Saturday, November 23, 2024

మహిళా బిల్లు లేడీ సైంటిస్టులకు కానుక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నారీశక్తి వందన్ అధినియాన్ ఇస్రోకు చెందిన మహిళా శాస్త్రవేత్తలకు జాతి తరఫున ఇస్తున్న అపురూప కానుక అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్‌సభలో తెలిపారు. చంద్రయాన్ 3, అంతరిక్ష రంగంలో పలు ఇతర విజయాలను ప్రస్తావిస్తూ తలపెట్టిన చర్చను రక్షణ మంత్రి ప్రారంభించారు. దేశంలో చట్టసభలలో మహిళకు 33 శాతం కోటా అపూర్వ విషయం అని, ఇస్రో ద్వారా అత్యద్భుత విజయాల రూపకల్పనలో పాత్ర పోషించిన మహిళా సైంటిస్టులకు ఈ బిల్లును అంకితం చేయడం సమాదరణతో కూడిన సముచిత చర్య అవుతుందని తెలిపారు. భారతదేశ శాస్త్రీయ విజయాలను, పురోగతిని పలు దేశాలు అడ్డుకోవాలని చూశాయని,

అయితే మన శాస్త్రజ్ఞులు, సాంకేతిక బృందాల సంయుక్త కృషితో వీటిని అధిగమించి మనం ముందుకు వెళ్లామని, ఈ దిశలో భారతీయ మహిళా సైంటిస్టుల పాత్ర గణనీయం అని చెప్పారు. ఇప్పటివరకూ భారతదేశం సంధించిన 424 విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలలో 389 వరకూ నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో గడిచిన తొమ్మిదేళ్లలో చేపట్టినవే అన్నారు. సైన్స్‌కు స్థిర విలువ ఉంటుంది. ఇది తటస్థమైనది. దీని ద్వారానే మనకు అణుశక్తి పరిజ్ఞానం దక్కుతుంది. దీనిని మానవాళి సంక్షేమానికి వాడుకోవచ్చు. ఇదే దశలో ఇతరులను ధ్వంసం చేసే విధ్వంసకర శక్తిగా కూడా వినియోగించుకోవచ్చునని, దేనిని ఎంచుకుంటామనేదే మన ఆలోచనలు చేతలను బట్టి ఉంటుందన్నారు.

చంద్రయాన్ 3 విజయంలో 50 ఏండ్ల పరిశ్రమ
చంద్రయాన్ 3 విజయాన్ని కేవలం ఒక్కరి ఘనతగానే భావించుకోరాదని ప్రధాని నరేంద్ర మోడీపై టిఎంసి ఎంపి సౌగథా రాయ్ మండిపడ్డారు. 50 ఏండ్లుగా సాగుతూ వచ్చిన వివిధ పరిశోధనల పరిపూర్ణత ఫలితంగానే చంద్రయాన్ 3 విజయవంతం అయిందని తెలిపారు. దీని క్రెడిట్‌ను సొంత ఖాతాలో వేసుకునే ప్రయత్నాలకు దిగరాదని బిజెపి ప్రభుత్వానికి చురకలు పెట్టారు. అప్పటి ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ , యుఆర్ రావు వంటి వారి అంకితభావం, కృషి ఇప్పటి శాస్త్రీయ సత్పలితాలకు దారితీసిందన్నారు. దేశంలో మనిషి ద్వారా పాకీపని చేసే పద్థతి ఇంకా కొనసాగుతూ ఉంటే భారతీయుడు చంద్రున్ని ఎప్పుడు చేరుకుంటాడని కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం విమర్శించారు. సామాన్య జనం పలు సంక్లిష్ట సమస్యలను ఎదుర్కొంటూ ఉండగా ఇక మనం అత్యున్నత స్థాయికి చేరేదెన్నడు? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News