Wednesday, January 22, 2025

సమాజంలో మహిళలకు భద్రత మరింత అవసరం

- Advertisement -
- Advertisement -

త్వరలో 18 గృహహింస సెంటర్‌లు ప్రారంభం
అదనంగా 9,424 సైబర్ అంబాసిడర్‌లను నియమించుకుంటున్నాం
ఈవ్‌టీజర్‌ల భరతం పట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్ సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి
ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లను మరింత విస్తరిస్తున్నాం
మహిళా అదనపు భద్రతా విభాగం అదనపు డిజిపిగా శిఖాగోయల్

సమాజంలో మహిళలకు భద్రత మరింత అవసరం. ఆడపిల్లల రక్షణకు పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. సిఎం కెసిఆర్ ఇస్తున్న ప్రోత్సాహాంతో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లను మరింత విస్తరించడంతో పాటు షీ టీమ్స్ సిబ్బంది మహిళలకు అండగా నిలబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఈవ్‌టీజింగ్, అత్యాచారాల బారిన పడకుండా పోలీస్ శాఖ ఎనలేని కృషి చేస్తోంది. ఈవ్‌టీజర్‌ల భరతం పట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్ సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. ఒంటరి మహిళలు, మైనర్ బాలికలు, మహిళలు అత్యాచారానికి గురైతే వెంటనే వారికి తగిన రక్షణ కల్పించి నిందితులకు శిక్ష పడేలా భరోసా సెంటర్‌లు తమవంతు పాత్రను పోషిస్తున్నాయి.

పెళ్లైన మహిళలు గృహహింసకు గురైనప్పుడు వారికి నిపుణులై కౌన్సిలర్‌లతో కౌన్సెలింగ్ ఇప్పించి వారి సంసార జీవితం సాఫీగా సాగేలా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారు. మహిళా అదనపు భద్రతా విభాగం అదనపు డిజిపిగా శిఖాగోయల్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహిళల భద్రత కోసం అనేక సంస్కరణలను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈవ్‌టీజర్స్‌ను గుర్తించడం, మహిళలను ఇబ్బంది పెట్టే వారిపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు మహిళల రక్షణ కోసం మరిన్ని భద్రతా చర్యలను ఆమె చేపడుతున్నారు. త్వరలో 18 గృహహింస సెంటర్‌లు, అదనంగా 9,424 సైబర్ అంబాసిడర్‌లను నియమించి మహిళా భద్రతా విభాగాన్ని పటిష్టం చేయాలని ఆమె సంకల్పించారు. ఎన్‌ఆర్‌ఐ నిందితులకు శిక్షలు పడడానికి (నిలా) నెట్‌వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగల్ యాక్టివిటీస్ సంస్థతో సమన్వయం చేసుకుంటూ విదేశాల్లో బాధితులకు అవసరమైన సహకారం అందేలా ఆమె చర్యలు చేపడుతున్నారు. రానున్న రోజుల్లో మహిళల భద్రతకు సంబంధించిన పోలీసు శాఖ చేపట్టే పలు అంశాల గురించి ఆమె ‘మనతెలంగాణ’తో పలు విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఆమె వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే….

ఇప్పటివరకు ఎన్ని షీటీమ్స్ కేసులు బుక్ అయ్యాయి ?

అక్టోబర్ 2014 నుంచి ఏప్రిల్ 2023 వరకు మొత్తం 14,951 కేసులు నమోదయ్యాయి. అందులో ఎఫ్‌ఆర్‌ఐ అయినవి 4872, పెట్టీ కేసులు 10,079 కేసులు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని షీ టీంలు పనిచేస్తున్నాయి ?
మొత్తం 331 టీంలు పనిచేస్తున్నాయి.బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు పాల్పడే వారిని పట్టుకునేందుకు హాట్‌స్పాట్ ఆపరేషన్లు చేపడుతున్నాం.

ఇప్పటివరకు షీటీమ్స్ వల్ల ఆడపిల్లలకు వేధింపులు తగ్గాయా ?

పబ్లిక్ ప్రదేశాల్లో చాలావరకు ఆడపిల్లలకు వేధింపులు తగ్గాయి. మహిళలను వేధించే వారిలో 18 నుంచి 28 సంవత్సరాల లోపు వారే ఎక్కువ. 18 ఏళ్ల లోపు వారిలో 7 శాతం మంది నేర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
ఇంకా ఎలాంటి మార్పులు రావాలని మీరు భావిస్తున్నారు ?
రాష్ట్రంలో షీ టీమ్‌ల సంఖ్యను పెంచాలని మహిళా భద్రతా విభాగం యోచిస్తోంది. ప్రతి పాఠశాల నుంచి 4 మంది విద్యార్థులను, ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారి ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించాం. వారికి షీ టీమ్‌ల మద్ధతుతో పాటు స్థానిక పోలీసులు మద్ధతు ఇస్తారు. ఎంపిక చేసిన వారికి శిక్షణ అందిస్తాం. 2021, 22లో 1650 పాఠశాలల నుంచి 3300 మంది సైబర్ అంబాసిడర్‌లను ఎంపిక చేసుకున్నాం.

భరోసా సెంటర్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారా?

