Thursday, January 23, 2025

దేశంలో ‘మొబైల్ జెండర్ గ్యాప్’!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే జిఎస్‌ఎం అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం కొవిడ్ పాండెమిక్ తరువాత దాదాపు 112 మిలియన్ మహిళలు అదనంగా మొబైల్ వాడకం ప్రారంభించారు. గతంతో పోలిస్తే ఇంత పెద్ద సంఖ్యలో స్త్రీలు కొత్తగా మొబైల్ వాడకం ప్రారంభించినప్పటికీ మొబైల్ వాడుతున్న పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య 143 మిల్లియన్లు తక్కువగా ఉంది. అందులోనూ స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్న స్త్రీల సంఖ్య మరింత తక్కువ. మొత్తం దక్షిణాసియాలో 58 శాతం మంది మహిళలు ఇప్పుడు మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నప్పటికీ పురుషులతో పోలిస్తే మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్న మహిళల సంఖ్య 234 మిలియన్లు తక్కువగా ఉంది.

Women used smartphone

ఈ మధ్యనే గర్ల్ ఎఫెక్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిని ఒకరిని కలిసాను. ఇరవై దేశాలలోని బాలికలతో పని చేసే ఈ సంస్థ బాలికలు తమ జీవితాలకు, కెరీర్‌కు, లైంగికతకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలిగేందుకు అవసరమైన సమాచారాన్ని ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా వారికి అందిస్తుంది. బాలికలు తమ స్నేహితులతో, గురువులతో, బంధువులతో చివరకు తలిదండ్రులతో కూడా చర్చించడానికి బిడియపడే ఎన్నో విషయాలను తమ వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుకుంటూ బిగ్ సిస్ అని పిలవబడే వాట్సాప్ చాట్ బాట్ ద్వారా నిస్సంకోచంగా చర్చించి వారి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం గర్ల్ ఎఫెక్ట్ కల్పిస్తుంది. పాండెమిక్‌కు ముందుకన్నా ఇప్పుడు బాలికలు ఎక్కువ సంఖ్యలో తమ వివిధ సాంకేతిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నారనీ, పెద్ద సంఖ్యలో అమ్మాయిలు ఇంటర్నెట్ మాధ్యమాలను వినియోగించడం వలన వారికి అంతర్జాలంలో సేఫ్ స్పేసెస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనీ, అవి వారి సాధికారతకు ఎంతగానో తోడ్పడతాయనీ ఆమె అన్నారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధుల మిషన్ సంస్థ అమలు చేస్తున్న హఖ్దర్శక్ అనే మొబైల్ యాప్ ప్రాజెక్ట్ గురించి కూడా ఇటీవల చదివాను. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు వందలకు పైగా సంక్షేమ పథకాల వివరాలు, వాటికి సంబంధించిన అర్హతలు, వాటికి దరఖాస్తు చేసుకునే పద్ద్ధతి తదితర వివరాలన్నీ ఈ యాప్‌లో పొందుపరచబడి ఉన్నాయి. ఈ యాప్‌ను వినియోగించే లైసెన్స్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలలో సభ్యులైన మహిళలకు ఉంటుంది. వారు తమ గ్రామాలలో ఇంటింటికీ తిరిగి ఆయా కుటుంబాల వారు ఏ పథకాలకు అర్హులో తెలియచేసి వారితో ఆ పథకాలకు దరఖాస్తు చేయిస్తారు. అందుకు ప్రతిగా ఆ మహిళలకు కొద్ది మొత్తం లో రుసుము చెల్లిస్తారు. ఒకవైపు ప్రజల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను వారికి చేరువ చేస్తూనే మరొక వైపు మహిళలకు చిన్నపాటి ఆదాయ మార్గాన్ని చూపించే మంచిప్రయత్నం ఇది.

మహిళల సాధికారత దిశగా ఎప్పటి నుండో జరుగుతున్న ప్రయత్నాలకు టెక్నాలజీ ఎలా తోడ్పడగలదో తెలిపేందుకు ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఈ రోజు ఇంటి నుండే పని చేస్తూ కేవలం మొబైల్ ఫోన్ ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటూ కుటుంబాలకు చేయూతనందిస్తున్న మహిళల గురించి మనకు తెలుసు. స్త్రీ సాధికారతలో మొబైల్ ఫోన్ పాత్రను తక్కువగా చూసేందుకు, నిర్లక్ష్యం చేసేందుకు వీలులేదు. కమ్యూనికేషన్‌కు మాత్రమే కాకుండా వివిధ అంశాల మీద తమ విషయ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకునేందుకు, తమ నైపుణ్యాలను మార్కెట్ చేసుకునేందుకు, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు, తమ నెట్‌వర్క్‌ను పెంపొందించుకునేందుకు, ఇవేమీ కాకున్నా కాసేపు సరదాగా కాలక్షేపం చేసేందుకు మగవారికి ఎలా అయితే మొబైల్ ఫోన్ ఉపయోగపడుతుందో స్త్రీలకు కూడా అలాగే ఉపయోగపడుతుంది. అయితే అనేక కారణాల వలన స్త్రీలు మొబైల్ ఫోన్‌లు వాడడంపై ఎన్నో పరిమితులు ఉన్నాయి.

