న్యూఢిల్లీ : స్థానిక ద్వారకా ప్రాంతంలో బుధవారం ఓ మహిళ పైలట్, ఆమె భర్తపై మూకదాడి జరిగింది. తన ఇంట్లో ముక్కుపచ్చలారని పదేండ్ల బాలికను పనికి పెట్టుకుని , ఈ మహిళా పైలట్ బాలికను ఏదో ఒక నెపంతో భర్తతో కలిసి తీవ్రంగా హింసించింది. గాయపడేలా కొట్టారు. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, స్థానికులు ఆవేశం పట్టలేక వీరిద్దరిని ఇంటిలోనుంచి బయటకు లాగి, పట్టుకుని రోడ్డుపై చితకబాదారు. 33 ఏండ్ల పూర్ణిమ బాగ్చి ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో పైలట్‌గా ఉన్నారు. భర్త కౌశిక్ బాగ్చి (36) మరో వైమానిక సంస్థలో ఉద్యోగంలో ఉన్నారు. రెండు మూడు నెలల క్రితం వీరు బాలికను ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. బాగా కొట్టడంతో చిన్నారికి తీవ్రగాయాలు అయిన విషయాన్ని బంధువులు గుర్తించారు. ఇదేమిటని నిలదీసిన వారిని కూడా ఈ దంపతులు కొట్టారు.దీనితో మహిళా పైలట్ విధులు నిర్వర్తించుకుని వస్తుండగా స్థానికులు , బాలిక బంధువులు గుర్తించి పట్టుకుని కొట్టారు.
అడ్డొచ్చిన భర్తను కూడా చితకబాదారు. యూనిఫాంలో ఉన్న మహిళా పైలట్‌ను జుట్టుపట్టుకుని గుంపు లాగడం, అడ్డొచ్చిన భర్తను తీవ్రంగా కొట్టడం సెల్‌ఫోన్ల ద్వారా వైరల్ అయింది. క్షమించండి తప్పయింది అని ఈ మహిళా పైలట్ వేడుకోవడం, ఈ లోగా ఓ వృద్ధుడు కలుగచేసుకుని గుంపును వారించారు. ఇంకా కొడితే చనిపోతుందని వదిలేయాలని ఆమె భర్త కోరారు. దీనితో మూక శాంతించింది. తరువాత అక్కడికి ద్వారకా ప్రాంత డిసిపి ఎం హర్షవర్థన్ ఘటన వివరాలు తెలిపారు. చిన్నారి కంటికి గాయాలు అయినట్లు గుర్తించారు. శరీరంపై కాల్చిన గుర్తులు ఉన్నాయి. మైనర్‌ను పనిలో పెట్టుకుని , హింసించినందుకు ఐపిసి పరిధిలో 324, 342, 370 సెక్షన్ల మేరకు కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధిత చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఏమీ రాలేదు. కాగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు డిసిపి చెప్పారు.
చిన్నారిపై ఇంతటి అమానుషమా
ఢిల్లీ మహళా కమిషన్ చీఫ్ స్వాతి
బాలికను పనిలో పెట్టుకోవడం, క్రూరంగా హింసించడం దారుణం అని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలీవాల్ స్పందించారు. ఇటువంటి నిర్దయగల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. మరోమారు చిన్నారులపై ఇటువంటి అమానుషాలు జరగకుండా చూడాల్సి ఉందన్నారు.