Wednesday, January 22, 2025

వృద్ధుడిపై వలపు వల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వృద్ధుడికి వలపు వల విసిరి రెండు బంగారు గొలుసులు ఎత్తుకుని వెళ్లిన సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రెండు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మేడ్చల్‌కు చెందిన శిరీష(36), ఎన్టిఆర్ నగర్‌కు చెందిన ఉన్నీసా బేగం అలియాస్ సమీనా(40) బ్యూటీషియన్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో నాగోలు మత్తుగూడ సమీపంలోని తాజా హోటల్‌లో ఇటీవల ఓ వద్ధుడిని పరిచయం చేసుకున్నారు. వీరి ప్లాన్‌లో భాగంగా అతడి మొబైల్ నంబర్ తీసుకున్నారు.

తరచూ ఇద్దరు వృద్ధుడితో మాట్లాడేవారు. ఆదివారం ఉదయం హోటల్ వద్దకు వచ్చి వృద్ధుడికి ఫోన్ చేసి, హోటల్ వద్దకు రావాలని కోరారు. దానికి వృద్ధుడు ఇంట్లో ఎవరూ లేరని, తాను రాలేనని చెప్పి, వారిని ఇంటికి రావాల్సిందిగా కోరాడు. దీంతో ఇదే అదునుగా భావించిన ఇద్దరు ఇంటికి వెళ్లారు. అక్కడ వృద్ధుడిని మాటల్లో పెట్టి అతడి మెడలోని రెండు బంగారు గొలుసులను లాక్కుని పారిపోయారు. వారు వెళ్లిపోయిన తర్వాత చూసుకున్న వృద్ధుడు వెంటనే నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉన్నీసాబేగం మరో వ్యక్తితో కలిసి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News