నాటకీయ పరిణామాల మధ్య నరేంద్ర మోడీ సర్కార్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చట్టసభల్లో 33% మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. అది చట్టం కావటం లాంఛనమే. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే దాని అమలుకు బాటపడుతుంది. ఏ అసెంబ్లీ, లోక్‌సభ సెగ్మెంట్లలోని ఓటర్లలో పురుషులు ఎందరు, మహిళలు ఎందరు అనే వివరాలు ఇప్పటికే ఉన్నాయి గనుక కొందరు ఆ స్థానాలను ఉటంకిస్తూ అవన్నీ మహిళలకు రిజర్వు చేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అసలు ఈ రిజర్వేషన్లు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే 2029 నాటికి అని, మరి కొందరు 2034 లేదా ఆ తరువాతే అని భాష్యం చెబుతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఏ రాష్ర్టంలో ఎన్నిసీట్లు పెరిగేదీ, ఎక్కడ ఎన్ని సీట్లు తగ్గేది కూడా కొన్ని అంకెలను కూడా ఉటంకిస్తున్నారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం రిజర్వేషన్లు 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. షెడ్యూల్డ్ కులాలు, తరగతులకు నిర్దేశించిన సీట్లలో కూడా మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. వెనుబడిన తరగతుల మహిళకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఆమోదించిన బిల్లు చట్టమై ఎప్పటికి అమల్లోకి వస్తుంది, అసలు ఏం జరగబోతోంది?
రాజ్యసభలో 2010లోనే ఆమోదం పొందిన రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందితే సరిపోతుంది. యుపిఎ ఏలుబడిలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీల వ్యతిరేకత లేదా అభ్యంతరాల కారణంగా అది లోక్‌సభలోకి రాలేదు. తమకు పూర్తి మెజారిటీ వస్తే దాన్ని తక్షణమే ఆమోదిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. 2014లో, 2019 లో అవసరమైన మెజారిటీ, సగాని కంటే ఎక్కువ రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలే ఉన్నందున ఆ బిల్లు ఆమోదానికి ఆటంకం లేదు, అయినప్పటికీ తొమ్మిదేండ్లుగా దాని ప్రస్తావన, అసలు చొరవే చూపలేదు. నిజానికి అధికారానికి వచ్చిన వెంటనే ఆమోదం పొంది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లలోనే మహిళల కోటా అమలు జరిపేందుకు పునర్విభజనతో నిమిత్తం లేకుండా అవసరమైన రాజ్యాంగ సవరణ చేసి ఉంటే అమల్లోకి వచ్చి ఉండేది. చిత్తశుద్ధి ముఖ్యం, అది లేదు కనుకనే విమర్శలు. కారణాలు, ఉద్దేశాలు ఏమైనప్పటికీ ముందు రోజు కాబినెట్‌లో ఆమోదించి మరుసటి రోజు లోక్‌సభలో, తరువాత రాజ్యసభలో ఆమోదానికి పెట్టారు. లోక్‌సభలో ఇద్దరున్న మజ్లిస్ మినహా మిగిలిన పార్టీలేవీ వ్యతిరేకంగా ఓటు వేయలేదు, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఈ పరిణామాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో, జనానికి ఏం చెబుతుందో, ఓటర్లు ఎలా స్వీకరిస్తారో చూద్దాం.
ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? పదేండ్లకు ఒకసారి జరిగే జన గణన తరువాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నది స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన నిర్ణయం. దీన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేసే కమిషన్‌కు ఒక విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఉంటారు. దాని నిర్ణయాన్ని ఆమోదించడం తప్ప ఏ కోర్టులోనూ సవాలు చేసే అవకాశం లేదు. ఆ మేరకు 1952, 1963, 1973లో జరిగాయి. 1973 తరువాత పాతికేండ్ల పాటు ఆ ప్రక్రియను స్తంభింప చేస్తూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేశారు. ఆ మేరకు 2002లో మరో పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తరువాత మరో పాతికేండ్ల పాటు 2026 వరకు అదే సంఖ్యను కొనసాగించాలని కూడా నిర్ణయించారు.తొలి లోక్‌సభలో 494 నియోజకవర్గాలుండగా, తరువాత పది సంవత్సరాలకు 522కు పెంచారు. మరో పది సంవత్సరాల తరువాత 542కు పెంచారు. ఆ ప్రక్రియ తరువాత సిక్కిం మన దేశంలో విలీనం కావటంతో మరొక స్థానాన్ని దానికి కేటాయించటంతో 543 అయ్యా యి. వీటిలో 13 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి 2026 వరకు ఆ సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు.
