Thursday, September 19, 2024

ఐదేళ్లలో కోటీశ్వర్లుగా కోటి మంది మహిళలు

- Advertisement -
- Advertisement -

మహిళా సాధికారితకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గత ప్రభుత్వాలు చేసిన దానికన్నా మరింత ఎక్కువగా మహిళలను ప్రోత్సహించి తద్వారా సాధికారిత కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు, ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయబోతోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5,000 గ్రామీణ సంఘాలు లేదా ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ది చేకూరే విధంగా కార్యాచరణ ఖరారు చేసింది. రాబోయే ఐదు సంవత్సరాల్లో 25,000 సంస్థలకు వీటిని విస్తరింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. దేశ వ్యాప్తంగా మహిళా శక్తి, సాధికారితకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక అడుగు ముందుకేసి మహిళా సాధికారితకు పెద్ద పీట వేస్తోంది. దీనిలో భాగంగా మహిళలను వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దే పథకాలకు రూపకల్పన చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మంది మహిళలను విజయవంతమైన వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ధ్యేయంతో ఇందిరా మహిళాశక్తి పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా ఎక్కువ మంది మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. ఈ పథకానికి అటు మహిళా స్వయం సహాయక సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలు సాధించిన ప్రగతే సమాజ ప్రగతికి కొలమానంగా భావించిన ప్రభుత్వం ఈ పథకం ద్వారా అర్హులైన వారికి రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలోనూ ముఖ్యమంత్రి ఈ విషయంలో పలు కీలక సూచనలు చేశారు. అలాగే శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సైతం ఇందిరా మహిళా శక్తి పథకం విస్తరణ, మహిళా సాధికారిత గురించి ఆర్థిక మంత్రి స్పష్టత ఇచ్చారు. తెలంగాణా ప్రభుత్వం స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సాధికారితకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్నరంగాల్లో వృతి ్తనైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్‌లో మెలకువలు పెంపొందించేవిధంగా సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా, రుణబీమా పథకాన్ని ఈ సంవత్సరం మార్చి నెలలోనే ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద సభ్యురాలు మరణించినపుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేసేందుకు ఇప్పటికే విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిని అమలు చేసేందుకు రూ.50.41 కోట్ల నిధులను ఇటీవల ప్రభుత్వం కేటాయించింది.

స్వయం సహాయక సంఘాలకు ఊతం
ఒకప్పుడు దేశంలో అగ్రగామిగా నిలచిన మహిళా స్వయం సహాయక సంఘాలు కొన్నేళ్లుగా ప్రభుత్వ అలసత్వం, నిధుల కొరత కారణంగా కుంటుపడ్డాయి. పేద, మధ్యతరగతి మహిళాభ్యున్నతికి ఆర్థిక స్వాలంబనకు సహాయ సంఘాలు ఎంతో ఊతమిచ్చాయి. ఈ సంఘాల ద్వారా గతంలో చేపట్టిన కార్యకలాపాలు ఎంతో ప్రయోజనంగా నిలిచి మహిళల ఆర్థిక స్తోమతను పెంచింది. కాగా రాష్ట్రంలో వీటి పునరుద్ధరణకు ప్రతి సంవత్సరానికి కనీసం రూ.20 వేల కోట్లకు తగ్గకుండా, వచ్చే ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించేందుకు బ్యాంకర్లకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. ఈ దిశగా బ్యాంకులు కూడా మహిళా సంఘాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ఈ నిధులు మైక్రో, స్మాల్ ఇండిస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాయపడి మహిళలు పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదిగేందుకు అవకాశం కల్పిస్తాయని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

ఇందిరా జీవిత బీమా పథకం
ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ.10 లక్షల జీవిత బీమా కింది పరిహారం అందజేస్తుంది. స్కూల్ యూనిఫాంలను కుట్టే పనిని స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు అప్పజెప్పాలని పాఠశాల విద్యా శాఖను, సంక్షేమ శాఖను, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. స్కూల్ యూనిఫాంల కుట్టు చార్జీలను జతకు రూ.50 నుండి 75 రూపాయలకు ప్రభుత్వం పెంచింది.

ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని 29,680 మహిళా సభ్యులకు సుమారు రూ.50 కోట్ల లబ్ది చేకూరుతుందని అంచనా. స్వయం సహాయక బృందాలలోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి గాను మాదాపూర్‌లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్‌ను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు 3.20 ఎకరాల భూమిలో గల 106 దుకాణాలతో కూడిన నైట్ బజారు కాంప్లెక్స్ ను ప్రభుత్వం అప్పగించింది. ఈ పథకాలన్నీ కూడా మహిళలను బలోపేతం చేస్తూ రానున్న ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక లక్షంగా చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News