Monday, December 23, 2024

లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మంగళవారం లోక్‌సభ ముందుకొచ్చింది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం దిగువ సభలో ప్రవేశ పెట్టారు. నారీశక్తి వందన్ అభియాన్ పేరుతో ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 19 దేశ చరిత్ర పుటల్లో చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమోదానికి నోచుకోని ఈబిల్లుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ప్రతిపక్షాలను కోరారు.

“ఎంతో ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరగడమే మా సంకల్పం. నారీశక్తి వందన్ అధినియం మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ బిల్లు మీ ఆమోదంతో చట్టంగా మారుతుందని మహిళలందరికీ భరోసా ఇస్తున్నాను. నూతన పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు చట్టసభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని కోరుతున్నాను. సభ్యులు తీసుకునే ఈ కీలక నిర్ణయం మహిళా సాధికారత ప్రారంభానికి నాంది పలుకుతుంది. సెప్టెంబరు 19 దేశ చరిత్ర పుటల్లో చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచిపోతుంది” అని ప్రధాని సభ్యులను కోరారు. ఈ బిల్లు ఆమోదం పొందితే మహిళా ఎంపీల సంఖ్య 82 నుంచి 181 పెరుగుతుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మేఘ్వాల్ పేర్కొన్నారు. ఈ బిల్లును ప్రవేశ పెట్టిన తరువాత లోక్‌సభ బుధవారానికి వాయిదా పడింది. సెప్టెంబరు 20 (బుధవారం) నుంచి లోక్‌సభలో దీనిపై చర్చ జరగనుంది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఇక రాజ్యసభలో ఈ బిల్లును సెప్టెంబరు 21న ప్రవేశ పెట్టనున్నారు.

కాగా, కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశ పెట్టిన తొలి బిల్లు ఇదే కావడం విశేషం. అయితే తాజా బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లు కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం కొత్తగా మరో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తున్నట్టు తెలిపాయి. అందువల్ల తాజా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశ పెట్టింది.

తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశ పెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగ్ లోనే ఉండిపోయింది. 2014లో ఆ లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో దాదాపు 27 ఏళ్ల తర్వాత మోడీ సర్కార్, మహిళా రిజర్వేషన్లపై కొత్త బిల్లును తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బిల్లు చట్టంగా మారితే లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటికీ, 2027 తర్వాత రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత రొటేషన్ ప్రక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఎంపీలకు అగ్నిపరీక్షే: మోడీ 
సోమవారం ఈ బిల్లుపై కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చ జరిగినప్పుడు ఇది ఎంపీలకు అగ్నిపరీక్షే అని మోడీ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈమేరకు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జనగణన, నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియలు పూర్తయిన తర్వాత 2027నాటికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News