ప్రస్తుతం హైదరాబాద్, వికారాబాద్, వరంగల్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్- మల్కాజిగిరి, మెదక్, గద్వాల్, మహబూబాబాద్, ఖమ్మం, సిద్దిపేటలో మొత్తంగా ప్రస్తుతం 12 భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయి. అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో మరో 23 భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
దీనికి ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది ?
ప్రభుత్వం రూ.15.54 కోట్ల నిధులను మంజూరు చేసింది. మొత్తం 35 భరోసా సెంటర్‌ల ఖర్చుల నిమిత్తం ఈ నిధులను ప్రభుత్వం కేటాయించింది.

ఫోక్సో కేసులకు సంబంధించి ఎంతమంది నిందితులకు శిక్ష పడింది ? త్వరితగతిన వారికి శిక్షలు పడడానికి మీరు అవలంభించే విధానాలు ఏమిటీ ?

భరోసా కేంద్రాలు, మహిళా భద్రతా విభాగం పర్యవేక్షించిన 59 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. మహిళా భద్రత కోసం అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, కేసుల తీవ్రత ఆధారంగా కేసులను ఎంపిక చేసి, అవి త్వరతిగతిన పరిష్కారమయ్యే వరకు మొత్తం దర్యాప్తు ప్రక్రియను పర్యవేక్షిస్తాం.

బాధితులకు మీరు ఎలాంటి ఉపాధి, భరోసాను కల్పిస్తున్నారు ?

లైంగిక నేరాలకు గురైన బాధితులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాలలో శిక్షణ ఇప్పిస్తున్నాం. వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతో పాటు వారి సామర్థ్యాలకు అనుగుణంగా వారికి ఉపాధి, ఉద్యోగాలను కల్పిస్తున్నాం.

ఇప్పటివరకు బాధితుల కోసం ఎంత ఖర్చు చేశారు ?

ఇప్పటివరకు బాధితులకు పరిహారంగా రూ.3,10,67,500 అందించాం.
కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటుచేస్తారా ? ప్రస్తుతం ఎక్కడైనా ఏర్పాటు చేశారా ?
‘సేఫ్ సిటీ ప్రాజెక్ట్’ ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. లింగ ఆధారిత హింస లేదా వేధింపులు, బెదిరింపులు లేకుండా చూడడం. దీంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, బాలికలకు సురక్షితమైన సాధికారతను కల్పించే వాతావరణాన్ని సృష్టించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్భయ నిధుల కింద మొత్తం 27 సిడిఈడబ్లూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలు ట్రై కమిషనరేట్లలో ఉన్నాయి. వీటిలో 17 కేంద్రాల్లో సివిల్, ఇంటీరియర్ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ప్రస్తుతం ప్రతి కేంద్రానికి ఒక కౌన్సెలర్, ఒక రిసెపనిస్ట్ శిక్షణ పొందుతున్నారు. త్వరలోనే ఈ కేంద్రాలు ప్రారంభమవుతాయి.
ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ (13) కేంద్రాలు ఉన్నాయి. అందులో 1.మీర్‌చౌక్ పిఎస్, 2. బేగంపేట, 3. గోల్కొండ, 4. పంజాగుట్ట , 5. బేగంబజార్, 6. మాదన్నపేట్, 7. బోయిన్‌పల్లి, 8. పాత సంతోష్ నగర్, 9. పాత ఛత్రినాక, 10. సైదాబాద్, 11. అంబర్‌పేట్, 12. నాంపల్లి, 13. తుకారాంగేట్ పిఎస్‌లలో ఉన్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 07) కేంద్రాలు ఉన్నాయి. అందులో 1. అల్వాల్ పిఎస్, 2. ఆర్‌సి పురం, పేట్ బషీర్‌బాగ్, 4. మొయినాబాద్, 5. జీడిమెట్ల, 6. రాజేంద్రనగర్, శంషాబాద్‌లలో కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు రాచకొండ కమిషనరేట్‌లోని 07 కేంద్రాలు మహిళలకు అందుబాటులో ఉన్నాయి. అందులో 1. పహాడీషరీఫ్ పిఎస్, 2. కుషాయిగూడ, 3. ఉప్పల్, 4.భువనగిరి, 5. ఘట్‌కేసర్, 6. మీర్‌పేట్, 7. ఎల్‌బి నగర్‌లు ఉన్నాయి.

రానున్నరోజుల్లో డివి కేసులను పోలీస్ స్టేషన్లలో నమోదు చేస్తారా లేదా ?

ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లలో గృహ హింస (డివి) కేసులు నమోదవుతున్నాయి. నిర్దిష్ట మహిళా పోలీసుస్టేషన్లు (ఉమెన్ పోలీస్ స్టేషన్‌లు) అందుబాటులో ఉన్న కొన్ని స్టేషన్‌లలో కౌన్సెలింగ్ అందించడంతో పాటు దానికి సంబంధించి సమగ్రంగా దర్యాప్తు చేయడంలో భాగంగా కేసులను నమోదు చేస్తున్నారు.

గృహహింస కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి, వాటిపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ?

రోజువారీ వార్తాపత్రికల్లో విస్తృత ప్రచురణలు ఇవ్వడంతో పాటు సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను వినియోగించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని యూనిట్లలో సఖీ కేంద్రాలు, భరోసా కేంద్రాలు, మహిళా పోలీస్‌స్టేషన్ల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత కొన్ని కేసుల్లో భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడంతో పాటు వారు ఆనందంగా ఉంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News