- నేనీ వేళ వచనమై పోవచ్చు వాచ్యమై తేలొచ్చు, మౌనమై మిగలడం కన్న మిన్న!
అవును నేను స్త్రీ వాదిని ఇరవయ్యో శతాబ్దపు సాహితీ సంద్రాన ఉప్పెనలా ఎగసి పడిన ఎనభై దశకపు మహిళను ప్రేమిస్తాను ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణులు కాదు మనిషి మనిషీ సగౌరవంగా మెలిగే సమాజ సౌందర్యాన్ని కళ్ళకు కట్టినందుకు
2. నడిచే స్వతంత్రమిచ్చామని అడుగులు
నీవే ననుకోకు చదివే స్వేచ్ఛ ఇచ్చామని జ్ఞానం ప్రదర్శించే అతి చేయకు ఉద్యోగం
చేసుకోమన్నామని నిర్ణయం నీదేననుకోకు
ప్రతీ రంగంలో చోటిచ్చామని అంతా నీవేననుకోకు ఆకాశంలో సగమనే భ్రమలు వీడు
అడుగున ఉన్న నేలే నువ్వంటూ
అడుగడుగునా తీర్పరులు కొలువు తీరిన
ఈ లోకుల న్యాయస్థానంలో ఇచ్చేదెవ్వరు
తీసుకోవడం ఏమిటని సమానత్వ వాదన వినిపించే ప్రతిసారీ బోనులో నిలబడ్డ ముద్దాయిలా అనివార్యంగా నేనొక ప్రమాణం చేసి తీరాలి నేను పురుష ద్వేషిని కాను
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
అని పాడి తీరాలి
3. కలువల్లాంటి కళ్ళు కాస్తా ప్రశ్నల కొడవళ్ళు నింపుకుంటే బదులుగా నను బందీ చేసేందుకు
నీ చేతుల్లో రెండు బేడీలు మాతృత్వం, పవిత్రత; సదా సిద్ధం లేదా కొత్త విశేషణాలతో
నను నిర్వచిస్తుంటావ్ బరులు తెగించిన
లకార ముకార పదాలు వరుస కడతాయి
చులకన చూపుల, ఛీత్కారాల, అవమానాల
అస్త్రాలతో వివస్త్రను చేసినంత పని చేసి నా ఇంటిని ఒంటిని కుటుంబాన్ని భవిష్యత్తుని
నడిరోడ్డు మీద పందేరేనికి పెడతావు
నిజమెంతో అబద్ధమెంతో లోకానికి అవసరం లేనిచోట పుకార్ల పునాదుల మీద ఆధిపత్యాలు చెలరేగే చోట అయితే గియితే ఆగిపోతాను
లేదా ఆత్మహత్య చేసుకుంటాను లేదంటే
నడుంబిగించి కడదాకా కదనస్ఫూర్తి నింపుకుంటూ నడుస్తుంటాను
4. పక్కపక్కనే నడుస్తున్నట్టుంటూ నిన్న కుడివైపు తుమ్మావు ఇవాళ ఎడమవైపు దగ్గుతున్నావేం అంటావ్ నా దిక్కేదో నువ్వే నిర్ధారిస్తావ్
నాకు ఎరుకలో ఉన్న సంగతులు
పలుకుతుంటా ఆయా సంగతులు
శృతి బద్ధంగా ఉన్నా అబ్బే ఏం బాలేదని
తేలిక చేస్తావ్ ఇంకో తెలియని రాగంలో బాణీ ఎందుకు కూర్చలేదంటావ్ వర్ణవర్ణములుగా వేలెత్తి చూపి గీతాలను కొట్టివేస్తావ్
నా కొంగుతో ఆకలిని వార్చుకుంటాను
అదే కొంగును కాల్చి నీ ఆకలి చూపుల ముఖంపై విసిరి కొడతాను
నేనొక భావజాలమై ప్రవహిస్తుంటే
పాయలు పాయలుగా చీల్చి ఉధృతిని నిలువరిస్తావ్ అలక్ష్యం నీ ఆయుధం
విలువ లేకుండా చేయడం నీ లక్ష్యం
5. నా ఒంటిని మెడను కాళ్ళను వేళ్ళను చుట్టుకున్న అలంకారాలతోనో నా నుదుటి కుంకుమ రంగులతోనో చివరికి నా ముఖకవళికలు నేను కూర్చున్న తీరు నిల్చున్న నడిచిన నవ్విన ఏడ్చిన తీరులతో నన్ను నా వ్యక్తిత్వాన్ని అంచనా కడుతుంటావ్ నీ విశ్లేషణలు విని ఆశ్చర్యపోవాలి ఒప్పుకుని తీరాలి నో ఆప్షన్ నీదైన సిద్ధాంతంలో నన్ను నన్నుగా ఆవిష్కరించుకోనివ్వని అనేక సూత్రాలు నాకు ఊపిరాడనివ్వని గదుల్లో ఎంతో ప్రయాసపడి
కిటికీలు తెరుచుకుంటాను ఇనుప బీగాలెన్నింటి తుప్పునో విదిలించి తలుపులు తెరుస్తుంటాను శీలం నీ జేబులోని ట్రంప్ కార్డ్ ఎప్పటికప్పుడు నా చుట్టూ అల్లబడ్డ అపనిందల అపోహల వలలను తెరపైకి తెస్తావు కొత్త భయాలను నిర్మించి ముందడుగు వేయనివ్వని రేఖల్ని గీయగల నీకు కొత్త లక్ష్మణ రూపాలెన్నో అగ్ని ప్రవేశం చేయలేని కాలం కదా నీ హద్దుల నిప్పుల కుంపట్లో భస్మం కాని సీతను నేను ఫీనిక్స్‌ను నీ కంటికి వుత్త గణికను గడ్డిపోచను
6. సరే అలాగే కానీయ్ ఒకే ఒక్క ప్రశ్న
పైన చెప్పిన అన్ని నేను- నువ్వుల్లో నేను! -నేనే!
నువ్వు!? -ఎవరు!?
ఫణిమాధవి కన్నోజు
- Advertisement -