మధ్యలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలలో కొన్ని ప్రాంతాలూ, అసెంబ్లీ సెగ్మెంట్లు అటూ ఇటూ అయ్యాయి. కొన్ని నియోజవర్గాలు రద్దు, కొన్ని కొత్తవి వచ్చాయి.తెలంగాణలో జనాభా పెరగటంతో ఆంధ్రప్రాంతంలో సీట్లు తగ్గాయి.ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తరువాత ఎక్కడ ఉన్న సీట్లు అక్కడే ఉన్నాయి.రాష్ర్ట పునర్విభజన చట్టంలో తెలంగాణ సీట్లను 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్‌లో 175ను 225కు పెంచుతామని వాగ్దానం చేసినందున 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియలో భాగంగా అవి అమల్లోకి వస్తాయి.2021లో జరగాల్సిన జనగణన వాయిదాపడింది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. గడువు ప్రకారం వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి వుంది. అందువలన జనగణన జరుగుతుందా, మరుసటి ఏడాదికి వాయిదా పడుతుందా అన్నది ప్రస్తుతానికి ఊహాగానమే. 2026 లోపు జనగణన జరుగుతుందనే భావనతో తరువాత జరిగే పునర్విభజన ప్రకారం 2029 లోక్‌సభ ఎన్నికలు, గడువు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33% కేటాయించాల్సి ఉంటుందని అందువలన2029లో అమలు జరుగుతాయని కొందరు భాష్యం చెబుతున్నారు.
ఇక పార్లమెంటు ఆమోదించిన 84 వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియకు ఆతరువాత జరిగే అంటే 2031లో జరిగే జనగణన ప్రాతిపదికన జరగాల్సి ఉంటుంది. 2021లో జరగాల్సిన జనగణన 2024 లేదా 2025లో జరిగితే పదేండ్లు గడవకుండానే మరో గణన 2031 లో జరుపుతారా లేక పదేండ్లు అంటే 2034 లేదా 2035లో జరుపుతారా అన్నది తెలియదు. ఒకవేళ అదే జరిగితే ఆ తరువాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అందుకే కపిల్ సిబల్ వంటి న్యాయ కోవిదులు 2034కు ముందు అమల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. రెండవది పునర్విభజన ప్రక్రియకు నిర్ణీత కాలవ్యవధి లేదు. అనేక రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధానాలను సక్రమంగా అమలు జరపకపోవటం, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లను కేటాయిస్తున్నందున ఎక్కువ సీట్లు పొందేందుకు జనాభా అదుపును పట్టించుకోవటం లేదనే అభిప్రాయం ఉంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా 1976లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాలలో ఎలాంటి మార్పులు చేయకూడని నిబంధనను సవరించారు.
తరువాత జనాభా స్థిరీకరణ అవుతుందనే అంచనాతో మరోసారి 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా నిర్ణయించారు. 2002లో ఏర్పాటు చేసిన కమిషన్ 1991 జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్ధీకరణ చేపట్టాలని నిర్ణయించారు. కమిషన్ పని చేపట్టిన తరువాత 2003లో 87వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 జనాభా ప్రాతిపదికను నిర్ణయించటంతో తిరిగి నూతన ప్రక్రియను చేపట్టాల్సి వచ్చింది, 2008 వరకు పూర్తి కాలేదు. జమ్మూకశ్మీర్‌లో జనగణన జరగలేదు గనుక దీన్నుంచి మినహాయించారు, అసోం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ జనాభా లెక్కల్లో తేడాలు ఉన్నందున కోర్టు వివాదాల కారణంగా అక్కడ జరగలేదు. 2009 సాధారణ ఎన్నికల నాటికి 543కు గాను 499 చోట్ల పునర్వ్యస్థీకరణ జరిగింది. పన్ను ఆదాయ పంపిణీకి 15వ ఆర్థిక సంఘం ఎంచుకున్న జనాభా ప్రాతిపదికతో ఎక్కువ మొత్తాలను జమ చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు తక్కువ మొత్తాలను పొందుతూ వివక్షకు గురవుతున్నాయి.అంతకు ముందు 1971 జనాభా ప్రాతికగా ఉన్న కేటాయింపులను 2011కు మార్చడంతో పెద్ద తేడా వచ్చింది.
