Wednesday, January 22, 2025

నారీశక్తి వంచన!

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ధోరణిని గమనించేవారికి దేశాధికార దండం వరుసగా మూడోసారి తన చేతికి ఇప్పుడే వచ్చేసిందనే విజయోత్సాహం ఆయనను ఆవహించినట్టు అనిపించక మానదు. లోక్‌సభలో, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల కల్పన బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందడం పట్ల ఆయన స్పందన అంబర చుంబిత ఆనందాన్ని రుజువు చేసింది. తరచి చూస్తే అది ఎంత బూటకమో బట్టబయలు కాక మానదు. తమది పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ కలిగి, గట్టి సంకల్పం గల ప్రభుత్వం కావడం వల్లనే మహిళల కోటా బిల్లును చట్టం చేయగలిగామని శుక్రవారం నాడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల చివరి రోజున న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో గర్వంగా చెప్పుకొన్నారు. ఇది పాక్షిక సత్యమే. ఆయన అన్నట్టు పార్లమెంటులో బిజెపికి స్పష్టమైన ఆధిక్యత ఉండడమే ఈ బిల్లు చట్టం కావడానికి దోహదం చేసిన మాట వాస్తవమే. అయితే ఈ సానుకూల పరిస్థితి బిజెపికి కొత్తగా ఇప్పుడే వచ్చింది కాదు కదా,

ఎప్పుడో 2019 లోనే వచ్చింది కదా, లోక్‌సభలో 303 స్థానాలు గెలుచుకొన్న తిరుగులేని మెజారిటీ దానికి అప్పుడే సిద్ధించింది కదా. అప్పటి నుంచి మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలన్న సత్సంకల్పం ప్రధాని మోడీకి కలలోనైనా కలగలేదా, ఈ బిల్లు అప్పటికే రెండు దశాబ్దాలకు పైగా పెండింగులో ఉందన్న విషయం ఆయనకు అప్పుడే ఎందుకు గుర్తుకు రాలేదు? 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో, తాము తీసుకొన్న కఠోరమైన జనకంటక విధానాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత అసాధారణంగా పెరిగినందున తప్పనిసరి పరిస్థితుల్లో అందీ అందని మామిడి పండు మాదిరి చట్టాన్ని తీసుకువచ్చిన మాట వాస్తవం కాదా! ఈ మాత్రం దానికి తాము చిత్తశుద్ధితో మహిళలకు అపురూప బహుమతిని అందించామని చెప్పుకోడం బూటకం అనిపించుకోదా? నిజంగానే దేశంలోని మహిళలకు పురుషులతో సమాన స్థితి కల్పించాలంటే తీసుకోవలసిన మౌలిక చర్యలెన్నో వున్నాయి. కుటుంబ వ్యవస్థలో మూలాలున్న కారణాలవల్ల దేశంలో మహిళల ఆత్మహత్యలు విపరీతంగా జరిగిపోతున్నాయి.

2021లో దేశంలో మహిళల ఆత్మహత్యలు 72.5% కాగా, పురుషుల ఆత్మహత్యలు 27.4 శాతమని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఆత్మహత్య చేసుకొన్న మహిళల్లో గృహిణులే అత్యధికులు కావడం గమనించవలసిన విషయం. మహిళను కుంగదీస్తున్న కుటుంబ పీడనను, పురుషాధిక్య ఆధిపత్య భావజాలాన్ని నిర్మూలించకుండా పార్లమెంటులో వారికి రిజర్వేషన్లు కల్పించడం అణగారి వున్న స్త్రీలకు ఎంతమాత్రం మంచి చేయదు. అయినా ఏదో ఒక స్థాయిలో మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతున్నందుకు ప్రజలు, పార్లమెంటులోని దాదాపు అన్ని పార్టీల వారు హర్షించి మద్దతు తెలిపారు. ఇచ్చిందేదో నేరుగా వారికి ఇవ్వాల్సింది పోయి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుభవంలోకి వచ్చేటట్టు ఇవ్వకుండా దాన్ని వారు అందుకోక ముందే అనేక అగడ్తలు, క్విజ్‌లు ఏర్పాటు చేసి చట్టం చేయడం ఎంతవరకు భావ్యం? జనాభా లెక్కల సేకరణ జరిగి, నియోజకవర్గాల పునర్వవస్థీకరణ సైతం పూర్తి అయిన తర్వాత మాత్రమే అమల్లోకి వచ్చేలా మెలిక పెట్టడంలోని ఆంతర్యం ఏమిటి,

ఒక్కసారి పురుషుల స్థానాలు కొంత మేర తగ్గినంత మాత్రాన కొంపలు మునిగిపోయేదేముంది. వచ్చే (2024) లోక్‌సభ ఎన్నికలకు, వున్న స్థానాల్లోనే మహిళలకు 33% కల్పించడంలో ఆక్షేపణ ఏముంటుంది? నియోజక వర్గాల పునర్వవస్థీకరణ ఈసారి వివాదాస్పదం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2026లో జరగవలసిన ఈ ప్రక్రియ వల్ల కుటుంబ నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో సీట్ల వాటా గణనీయంగా తగ్గిపోయే సూచనలున్నాయి. ఈ సమస్యకు సరైన సంతృప్తికరమైన పరిష్కారం కనుగొనవలసి ఉంది. ప్రగతిశీలంగా అడుగులు వేసి దేశ జనభారం తగ్గించినందుకు దక్షిణాదికి ఎక్కువ స్థానాలు లభించేలా చూడవలసి ఉంది. ఈ అడ్డంకులన్నీ తొలగి మహిళలకు కోటా అనుభవంలోకి రావడం గగన కుసుమాన్ని అందుకోడమంత కష్టతరం కాదా?అంతేకాదు ఇంత కాలం ఉత్తరాది సామాజిక న్యాయ పార్టీలు ఎందుకోసం బిల్లును అడ్డుకొన్నాయో ఆ అభ్యంతరానికి అవకాశాన్ని అలాగే వదిలేసి తీసుకొచ్చిన చట్టాన్ని చూపి మీరు చేయలేని పనిని మేము చేశాం చూశారా అని

వారిని గేళి చేయడమెందుకు? 2021లో జరిపించవలసిన జనాభా లెక్కల సేకరణను కోవిడ్ సాకు చెప్పి నిరవధికంగా వాయిదా వేస్తున్న బిజెపి పాలకులు మళ్ళీ అధికారంలోకి వస్తే వాటిని జరిపిస్తారో లేదోనన్న అనుమానం కలగదా? జనాభాలో అత్యధికులైన వెనుకబడిన తరగతుల (ఒబిసి) మహిళలకు, సెక్యులర్ రాజ్యాంగ లక్షణానికి ప్రతీకలైన మైనారిటీల స్త్రీలకు ఉపకోటా లేకుండా, శాసన మండళ్ళు, రాజ్యసభలో కూడా కల్పించకుండా ఇతరులెవరూ చేయని ఘన కార్యాన్ని చేశామని చెప్పుకోడం తగునా? మహిళల కంటి ముందు తాయిలాన్ని ఊపి నారీ శక్తికి వందనం అంటూ తీపి తీపి నినాదాలిచ్చి వారి ఓటు కాజేసే పన్నాగం స్పష్టపడడం లేదా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News