Wednesday, January 22, 2025

స్త్రీలను రేప్ చేయడానికి పెళ్లి ఒక లైసెన్స్ కారాదు

- Advertisement -
- Advertisement -

క్షేత్ర బీజ న్యాయపు మనుధర్మంపై ఆధారపడి వేల ఏళ్లుగా నడుస్తున్న మన కుటుంబ, వైవాహిక వ్యవస్థ స్త్రీలని స్వతంత్రమైన మనుషులుగా, సమాన హక్కులు వుండే పౌరులుగా పరిగణించిన పాపానపోలేదు ఎప్పుడూ. నస్త్రీ స్వాతంత్య్ర మర్హతే అంటూ స్త్రీలను బాల్యంలో తల్లిదండ్రుల ఆధీనంలోనూ, వివాహం తర్వాత భర్త ఆధీనంలోనూ, వృద్ధాప్యంలో పుత్రుల ఆధీనంలోనూ ఉండాలి అని నిర్దేశించిన భావ జాలం నుండి మన సమాజం ఏనాడూ బయట పడిందిలేదు. పశువును, స్త్రీని నియంత్రణలో ఉంచేందుకు బలప్రయోగం తప్పనిసరి అనే చెప్పే ధర్మశాస్త్రాలు, విశ్వాసాలు, సంస్కృతులు మన న్యాయ, రాజకీయ, సాంఘిక వ్యవస్థలకు ఆధారాలు. 2022న కర్ణాటక హైకోర్టు ఒక మంచి తీర్పునిచ్చింది.

భర్త భార్యపై మ్యారిటల్ రేపు చేయడం అది ఏ రకంగానూ అభ్యంతరం కాదు అనేది కాలం చెందిన అత్యంత హేయమైనా దృక్పథం అంటూ, అత్యాచారం అనేది ఎక్కడన్నా అత్యాచారమే. అది భర్త అనే పేరుతో చేసినా, అది భార్య అనే ఆమె పైన చేసినా అనింది. అది మరో గొప్ప వ్యాఖ్యానం, స్త్రీలను రేప్ చేయడానికి పెళ్లి ఒక లైసెన్స్ కాదు అని కూడా స్పష్టంగా చేసింది. పురుషాధిపత్య సమాజంలో స్త్రీలు తమ ఇంట్లోనే ఉన్న శత్రువును గుర్తించడం, పోరాడటం అంత తేలికైన విషయం ఏమీకాదు. ఈ విషయంలో చట్టంతో సహా ఏ వ్యవస్థలూ ఆమెకి మద్దతును ఇవ్వవు. పైగా బాధితురాలినే నేరస్థురాలిని చేసి బోను ఎక్కిస్తాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ హెచ్‌ఎఫ్‌ఎస్- 5) అధ్యనం ప్రకారం వివాహితులైనటువంటి మహిళల్లో 32% మంది మహిళలు భారత దేశంలో వాళ్ళ భర్తల చేతులలో శారీరక, లైంగిక, మానసికపరమైన హింసలను ఎదుర్కొంటూ ఉన్నారు.

1920 -21 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం 17.6% అంటే లక్ష మందికి పైగా మహిళలు 15 నుంచి 49 వయసు మధ్యలో ఉన్న వాళ్ళు, తమ భర్తలు తమపై చేసే లైంగిక చర్యని తాము నివారించలేమని, వాళ్ళు ఎంతో అభ్యంతరకరంగా, హింసాత్మకంగా తమతో సెక్స్ చేసినా వాళ్ళకు కాదని చెప్పలేని స్థితిలో తాము ఉన్నామని చెప్పగా, మరో 11 శాతం మంది తాము నిరాకరిస్తే, భర్తల చేతుల్లో దెబ్బల్ని తింటామని అంటూనే, ఆ పని చేసే హక్కు భర్తలకు ఉందని భావిస్తూ ఉన్నారు. మరో సర్వేలో 40% మంది మహిళలు, 38% మంది మగవారు భార్యను కొట్టడం చాలా సహజమైన విషయమని అది అంత పట్టించుకోవాల్సిన సంగతి ఏం కాదని అన్నారు. ప్రపంచంలో జెండర్ బేస్డ్ వైయలెన్స్‌ని ప్రతి ముగ్గురిలో ఒక మహిళ ఎదుర్కొంటున్నట్లు డబ్ల్యు.హెచ్.ఒ. నివేదిక చెప్తూ ఉంది.