2021 మొబైల్ జెండర్ గ్యాప్ నివేదిక కూడా మొబైల్ ఫోన్‌ల వినియోగంలో ఉన్న జెండర్ అసమానతలను ఎత్తిచూపింది. కొవిడ్ పాండెమిక్ తర్వాత దేశమంతటా మొబైల్ ఫోన్ల వాడకం విస్తృతంగా పెరిగినప్పటికీ దానిలో జెండర్ గ్యాప్ ఎంతో ఉందని ఈ నివేదిక చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే జిఎస్‌ఎం అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం కొవిడ్ పాండెమిక్ తరువాత దాదాపు 112 మిలియన్ మహిళలు అదనంగా మొబైల్ వాడకం ప్రారంభించారు. గతంతో పోలిస్తే ఇంత పెద్ద సంఖ్యలో స్త్రీలు కొత్తగా మొబైల్ వాడకం ప్రారంభించినప్పటికీ మొబైల్ వాడుతున్న పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య 143 మిల్లియన్లు తక్కువగా ఉంది. అందులోనూ స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్న స్త్రీల సంఖ్య మరింత తక్కువ. మొత్తం దక్షిణాసియాలో 58 శాతం మంది మహిళలు ఇప్పుడు మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నప్పటికీ పురుషులతో పోలిస్తే మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్న మహిళల సంఖ్య 234 మిలియన్లు తక్కువగా ఉంది.

ఇంకా 374 మిలియన్ల స్త్రీలు మొబైల్ కనెక్టివిటీ లేకుండా ఉన్నారు.ఫోన్లు కొనుక్కునే స్థోమత లేకపోవడం, చదువు లేకపోవడం, సాంకేతిక నైపుణ్యాలు లేకపోవడం, అవగాహన లేకపోవడం వంటి కారణాలతో పాటు సమాజంలో స్త్రీల పట్ల ఉన్న వివక్షాపూరితమైన కట్టుబాట్లు, వారి భద్రతకు సంబంధించిన అంశాలు ఈ పరిస్థితికి కారణాలుగా ఈ అధ్యయనం పేర్కొంది. స్త్రీలు మొబైల్ ఫోన్ వాడడం సమాజంలో స్త్రీలకు ఆపాదించబడిన కట్టుబాట్లను ఛేదించే అవకాశం కల్పిస్తుంది. అది కొందరికి భయం కలిగించే విషయం. మొబైల్ ఫోన్ అధికంగా వాడే స్త్రీలను చెడిపోయిన వారుగా చూసే ధోరణులూ లేకపోలేదు. దానితో పాటు తమ కుటుంబంలోని స్త్రీలు ఆన్‌లైన్‌లో వేధింపులకు గురి అవుతారేమో అనే భయం వలన కూడా అనేక కుటుంబాలు స్త్రీలను మొబైల్ ఫోన్ వాడకుండా నియంత్రిస్తున్నాయి. ఇది వాస్తవం కూడా. 2018 నుండి 2022 మధ్య కాలంలో స్త్రీల మొబైల్ వాడకం ఎంత పెరిగిందో వారిపై జరుగుతున్న సైబర్ నేరాల సంఖ్య అంతగానూ పెరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఈ నాలుగు సంవత్సరాలలో స్త్రీలపై జరిగిన సైబర్ నేరాల సంఖ్య 110 శాతం పెరిగింది. ఒక్క 2021వ సంవత్సరంలోనే కేంద్ర హోమ్ మంత్రి త్వ శాఖ నిర్వహించే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఆరు లక్షల కేసులు నమోదయ్యాయి అంటే సమస్య తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.

అయితే చేతిలో ఒక్క మొబైల్ ఫోన్ ఉండడం స్త్రీకి ఎంత ధైర్యాన్నిస్తుందో, వారిని సాధికారత వైపు ఎంత వేగంగా నడిపించగలదో ఈ సమా జం గుర్తించాల్సిన అవసరం ఉంది. స్త్రీలు తమ ఆరోగ్యానికి, పోషణకూ సంబంధించిన ఎన్నో విషయాలను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రత్యక్షంగా పాల్గొనలేని ఎన్నో వేదికలలో, చర్చలలో పాలుపంచుకోవచ్చు. తమ నైపుణ్యాలకు తగిన ఉపాధి అవకాశాలను గురించి తెలుసుకోవచ్చు. తమకు ప్రమాదం ఎదురవుతుంది అనిపించినప్పుడు వెంటనే తమ దగ్గరి వారికి తెలియపరచవచ్చు. తమ కెరీర్, చదువుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే మగవారికి ఒక మొబైల్ ఫోన్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో స్త్రీలకు అంతకన్నా ఎక్కువగానే దాని ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీ చేతిలో ఒక మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండే రోజు ఇంకా ఎంతో దూరంలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ మహిళా సాధికారత సాధించగలగాలంటే అందుకు అత్యంత వేగవంతమైన మార్గం ఇదొక్కటే. ఇప్పటికీ స్త్రీలకు ఎన్నోరంగాలలో ప్రవేశం లేదు. వీధులలోనూ, విద్యాసంస్థలలోనూ, కార్యాలయాలలోనూ, ఎంతో మందికి తమ స్వంత ఇళ్ళలోనూ కూడా వేధింపులు తప్పడం లేదు. సామాజిక కట్టుబాట్లు ఇంకా కోట్లాది మంది స్త్రీలను వంటింటికే పరిమితం చేశాయి. అటువంటి స్త్రీలకు బయట ప్రపంచంతో సంబంధం ఏర్పాటు చేసుకుని తమ విషయ పరిజ్ఞానం పెంపొందించుకుని తమ పరిధిని విస్తృతం చేసుకునే వెసులుబాటు మొబైల్ ఫోన్ వలన కలుగుతుంది. అది కూడా వారి చేతికి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చి వారిని సైబర్ స్పేస్‌లో అయినా వేధించకుండా కాస్తంత ఊపిరి తీసుకోనిస్తే.

భారతి కోడె
9440103411

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News