స్టేషన్ ఘన్‌పూర్: మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య మహిళా పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతా మహంతి అన్నారు. మంగళవారం స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత వారం వచ్చిన మహిళలకు చేసిన పరీక్షలు, రిపోర్టులను పరిశీలించి అధికారులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఒబేసిటీ, రక్త, మూత్ర పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు, న్యూట్రీషియన్ తదితర పరీక్షలను స్థానిక ఆసుపత్రిలో చేసి రోగ నిర్దారణ అనంతరం నివారణ కోసం మందులు ఇవ్వడంతో పాటు అవసరం ఉన్న వారికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు రిఫరల్ చేయనున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలు వైద్య పరీక్షలు చేయించుకోలేని స్థితిలో ఉన్న మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆసుపత్రిలో ఆరోగ్య మహిళా పథకం కింద చేపట్టిన ఏర్పాట్లు వైద్య సేవలను పరిశీలించిన కమిషనర్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ సుగుణాకర్ రాజు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్, వైద్యాధికారులు సంధ్యారాణి, ప్రసన్నకుమార్, సంధ్య, డీఆర్‌డీఓ రాంరెడ్డి, ఆర్డీవో కృష్ణవేణి, తహసీల్దారు పూల్‌సింగ్ చౌహాన్, ఏపీఎం కవిత, సీహెచ్‌ఓలు సాంబయ్య, వెంకటస్వామి, స్టాఫ్ నర్సులు సునీత, రజిని, నిహారిక, ఆశా జ్యోతి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.