్యమాలు తోడ్పడిన తీరుని కూలంకషంగా చర్చించారు. స్త్రీలు వారి సామాజిక స్థితిగతులు, రచనా ప్రతిభ, వాటి ప్రభావం, సమాజ చలనశీలత అన్నింటిని అక్షరీకరించారు. పాదసూచికలకు, బ్రాకెట్లలోని విషయాలకు మాత్రమే పరిమితం చేయబడ్డ స్త్రీల సాహిత్యాన్ని అత్యంత శ్రద్ధతో చిత్రికగట్టారు. వలసాధిపత్య ప్రభుత్వాలు పరిమితంగానే అయినా స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కల్పించాయని ఈ రచనల వల్ల అర్థమవుతుంది. ఒక అవసరమైన పనిని ఒకింత ఆలస్యంగానైనా ఆరంభించినందుకు తెలుగుజాతి కృత్ఞత పూర్వకంగా ఉంటుంది. అందుకు గర్వపడుతుంది కూడా. ఈ శ్రమకు, శోధనకు కచ్చితంగా కాత్యాయని గారికి తెలుగు సాహితీ సమాజం రుణ పడి ఉంటుంది.

(కాత్యాయనీ విద్మహే రచించిన ‘తొలి అడుగులు ఆధునిక స్త్రీల సాహిత్యం 17851903’ పుస్తకానికి రాసిన ముందుమాటలోంచి.)

సంగిశెట్టి శ్రీనివాస్
9849220321

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News