భారత దేశంలో ఆడపిల్లల చదువు, వారి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది సావిత్రి బాయి ఫూలే అని చెప్పవచ్చు. ఆమె స్త్రీ అభ్యున్నతికి కృషి చేసిన మొట్టమొదటి బహుజన మహిళ. అనాదిగా ‘స్త్రీ’ చైతన్యానికి తల్లివేరుగా చెప్పబడిన ‘విద్య’ను నిరాకరించబడి సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులకు దూరమైనది. దీనికి తోడు 19వ శతాబ్దం నాటి అసంబద్ధ సామాజిక వ్యవస్థలో మహిళ సామాజిక చైతన్యాన్ని ఎవరు కూడా ఊహించరు. కానీ, ఆమె తన భర్త జ్యోతిరావు ఫూలేకు తోడుగా నిలవడంతో పాటు ‘నా ధర్మాన్ని నేను నెరవేరుస్తానని’ మహిళలకు విముక్తి కల్పించిన గొప్ప యోధురాలుగా నిలిచింది.
ఆ కాలంలో దేశంలో చాలా మంది మహిళలు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరించబడి అంధకారంలోకి నెట్టబడ్డారు. ఈ మానవ నిర్మిత అడ్డుగోడలను ఎదిరించిన భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా నిలిచిన మహిళా చైతన్య దీప్తి సావిత్రిబాయి ఫూలే. ఈ మాతృమూర్తి మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నాయాగవ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. నిరక్షరాస్య అమాయక బాల్యంలో జీవిస్తున్న ఆమెకు 9వ యేటనే నిమ్నవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన 12 సంవత్సరాల జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగినది. భర్త ప్రోత్సాహంతో ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలై, అహ్మద్‌నగర్‌లోని ఉపాధ్యాయ శిక్షణ పొందినది. అనంతరం విద్య ఉద్యమానికి పునాది వేశారు.
విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన సావిత్రిబాయి ఫూలే 1848లో భర్తతో కలిసి బాలికల కోసం పుణెలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించి స్త్రీలకు చదువు చెప్పినది. దీంతో సావిత్రిబాయి ఫూలేకు అగ్రవర్ణ సనాతన సమాజంనుంచి వేధింపులతోపాటు భౌతిక దాడులు ఎదురైనాయి. చివరకు వారిద్దరూ గృహ బహిష్కరణకు కూడా గురైనారు. అయినప్పటికీ వారు మొక్కవోని ధైర్యంతో మడమతిప్పని పోరాటం చేశారు. మహిళా హక్కులే మానవ హక్కులనీ నినదించిన సావిత్రి బాయి అనేక సామాజిక సమస్యలపై కూడా అలుపెరుగని పోరాటం చేశారు. ముఖ్యంగా స్త్రీలను చైతన్యపరచడానికి 1852 లో ‘మహిళా సేవ మండల్’ అనే మహిళా సంఘాన్ని స్థాపించారు. లింగ వివక్షకు, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. నిచ్చెనమెట్ల కులంలో చోటుచేసుకున్న సామాజిక అణచివేతను, మూఢత్వాన్ని పారద్రోలి ‘సత్యాన్ని‘ శోధించడానికి 1873లో తన భర్త మహాత్మ జ్యోతిరావు ఫూలేతో కలిసి సత్యశోధక సమాజాన్ని ప్రారంభించారు.
ఈ సంస్థ ద్వారా బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నడిపారు. వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్ళు లో వెలుగు చూపారు. వితంతు స్త్రీల శిరోముండనాన్ని తీవ్రంగా ఖండించారు. సత్యశోధక్ సమాజ్‌లోని ‘మహిళా విభాగం’ సావిత్రిబాయి నేతృత్వంలో వివాహాలు వంటి శుభకార్యాలు పురోహితులు లేకుండానే నిర్వహించే విధానానికి శ్రీకారం చుట్టారు. కరువుబారిన పడి అనాధలైన పిల్లలను అక్కున చేర్చుకున్నారు. యశ్వంత్ రావు అనే అనాథ బాలున్ని దత్తపుత్రుడిగా పెంచుకొని కోట్లాది మంది పిల్లలకు అక్షరాలు నేర్పిన ఆది దంపతులుగా భారతీయ సమాజంపై చెరగని ముద్రవేశారు.
సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, పీడిత వర్గ స్త్రీల అభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళ ఉద్యమకారిణే కాక గొప్ప రచయిత్రి కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 1854లో ఆమె తన కవితా సంపుటి ‘కావ్య ఫూలే’ను ప్రచురించినవి. తరువాత కవితా సంపుటి ‘పావన కాశి సుబోధ్ రత్నాకర్’ను 1891లో ప్రచురించారు. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892 పుస్తకరూపంలో వచ్చాయి. 1890 నవంబర్ 28న భర్త జ్యోతిరావు ఫూలే మరణించడంతో అంతులేని దుఃఖసాగరంలో ఉన్నప్పటికీ తన భర్త చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెర లేపారు. తదుపరి సత్యసోధక్ సమాజ్ బాధ్యతలను స్వీకరించారు. మహారాష్ట్రలోని పుణె నగరాన్ని అతలాకుతలం చేస్తున్న తీవ్ర కరువు, ప్లేగు వ్యాధిగ్రస్థులకు యశ్వంత్ రావుతో కలిసి సేవలందించారు.
చివరకు ఆమె కూడా ప్లేగు వ్యాధి బారినపడి మార్చి 10, 1897లో తుదిశ్వాస విడిచారు. భారతదేశంలో సావిత్రిబాయి ఫూలే మహిళల హక్కుల కోసం కృషి చేసిన తొలి మహిళా విప్లవకారిణిగా నిలిచారు. నేటికీ ఆమె త్యాగాలను, పోరాటాలను ప్రతి మహిళ గుర్తు చేసుకొని ఆమె ఆశయ సాధనకై కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అసామాన్యమైన ఆమె సేవలకు గాను 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి ఫూలే జ్ఞాపకార్థం తపాలా స్టాంపు ను విడుదల చేసింది. పుణె విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి ఫూలే పేరు పెట్టారు. సావిత్రిబాయి ఫూలే అక్షర ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఆమె జయంతి రోజున గతేడాది ధర్మ టీచర్ యూనియన్ ఏర్పడింది. విద్యను ప్రజాస్వామీకరించాలని యుద్ధం చేయనుంది. స్త్రీల సాధికారతకు పునాది వేసి, అసామానమైన సేవలందించిన ఆమెను ప్రభుత్వాలు అధికారికంగా స్మరించుకోవాలి. సావిత్రి బాయి ఫూలే జయంతిని జాతీయ మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలి. ఇదే మనం ఆమెకిచ్చే ఘన నివాళి.
సంపతి రమేష్ మహారాజ్
79895 79428