హైదరాబాద్ : సోషల్ మీడియాలో తమని వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాదాపూర్ డిసిపి ఆఫీస్ ఎదుట ముగ్గురు మహిళలు సోమవారం నిరసనకు దిగారు. బాచుపల్లికి చెందిన మమత, ప్రసున్న చౌదరి, రాకేష్ మాస్టర్ బంధువు లక్ష్మి. ముగ్గరు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నారు. తామ ఫొటోలను సేకరించి సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి పెడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై బాచుపల్లి పోలీసులకు డిసెంబర్ 29న ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మాదాపూర్ డిసిపి శిల్పవల్లిని కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి పురోగతి లేదని అన్నారు. రాకేష్ మాస్టర్ బంధువు లక్ష్మి మాట్లాడుతూ తను మూడు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నానని,వాటికి మంచి రేటింగ్ రావడంతో కొంతమంది గ్రూపుగా ఏర్పడి ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో నార్సింగి ఫోలీసులకు రెండు సార్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు వెళ్తే మాదాపూర్ డిసిపి ఆఫీస్‌కు పంపించారని, ఇక్కడ ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు నిందితులపై కేసు నమోదు చేయలేదని తెలిపారు. తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గ్రూపుగా ఏర్పడి తమ వీడియోలపై అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారని తెలిపారు. కొందరు వీడియోల కామెంట్లలో చంపివేస్తామని హెచ్చరిస్తున్నారని తెలిపారు. ముగ్గురు మహిళలు ధర్నా చేయడంతో పోలీసులు వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు.