న్యూఢిల్లీ : మనకాలంలో లింగసమానత్వ న్యాయాన్ని అందించే అత్యంత పరివర్తనాత్మకమైనది మహిళా రిజర్వేషన్ బిల్లు అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభివర్ణించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ బిల్లు వల్ల లోక్‌సభ , అసెంబ్లీస్థానాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు స్థానిక సంస్థలలోనే 33 శాతం మహిళలకు లభిస్తుండగా, ఇప్పుడు లోక్‌సభ, శాససనభల్లో కూడా లభించనుండడం విప్లవాత్మక పరిణామంగా ఆమె పేర్కొన్నారు.
ఢిల్లీ లోని విజ్ఞాన్‌భవన్‌లో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఆసియా పసిఫిక్ ద్వైవార్షిక సదస్సును బుధవారం ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. బుధవారం ,గురువారం రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. గ్లోబల్ అలియన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సెక్రటరీ అమినా బోయాచ్, ఎపిఎఫ్ చైర్‌పర్శన్ డూహ్వాన్ సాంగ్, ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్‌పర్శన్ జస్టిస్ అరుణ్‌కుమార్ మిశ్రా తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.