Monday, December 23, 2024

రాజ్యసభలో మహిళా బిల్లు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్ధేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ఎగువ సభ రాజ్యసభలో గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒక్కరోజు క్రితం బుధవారం ఈ బిల్లు చారిత్రక రీతిలో లోక్‌సభలో ఆమోదం పొందింది. చట్టసభలలో మూడింట ఒక వంతు మహిళా కోటా సంబంధిత బిల్లు దేశంలోని మహిళల సాధికారత దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పరంపరలో భాగం అని బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతూ న్యాయశాఖ మంత్రి తెలిపారు. 128వ రాజ్యాంగ సవరణ బిల్లును సభ ముందుకు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దశలో న్యాయమంత్రి మోడీ నాయకత్వపు కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా పలు కోణాలలో మహిళ అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చిందని, చట్టసభలలో సముచిత స్థానం ఈ దిశలో శిఖరాయమానం అవుతుందని వివరించారు. ఈ దశలో ఆయన జన్‌ధన్ జీరో ఖాతాల ప్రారంభం, లక్షలాది మరుగుదొడ్ల నిర్మాణంతో స్వచ్ఛభారత్, మహిళల ఆత్మగౌరవ దిశలో పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ప్రధాన మంత్రి ముద్రయోజన (పిఎంఎంవై) పరిధిలో లబ్థిదారులలో 68 శాతం వరకూ మహిళలే ఉన్నారని లెక్కలు చెప్పారు. లోక్‌సభ , రాష్ట్రాల విధానసభలలో మహిళలకు 33 శాతం కోటా కల్పన బహుముఖమైనదని ఇందులోనే ఎస్‌సి/ ఎస్‌టి కేటగిరి కూడా ఉంటుందని వివరించారు. అంతకు ముందు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ మాట్లాడుతూ సాధారణంగా ఏదైనా బిల్లు తేవడానికి రెండు రోజుల ముందస్తు నోటీసు అవసరం ఉంటుందన్నారు. అయితే లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన మరుసటిరోజే రాజ్యసభలోనూ ఇది ఆమోదం పొందేందుకు వీలుగా ఈ రెండు రోజుల నోటీసు నిబంధననుతాను ఎత్తివేసినట్లు వివరించారు. బిల్లుపై ఏడు గంటల సమయం కేటాయించినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజన విరామాన్ని ఎత్తివేసినట్లు ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ల వాటా ఎగువ సభకు వర్తించదు. అదే విధంగా రాష్ట్రాల విధాన మండళ్లకు కూడా ఈ నిబంధన కుదరదు. పార్టీలకు అతీతంగా రాజ్యసభలో గురువారం చర్చ సందర్భంగా దాదాపు సార్వత్రికంగా మహిళా బిల్లుకు మద్దతు వ్యక్తం అయింది.

మహిళకు 33 శాతం కోటా ఉండాల్సిందేనని ఎగువసభలో వివిధ పార్టీల సభ్యులు స్పష్టం చేశారు. అయితే ఇన్ని నాళ్ల తరువాత కేంద్రం ఇప్పుడు ఆదరబాదరాగా ఈ బిల్లును తీసుకువచ్చిందని, ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కు, జంతర్‌మంతర్ అని కొన్ని విపక్షాలు విమర్శించాయి. బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, అయితే ఓటుకు మహిళల సీట్లకు లింక్‌లు పెట్టడం అనుచితం అని విమర్శించారు. బిల్లు తేవడం సరే, అమలు ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని సభ్యులు స్పష్టం చేశారు. ఎదరుచూపుల దశలు దాటాయి. పలు ప్రక్రియల సంగతి పక్కకు పెట్టి వెంటనే బిల్లు అమలులోకి తీసుకురావల్సి ఉందని , అప్పుడే మహిళకు న్యాయం జరుగుతుందని తెలిపారు. సిపిఎంకు చెందిన ఎలమరం కరీం స్పందిస్తూ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఉందన్నారు. బిజెపి ఈ బిల్లును 2014లో, తరువాత 2019లోనే ఈ బిల్లును ఎన్నికల మాటగా చెప్పిందని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని ఇప్పటికీ ఈ బిల్లు తెచ్చారని, ఈ విధంగా బిల్లు కార్యరూపంలోకి రాకుండా తొమ్మిదేళ్లు కాలాయాపన చేసిన పార్టీ బిజెపినే అని విమర్శించారు. కొన్ని రాష్ట్రాలలో , ఢిల్లీ స్థానిక ఎన్నికలలో అపజయంతో చేపట్టిన ఎన్నికల స్టంటు అని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి మహిళల గురించి పట్టించుకునే తీరిక లేదన్నారు.