ఇది మనకి బయటకు వచ్చిన లెక్కలు. కాగా, ఏ అధ్యయనాలకు అందిని లెక్కలు, నిజానికి ఇంతకు రెట్టింపు వుంటాయి. కుటుంబ హింస ఇంటి నాలుగు గోడల మధ్య జరిగే హింస. అది శారీరకంగా, మానసికంగా, నిశ్శబ్దంగా, ఒక్కోసారి బాహాటంగా జరుగుతుంది. కుటుంబం వ్యక్తిగత, పవిత్ర వ్యవహారం కాబట్టి, కుటుంబ గుట్టు ఎన్నడూ బయట పెట్టకూడదని, భర్త, పిల్లల కోసం బతకాలని, కుటుంబ గౌరవం, ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత స్త్రీలదే అనే బోధనలతో, కుటుంబ హింస, మారిటల్ రేప్ సహజం, అనివార్యం, దానిని అంగీకరించి తీరాల్సినదే అనే స్థితికి స్త్రీలు తీసుకురాబడతారు. మెజారిటీ పురుషులు పెళ్లి ద్వారా తమకి సంక్రమించిన సహజ హక్కు భార్య శరీరం కూడా అని అనుకుంటారు. మన చుట్టూనే, మన ఇరుగు పొరుగు, చివరికి మన ఇళ్ళలో ఇంత హింస జరుగుతున్నా మనం కూడా వాటిని వ్యక్తిగతమైన విషయాలనే పేరిట పట్టించుకోం.

15 ఏళ్లు దాటిన భార్యతో భర్త సెక్స్ జరిపితే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని, సెక్షన్ 375 రేప్ నిర్వచనంలో ఎప్పుడో స్పష్టంగా చెప్పింది. అది ఇప్పుడు 15 నుంచి 18 ఏళ్ల వయసుకి పెరిగింది. అంటే, 18 ఏళ్లు దాటిన స్త్రీ మీద, ఆమె అతనికి భార్య అయితే, ఆ భర్తకి ఆమె పైన అత్యాచారం చేసే హక్కు ఉందన్నమాట. చట్టప్రకారమే కాదు, ఇప్పటి కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రకారం కూడా. మన చట్టాల్లోనూ, మన అవగాహనలోను ఒక వైచిత్రి ఉంది. వివాహ వ్యవస్థ లోపల భర్త, భార్యను కొట్టినా ఆమెను మానసిక, శారీరక హింసకు గురి చేసినా అది ఒక నేరం అవుతుంది. అందుకు కోసం కొన్ని చట్టాలు ఉన్నాయి. కానీ, భర్త భార్యపై అత్యాచారం చేస్తే లైంగికంగా హింసిస్తే అది చట్టపరిధిలోకి రాదు. అది వివాహ సంబంధంలో భార్యా భర్తల మధ్య వుండే సున్నితమైన విషయాలు అట. దీని వెనుక ఉన్న అవగాహన ఏమిటి? అలా ఎందుకు విశ్లేషణలు చేస్తున్నారు అంటే, మన పితృస్వామిక క్షేత్ర బీజ న్యాయం ప్రకారం, స్త్రీ దేహం ఆమెది ఎంత మాత్రం కాదు.

కుటుంబ వ్యవస్థ లో పురుషుడికి సుఖాన్ని, అతడి ఆస్తికి వారసులను, కని ఇచ్చే పనికే స్త్రీలు ఉన్నారు. అందుకు అవసరం అయిన లైంగిక చర్యకు వాళ్ళు ఐచ్ఛికంగా ఒప్పుకోకపోతే, బలవంతంగా, హింసను ప్రయోగించి అయినా ఆ పని పురుషులు చేసి తీరవచ్చు. మహిళలపై అత్యధిక హింస ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరిగిన హత్యల్లో 38 నుంచి 50 శాతం హత్యలు వారి భాగస్వామ్య చేశారని లోన్స్ ట్ వారి అంచనా. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్‌ఒ) లాన్సెట్ అధ్యయనాలు నివేదికల ప్రకారం ఇంటిమేట్ పార్ట్నర్ వయోలెన్స్ (ఐపివి) 2018 నాటికి వివాహంలోనూ వివాహం లేకుండా కూడా సహజీవనం చేస్తునటువంటి మహిళల్లోనూ 15 సంవత్సరాల వయసు ఉన్న వారి దగ్గర నుంచి మొదలుకుంటే 26% వరకు ఉందని దక్షిణాసియా దేశాలలో ఇది 35 శాతంగా ఉందని ఆ ప్రాంతంలో ఉన్న భారత దేశంలో అత్యధికంగా కూడా ఉందని చెబుతుంది. భారతదేశంలో స్త్రీలపై జరుగుతున్న గృహహింస దాదాపు 33 నుంచి 41 శాతం మధ్య ఉంటుందని, ఆత్మహత్య చేసుకున్న గృహిణిల సంఖ్య ప్రపంచంలోని ఇతర మహిళల సంఖ్యతో పోల్చినప్పుడు రెట్టింపు శాతంగా ఉందని ఈ నివేదిక తెలుపుతున్నది.

ఇంతటి హింస మన పవిత్ర కుటుంబాలలో జరుగుతూ వుంటే దీన్నంతా సున్నితమైన కుటుంబ సంబంధాలుగా, కేంద్ర ప్రభుత్వం ఎలా చూడగలుగుతుందో మానవ మాత్రులకు అర్ధం కావడం కష్టం. ఇప్పటికే అనేక దేశాలు ఒప్పుకున్నా, భారతదేశంలో సహా 36 దేశాలు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ అల్జీరియా, బోస్వానా వంటి దేశాలు మారిటల్ రేప్ ని చట్ట పరిధిలోకి తీసుకురావనికి అంగీకరించటం లేదు. ఒక మహిళపై పరాయి పురుషుడు హింస చేస్తే, దాని గురించి మనం మాట్లాడడానికి జంకం. కానీ అదే హింస భర్త చేస్తే దాని గురించి ఆమె కుటుంబం గానీ, ఆమె గానీ, సమాజం గానీ ఎందుకు మాట్లాడదు? ఆర్థికంగా, ఎమోషనల్ గా స్త్రీలను పరాధీనులను చేసి, ఒక పురుషుడిపై ఆధారపడేలాంటి వ్యవస్థలను మనం సృష్టించి, అటువంటి కుటుంబ, వైవాహిక సంబంధాల్ని ఏర్పాటు చేసి, దాంట్లోకి ఆడవాళ్ళని నెట్టి అక్కడ జరిగే హింస గురించి వాళ్లు మాట్లాడకుండా ఉండాలనడం ఏమి ధర్మం? వాళ్లు జీవించడానికి ఏ వ్యవస్థలపై ఆధారపడవలసి వస్తున్నదో, అవే వాళ్ళని హింసించేవిగా తయారు కావడం దాన్ని, స్త్రీలు ప్రశ్నించకుండా ఉండాలి అనడం ఏ రకమైన మానవ హక్కులవుతాయి? అవి రాజ్యంగా ఉల్లంఘనలు కావా? వాళ్ళు ఈ దేశపు పౌరులు కారా అనే ఈ ప్రశ్నకి ఎవరి దగ్గర ఇప్పటి వరకూ సమాధానం లేదు. బలవంతపు సెక్స్‌కి నో చెప్పడం, ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక, రాజకీయ స్వేచ్ఛ స్త్రీలకి ఉండడం, కుటుంబ వ్యవస్థ లోపల ఉన్న అన్ని రకాల అసమానతలు పోవడం, ఇలాంటివి జరిగినప్పుడే పురుషాధిత్య సమాజంలో స్త్రీలు కొంచెమన్న ఆత్మగౌరవంతో జీవించగలుగుతారు.

బయట, ఇంట్లో ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా జరిగే లైంగిక చర్య ఖచ్చితంగా నేరమే అవుతందని, పెళ్లి స్త్రీని రేప్ చేయడానికి పురుషుడికి ఇస్తున్న లైసన్స్ కాదని ప్రతి ఒక్కరూ గుర్తించి తీరాలి. పురుషాధిపత్యం స్త్రీలపైనే కాదు పురుషుడిపై కూడా మోయలేని భారాన్ని మోపుతుందని, అతడిని అత్యంత క్రూరుడిగా, నియంతగా, అమానవీయమైన వాడిగా, హింసాత్మకంగా మారుస్తుంది అనే ఎరుక కలిగినప్పుడే, సమాజంలో మార్పుసాధ్యం. అందుకు పురుష ప్రధాన, అన్ని రకాల ఆధిపత్య, అప్రస్వామిక వ్యవస్థలు మారి తీరాలి. నాగరికులుగా చెప్పుకునే మనం, మధ్యయుగాల చీకటి పాలనను ఇప్పటికీ ఇంకా దాటలేకపోవడం విషాదం.

విమల

బహుముఖం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News