దేశ జనాభాలో 18% ఉన్న రాష్ట్రాలు జిడిపిలో 35% సమకూర్చుతున్నాయి. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేవారు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉండాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి.కానీ 2003లో చేసిన సవరణతో ఎవరు ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చు. అలాంటి వారు ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారా ? అక్కడి సమస్యలను పట్టించుకుంటారా? వచ్చే పునర్విభజనలో పాత జనాభా పద్ధతినే ఆమోదిస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గటం ఖాయం.పాత విధానాన్ని అనుసరిస్తే పునర్యవస్థీకరణ తరువాత ఇప్పుడున్న 543 సీట్లు (ఇద్దరు ఆంగ్లో ఇండియన్‌ల నామినేషన్ రద్దు చేశారు గనుక 541 ఉంటాయి) 848కి పెరుగుతాయని కొందరి జోస్యం. మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ సూచించినట్లుగా గతంలో నిర్ణయించిన దాని కంటే జనాభా రెట్టింపైనందున సీట్ల పెరుగుదల వెయ్యి ఉండవచ్చనేది ఒక వాదన. మరో అంచనా ప్రకారం 753 ఉంటాయి. తదుపరి పునర్యవస్థీకరణ సంవత్సరాన్ని ముందే ఖరారు చేసినందున ఏ ప్రాతిపదికన జరిగేదీ కమిషన్ నియామక సమయంలోనే తెలుస్తుంది.
దాన్ని బట్టే ఎన్ని సీట్లు అన్నది ఖరారు అవుతుంది. అప్పటి వరకు వెలువడే సంఖ్యలన్నీ ఊహాగానాలే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం జనాభా ప్రాతిపదికన ఏ రాష్ర్టంలో ఎన్ని సీట్లు అన్నది ఖరారు కావాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, కొన్ని చోట్ల తగ్గుదల కారణంగా ఆ సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది.రాజ్యాంగం ప్రారంభంలో లోక్‌సభ సీట్లు 500గా ఖరారు చేసింది. తరువాత రాష్ట్రాల పునర్విభజన, ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రాతిపదికన సీట్లను పెంచారు. 1971 జనాభా ప్రాతిపదికనే ఇప్పటికీ సీట్ల సంఖ్య కొనసాగటం సహేతుకం కాదని పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు సీట్లు కేటాయించాలన్నది ఒక అభిప్రాయం. ఉదాహరణకు దాని ప్రకారం 2001 జనాభా ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్‌కు ఏడు సీట్లు పెంచాలి, తమిళనాడుకు ఏడు తగ్గించాలి, అదే 2011 లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు 22 అదనంగా కేటాయించాలి, అదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడుకు 17 సీట్లు తగ్గించాలి.
2021 (ఎప్పుడు జరిగితే అప్పుడు) జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల సీట్లు ఇంకా తగ్గవచ్చు. 2019లో జమ చేసిన ఒక విశ్లేషణ ప్రకారం ఉత్తర భారత్‌కు 32 సీట్లు పెరుగుతాయి, దక్షిణ భారత్‌కు 24 తగ్గుతాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులను జయప్రదంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అన్నది వినిపిస్తున్న మాట. కార్నెగీ సంస్థ విశ్లేషణ మేరకు 2031 జనాభా ప్రకారమైతే ఉత్తరప్రదేశ్, బీహార్ రెండు రాష్ట్రాలకే 21 సీట్లు అదనంగా పెరిగితే, తమిళనాడు, కేరళకు కలిపి 16 తగ్గుతాయి. మొత్తం సీట్లు 848కి పెరిగితే ఒక్క ఉత్తరప్రదేశ్‌కే 143, కేరళకు 20 ఉంటాయి.