న్యూఢిల్లీ : పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా గుండెజబ్బుల బాధితులని 50 దేశాలకు చెందిన 15 అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెజిల్, చైనా, ఈజిప్టు, ఇండియా, అరేబియా గల్ఫ్‌దేశాలు, అమెరికా తదితర 50 దేశాల నుంచి నిర్వహించిన 15 అధ్యయనాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయని అమెరికా లోని మసాచుసెట్స్‌లోవెల్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ మహ్‌డీ ఒ. గర్లెనబీ వివరించారు. మహిళలు ఛాతీ నొప్పియే కాకుండా వాంతులు,దవడనొప్పి,పొత్తికడుపు నొప్పి వంటి అదనపు లక్షణాలతో బాధపడుతున్నారని పరిశోధకులు ఈ అధ్యయనంలో గుర్తించారు.
గుండెజబ్బులను గుర్తించడం, చికిత్సలో పురుషులకు, మహిళలకు మధ్య విపరీతమైన వ్యత్యాసం కనిపించిందని గర్లెనబీ తెలిపారు. జర్నల్ ఆర్టీరియోస్క్లెరోసిస్, థ్రాంబోసిస్, వాస్కులర్ బయోలజీ లో ఈ విశ్లేషణ వెలువడింది. ముఖ్యంగా యువతుల్లో గుండెపోటు శాతాలు మరీ పెరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు 1995 నుంచి 2014 మధ్యకాలంలో 35 నుంచి 54 ఏళ్ల మహిళల్లో గుండెపోటు సంఘటనలు 21 నుంచి 31 శాతం వరకు పెరిగాయని అధ్యయనం ఉదహరించింది.
ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని గర్లెనబీ ఆందోళన వెలిబుచ్చారు. గర్భిణిగా ఉన్న సమయంలో ముందుగా నెలసరి ఆగిపోవడం, లేదా భారీగా రుతుస్రావం జరగడం , రక్తపోటు రుగ్మతలు రిస్కు ఫ్యాక్టర్స్‌గా పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విశ్లేషణ దాదాపు 2.3 మిలియన్ ప్రజల అనుభవాలతో ముడిపడి ఉందని పరిశోధకులు వివరించారు.