న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఎ)లో మహిళల ప్రవేశానికి అనుమతిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. త్రివిధ దళాల అధిపతులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. గతంలో ఈ పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతించక పోవడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు మహిళలకు పరీక్షకు అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్రం వెల్లడించింది. మహిళలు రక్షణ సర్వీసుల్లో కమిషన్ పొందేందుకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వీలు కల్పించాలని గత నెల 18 న సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం మహిళలను తాత్కాలిక కమిషన్ ఆఫీసర్లు గానే తీసుకుంటున్నారు. అయితే పురుషులకు ఇచ్చినట్టే మహిళలకు కూడా పర్మినెంట్ కమిషన్ ఇవ్వాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం స్పందిస్తూ గత విచారణ లోనే ఈ నిర్ణయం తీసుకుంటే తాము జోక్యం చేసుకోవలసిన అవసరం ఉండేది కాదని, భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారో తమ నుంచి ఎలాంటి ఆదేశాలు అవసరమవుతాయో ఆమేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సూచించింది. దేశంలో మహిళలకు శాశ్వత కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే దానిపై నిర్దిష్ట కాల వ్యవధి ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది. దీనిపై అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఇశ్వర్య బాతి మాట్లాడుతూ ఎన్‌డిఎ, నేవీ అకాడమీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఇవ్వాలని త్రివిధ దళాల అధిపతులు, కేంద్రం నిర్ణయించడం గొప్ప వార్తగా పేర్కొన్నారు. స్త్రీపురుష సమానత్వంపై సాయుధ దళాలు మరింత కృషి చేయాల్సి ఉంది. సాయుధ దళాల అధిపతులు ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నానని జస్టిస్ ఎన్‌కే కౌల్ పేర్కొన్నారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
Women to be allowed to enter National Defense Academy