2011 జనాభాలెక్కలనే లెక్కలోకి తీసుకోండి
బిఆర్‌ఎస్ సీనియర్ నేత కె కేశవరావు
మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ల కోటాను తమ పార్టీ స్వాగతిస్తుందని బిఆర్‌ఎస్ ఎంపి, సీనియర్ నేత కె కేశవరావు తెలిపారు. చర్చలో ఆయన పాల్గొంటూ లోసుగుల లేకుండా చేస్తేనే బిల్లుకు సార్థకత ఏర్పడుతుందన్నారు. బిల్లు వాస్తవికతను దాల్చి, చట్టం రూపంలోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని చెప్పారు. డిలిమిటేషన్, జనాభా లెక్కల పేరిట కోటా అమలును జాప్యం చేయరాదని డిమాండ్ చేశారు. బిల్లులో మహిళా బిసిల ఉపకోటా ఉండాలనేది తాము మొదటి నుంచి చెపుతున్నామని వివరించారు. ఎప్పుడో ప్రక్రియలు పూర్తి చేసి మహిళా కోటాను తీసుకురావడం వల్ల ఆలస్యం మరింత ఆలస్యం అవుతుందని చెప్పారు.

2011 సెన్సస్‌ను కొలమానంగా తీసుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. దీని వల్ల తిరిగి నిర్ణీత జనాభాగణన వరకూ వేచి ఉండాల్సిన పని ఉండదన్నారు. లోపాలను తరువాత సవరించుకోవచ్చునని , ముందు కోటా ఫలాలు మహిళలకు అందాల్సి ఉందన్నారు. సత్వరమే సంబంధిత డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కావల్సి ఉందని, ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల త్వరితగతిన అడ్డంకులు తొలిగిపోతాయని చెప్పారు. ఎండిఎంకెకు చెందిన వైగో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బిల్లు తెచ్చారని జెడియు ఎంపి రామ్‌నాథ్ ఠాకూర్ విమర్శించారు. దీనిపై బిజెపికి చెందిన సరోజ్ పాండే స్పందిస్తూ దేశం అమృత్‌కాల్ దశలో ఉందని, మహిళల శుభానికి ఇదే మంచి అదును అని, బిల్లు తీసుకువచ్చిన ఘనత బిజెపిదే అని తెలిపారు.

ఈ బిల్లును తాను తెచ్చిన వేళ జ్ఞాపకాలలో దేవెగౌడ
జెడిఎస్ నేత హెచ్‌డి దేవెగౌడ స్పందిస్తూ తాను ప్రధానిగా ఉన్నప్పుడు తొలుత ఈ బిల్లును తీసుకువచ్చిన విషయాన్ని అప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.మహిళా బిల్లు తన చిరకాలపు కల అని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్ననాటి నుంచి దీనిపై స్పందిస్తూ వచ్చానని, యునైటెడ్ ఫ్రంట్ హయాంలో తాను ప్రధానిగా ఉన్నప్పుడు దీనిపై కసరత్తు చేసి బిల్లును సభలోకి వచ్చేలా చేశానని అప్పటి విషయాలను సభలో గర్తు చేసుకున్నారు. ఒబిసిలకు కూడా బిల్లు వర్తింపచేసేందుకు వీలుగా దీనిని సెలెక్ట్ కమిటీకి పంపించాలని ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి స్పందిస్తూ మహిళా కోటా రాజ్యసభ , రాష్ట్రాల కౌన్సిళ్లకు కూడా వర్తించాలని కోరారు. వెంటనే కోటా అందుబాటులోకి వస్తేనే న్యాయం దక్కుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కెసి వేణుగోపాల్ సూచించారు. ఒబిసి మహిళకు సబ్ కోటా ఉండాల్సిందే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News